రేవంత్ ప్రచారం చేయని నియోజకవర్గం ఇదే
x
Revanth

రేవంత్ ప్రచారం చేయని నియోజకవర్గం ఇదే

ఆ నియోజకవర్గంలో మాత్రం రేవంత్ అడుగుపెట్టనే లేదు. ఆ పార్లమెంటు నియోజకవర్గంలో అభ్యర్ధి గెలుపు ఖాయమనేనా, ఆయన నియెజకవర్గం ఏదిట?


పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా ప్రచారంచేసింది. గెలుస్తుందన్న నమ్మకం బలంగా ఉన్న నియోజకవర్గాలపై తక్కువ దృష్టిపెట్టింది. టఫ్ ఫైట్ ఉందని అనుకున్న నియోజకవర్గాలపై ఎక్కువ దృష్టిపెట్టింది. రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం కాంగ్రెస్ మొత్తం 17 సీట్లకు గాను 14 చోట్ల గెలుస్తుంది. రేవంత్ లెక్కప్రకారం పార్టీ గెలుస్తుందా లేదా అన్నవిషయాన్ని ఇపుడే ఎవరు చెప్పలేరు. ఎందుకంటే బీఆర్ఎస్ 14 సీట్లలో గెలుపు ఖాయమని కేసీయార్, బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని కిషన్ రెడ్డి పదేపదే చెబుతున్నారు. గెలవబోయే సీట్లపై వీళ్ళ అంచనాలు, జోస్యాలు ఎలాగున్నా జనాల మొగ్గు ఎటువైపు అన్నవిషయంలో ఆసక్తి పెరిగిపోతోంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ 27 రోజుల్లో 53 సభలు, రోడ్డుషోలు, కార్నర్ మీటింగుల్లో పాల్గొన్నారు. అత్యధికంగా మల్కాజ్ గిరిలో 9 సభలు, చేవెళ్ళ, మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో చెరో ఏడు సభలు, రోడ్డుషోలు, కార్నర్ మీటింగుల్లో పాల్గొన్నారు. మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, చేవెళ్ళలో గెలుపు రేవంత్ కు వ్యక్తిగతంగా ప్రతిష్టగా మారింది. అందుకనే పై మూడునియోజకవర్గాలపైనే అత్యధిక దృష్టిపెట్టారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ మల్కాజ్ గిరి ఎంపీగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాను రాజీనామా చేసిన నియోజకవర్గంలో ఇపుడు పట్నం సునీతారెడ్డి పోటీచేస్తున్నారు కాబట్టి ఇక్కడ గెలుపు రేవంత్ కు ప్రిస్టేజిగా మారింది.

అలాగే మహబూబ్ నగర్ గెలుపు కూడా అంతే ప్రిస్టేజ్. ఎందుకంటే ఈ నియోజకవర్గం రేవంత్ సొంతజిల్లాలోనే ఉంది. పైగా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలోనే తన అసెంబ్లీ కొండగల్ కూడా ఉంది. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కొండగల్ అసెంబ్లీలోనే అత్యధిక మెజారిటి సాధించి ఎంపీ అభ్యర్ధి చల్లా వంశీచంద్ రెడ్డిని గెలిపించుకోకపోతే అది రేవంత్ కే అవమానం. ఇక చేవెళ్ళ కూడా అలాగే తయారైంది. చేవెళ్ళల్లో గెలుపుపై నమ్మకంతోనే బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చారు. ఇక్కడ బీజేపీ తరపున బలమైన కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీలో ఉన్నారు. రంజిత్ గెలుపుపై అధిష్టానంకు రేవంత్ హామీ ఇచ్చి మరీ టికెట్ ఇప్పించారు. కాబట్టి చేవెళ్ళలో రంజిత్ గెలుపును రేవంత్ ప్రిస్టేజ్ గా తీసుకున్నారు.

అలాగే బీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుందని నమ్మకం పెట్టుకున్న మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో రేవంత్ నాలుగుసార్లు ప్రచారంచేశారు. ఈ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన పార్టీ అభ్యర్ధి నీలంమధును గెలిపించుకోవాలన్నది రేవంత్ పట్టుదల. రేవంత్ ప్రచారంచేసిన 53 సభల్లో 23 సభలు, రోడ్డుషోలు, కార్నర్ మీటింగులు మల్కాజ్ గిరి, చేవెళ్ళ, మహబూబ్ నగర్లోనే ఉండటం గమనార్హం. మిగిలిన 13 నియోజకవర్గాల్లో 30 సభల్లో రేవంత్ నిర్వహించారు.

ఇదే సమయంలో నల్గొండ నియోజకవర్గంలో మాత్రం రేవంత్ అడుగుపెట్టలేదు. కాంగ్రెస్ ఉద్దేశ్యంలో నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపు ఖాయం. ఇక్కడ అభ్యర్ధికి మద్దతుగా తండ్రి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, తమ్ముడు, నాగార్జునసాగర్ ఎంఎల్ఏ కుందూరు జయ్ వీర్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇదే జిల్లాకు చెందిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంతమంది మద్దతుగా నిలిచారు కాబట్టి రఘువీర్ గెలుపుపై నమ్మకంతోనే రేవంత్ ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. రేవంతే కాదు పార్టీలోని ముఖ్యనేతల్లో ఎవరూ నల్గొండలో ప్రచారంచేయకపోవటం గమనార్హం.

Read More
Next Story