రేవంత్ అంటే పీకేకు ఎందుకింత పగ ? ఇద్దరికీ ఎక్కడ చెడింది ?
x
Revanth and PK

రేవంత్ అంటే పీకేకు ఎందుకింత పగ ? ఇద్దరికీ ఎక్కడ చెడింది ?

వచ్చేఎన్నికల్లో తెలంగాణకు వెళ్ళి మరీ రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతానని ప్రతిజ్ఞ ఎందుకు చేసినట్లు ?


‘‘వచ్చేఎన్నికల్లో తెలంగాణకు వెళ్ళి మరీ రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతాను’’..

‘‘రేవంత్ రెడ్డిని రాహూల్ గాంధీ కాదు కదా ఎవ్వరూ కాపాడలేరు’’..

పై ప్రతిజ్ఞ ఎవరు చేశారో తెలుసా ? రాజకీయ వ్యూహకర్త, బీహార్ వాసి, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్(పీకే). ఎవరి విషయంలో ప్రతిజ్ఞ చేశాడన్న విషయం పైనే తెలిసిపోయింది. కాకపోతే రేవంత్(Revanth) ఓటమికి పీకే ఎందుకు కంకణం కట్టుకున్నాడన్న విషయమే అర్ధంకావటంలేదు. ఒక జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే(PK) మాట్లాడుతు వచ్చేఎన్నికల్లో తెలంగాణకు వెళ్ళి మరీ రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతానని ప్రతిజ్ఞ ఎందుకు చేసినట్లు ? రేవంత్-పీకే మధ్య వైరం ఉండే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే గతంలో ఎప్పుడూ పీకే మీద రేవంత్ మాట్లాడినట్లు లేదు. అలాగే పీకే కూడా తెలంగాణలో కాంగ్రెస్(Telangana Congress)కోసం పనిచేయలేదు.

ఇద్దరూ ఒక అవసరంకోసం ఎప్పుడైనా, ఎక్కడైనా కలిసి పనిచేసుంటే ఇద్దరిమధ్యా అభిప్రాయభేదాలు వచ్చేందుకు అవకాశాలున్నాయి. అలా కలిసిపనిచేసినట్లు కూడా లేదు. ‘‘బీజేపీ, టీడీపీ ఇలా అన్నీపార్టీలు తిరిగి అతికష్టంమీద ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడ’’ని రేవంత్ మీద తన అక్కసునంతా చూపించాడు పీకే. ఇంకోసారి గెలవడని జోస్యం కూడా చెప్పాడు. ‘‘బీహార్ ప్రజల డీఎన్ఏ, తెలంగాణ ప్రజల డీఎన్ఏ కంటే తక్కువ అయినపుడు, ఢిల్లీకి వచ్చి సహాయం చేయమని నన్ను మూడుసార్లు ఎందుకు అడిగాడు’’ ? అని రేవంత్ ను ఉద్దేశించి పీకే ప్రశ్న సంధించాడు. ఈ మాటలనుబట్టి పీకే సహాయాన్ని రేవంత్ కోరినట్లు అర్ధమవుతోంది. అయితే ఏ సమయంలో ? ఏ సందర్భంగా పీకే సహాయాన్ని రేవంత్ కోరాడు అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు.

ఎందుకంటే పోయిన ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేసింది సునీల్ కనుగోలు అనే వ్యూహకర్త. సునీల్ అంతకుముందే కర్నాటకలో కాంగ్రెస్ గెలుపుకోసం పనిచేశాడు. కాబట్టి అధిష్ఠానమే మాట్లాడి సునీల్ ను తెలంగాణకు పంపింది. బీహార్ ఎన్నికలప్రచారంలో పాల్గొన్నపుడు ఎన్డీయే కూటమితో పాటు జన్ సురాజ్ పార్టీని కూడా రేవంత్ విమర్శించి ఉండచ్చు, ఆరోపణలు కూడా చేసుండచ్చు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్దులపై ఆరోపణలు, విమర్శలు కామనే కదా కాబట్టి రేవంత్ పై పీకే ఇంతగా పగపట్టాల్సిన అవసరంలేదు. అయినా రేవంత్ పై పీకే ఇంత కసిగా మాట్లాడాడంటే ఇద్దరి మధ్యా ఏదో జరిగింది ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఏమి జరిగింది అన్నదే ఇపుడు సస్పెన్స్.

అయినా రేవంత్ రెడ్డి ఎలా గెలుస్తాడో చూస్తాను అనేంత సీన్ పీకేకు ఉందా ? జనాలు ఓట్లేస్తేనే ఎవరైనా గెలవగలిగింది. జనాలు రేవంత్ కు లేదా కాంగ్రెస్ కు ఓట్లేయాలని అనుకుంటే పీకే ఏరకంగాను అడ్డుకోలేడు. గతంలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకోసం వ్యూహకర్తగా పీకే పనిచేసిన విషయం తెలిసిందే. అప్పట్లో కాంగ్రెస్ ను పీకే గెలిపించగలిగాడా ? జనాలు ఓట్లేయలేదు కాంగ్రెస్ ఓడిపోయింది. మరి పీకే చాణుక్యం అంతా ఏమైపోయింది ? కాబట్టి తనను తాను ఎక్కువగా ఊహించుకోవటం మానేసి తొందరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విషయమై ఆలోచిస్తే బాగుంటుంది.

Read More
Next Story