మూడు పార్టీలకు ‘గ్రేటర్’ ఎందుకింత కీలకమైంది ?
x
revanth kcr and kishan

మూడు పార్టీలకు ‘గ్రేటర్’ ఎందుకింత కీలకమైంది ?

తొందరలో జరగబోతున్న పార్లమెంటుఎన్నికల్లో మూడుపార్టీల వ్యవహారమేంటో తేలిపోతుంది. తెలంగాణాలో 17 పార్లమెంటు సీట్లున్నా నాలుగు సీట్లు హాట్ టాపిక్ అయిపోతున్నాయి


తొందరలో జరగబోతున్న పార్లమెంటుఎన్నికల్లో మూడుపార్టీల వ్యవహారమేంటో తేలిపోతుంది. తెలంగాణాలో 17 పార్లమెంటు సీట్లున్నా నాలుగు సీట్లు మాత్రం బాగా హాట్ టాపిక్ అయిపోతున్నాయి. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ళ నియోజకవర్గాలున్నాయి. వీటిలో చాలాకాలంగా హైదరాబాద్ పార్లమెంటులో ఎంఐఎంను ఓడించటం మిగిలిన పార్టీలవల్ల కావటంలేదు. ఏదో పోటీచేస్తున్నామంటే పోటీచేస్తున్నట్లుగానే పార్టీలు వ్యవహరిస్తున్నాయి. కారణం ఏమిటంటే హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీనియోజకవర్గాలు ఓల్డ్ సిటీలోనే ఉన్నాయి. ఓల్డ్ సిటి అంటేనే ముస్లిం ప్రాబల్యమున్న నగరమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టే ఈ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ అందులోను ఓవైసీ కుటుంబమే గెలుస్తోంది.

అయితే ఈసారి ఎంఐఎంను ఓడించేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. బీజేపీ తరపున మాధవీలత పోటీచేస్తుంటే కాంగ్రెస్ ఇంకా అభ్యర్ధిని ప్రకటించలేదు. బహుశా ఎంఐఎంతో ఉన్న సంబంధాల వల్ల ఎవరో ఒకరిని కాంగ్రెస్ నామమాత్రంగా పోటీకి దింపే అవకాశాలున్నాయి. బీజేపీ మాత్రం సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని ఓడించాలని కంకణం కట్టుకున్నది. అయితే ఈ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే గోషామహల్ బీజేపీ ఎంఎల్ఏ రాజాసింగ్ ఎంపీ అభ్యర్ధికి పెద్దగా సహకరించటంలేదనే ఆరోపణలున్నాయి. రాజాసింగ్ సహకారం లేకపోతే బీజేపీ గెలుపు అనుమానమే. బీజేపీ అభ్యర్ధి మహిళ పైగా పార్టీకి కొత్త. అయితే నరేంద్రమోడి ఇమేజి, అయోధ్యలో రామాలయం నిర్మాణం తదితరాలే తనను గెలిపిస్తాయని మాధవీలత బాగా నమ్మకంతో ఉన్నారు. ఇక మల్కాజ్ గిరి నియోజకవర్గాన్ని తీసుకుంటే బీజేపీ అభ్యర్ధిగా ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుండి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్ధిగా రాగిడి లక్ష్మారెడ్డి పోటీలో ఉన్నారు.

ముగ్గురు అభ్యర్ధులకు ప్లస్సులు, మైనస్సులున్నాయి. ముగ్గురు అభ్యర్ధులకు స్ధానిక నాయకత్వం సరిగా సహకరించటంలేదని ఆరోపణలున్నాయి. చేవెళ్ళల్లో కాంగ్రెస్ తరపున జీ రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున కాసాని జ్ఞానేశ్వర్, బీజేపీ అభ్యర్ధిగా కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీచేస్తున్నారు. ఇక్కడ కూడా అభ్యర్ధులకు సానుకూల, వ్యతిరేక అంశాలున్నాయి. సికింద్రాబాద్ లో బీజేపీ తరపున తెలంగాణా అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుండి దానంనాగేందర్, కారుపార్టీ తరపున టీ పద్మారావు గౌడ్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ లో దానంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పద్మారావుకు పార్టీలో వ్యతిరేకత లేదు కాని పనిచేయటానికి నేతల్లేరు. చాలామంది సీనియర్లు బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇక కిషన్ సంగతి చూస్తే పార్టీ పట్టు అంతంతమాత్రమే. మోడి ఇమేజి, రామాలయమే గెలిపించాలి. కేంద్రమంత్రిగా నియోజకవర్గం అభివృద్ధికి కిషన్ చేసింది కూడా అంతంతే అని జనాలు చెప్పుకుంటున్నారు.

ఇక్కడ విషయం ఏమిటంటే గ్రేటర్ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 16 సీట్లు గెలుచుకున్నది. ఏడు సీట్లు ఎంఐఎం గెలుచుకుంటే ఒక్కసీటులో బీజేపీ గెలిచింది. అంటే కాంగ్రెస్ అధికారంలో ఉందనే కాని రాజధాని ప్రాంతంలో ఒక్కసీటు కూడా లేదు. ప్రస్తుత నాలుగు ఎంపీ సీట్లలోను కాంగ్రెస్ చేతిలో ఒక్కటికూడా లేదు. మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న రేవంత్ ముఖ్యమంత్రి కాగానే ఎంపీగా రాజీనామా చేశారు. కాబట్టి రాజీనామాచేసిన మల్కాజ్ గిరితో పాటు మిగిలిన సికింద్రాబాద్, చేవెళ్ళ పార్లమెంటు సీట్లలో గెలవాలని పట్టుదలగా ఉంది.

ఇక బీఆర్ఎస్ విషయానికి మొన్నటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచిన 16 సీట్లలో పట్టు నిలుపుకోవాలంటే చేవెళ్ళ, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంటు సీట్లను గెలిచితీరాల్సిందే. ఈ సీట్లను గెలుచుకోకపోతే ఎంఎల్ఏలు కారుదిగేయటం ఖాయం. ఇప్పటికే బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం తెలిసిందే. ఎంఎల్ఏలు చేజారకుండా ఉండాలంటే ఎంపీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాల్సిన అగత్యం బీఆర్ఎస్ వచ్చింది. ఇక బీజేపీని చూస్తే నాలుగుసీట్లు గెలుచుకోవటం కిషన్ కు వ్యక్తిగతంగా చాలా అవసరం. తాను గెలవటంతో పాటు మిగిలిన మూడుసీట్లలో పార్టీని గెలిపించకపోతే కేంద్రమంత్రి పదవి ఊడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకనే గ్రేటర్ పరిధిలోని పార్లమెంటు ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి చాలా కీలకమయ్యాయి.

Read More
Next Story