
కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తులో రేవంత్ వ్యూహమిదేనా ?
రాష్ట్రప్రభుత్వ సంస్ధలు సరే, మరి కేంద్ర సంస్ధలను దర్యాప్తు చేయించేంత సీన్ సీఐడి లేదా సిట్ కు ఉందా ?
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలపై విచారణ ఎనుముల రేవంత్ రెడ్డి చేతినుండి జారిపోయింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అసెంబ్లీ నిర్ణయించిన ప్రకారం కాళేశ్వరం(Kaleshwaram Scam) అవినీతి, అవకతవకలను కేంద్ర దర్యాప్తు సంస్ధ(CBI) దర్యాప్తుచేస్తుంది. నిజానికి కాళేశ్వరం వ్యవహారాన్ని సీఐడీ లేదా సిట్ దర్యాప్తు చేస్తుందనే అందరు అనుకున్నారు. అయితే ఆశ్చర్యంగా అసెంబ్లీ తీర్మానం పేరుతో కాళేశ్వరం దర్యాప్తును రేవంత్(Revanth) సీబీఐకి అప్పగించాడు. జరిగింది చూస్తుంటే అందరి అంచనాలకు భిన్నంగా సీబీఐ విచారణకు రేవంత్ నిర్ణయించాల్సిన అవసరం ఏమొచ్చింది ? జాగ్రత్తగా ఆలోచిస్తే రేవంత్ ది తెలివైన నిర్ణయమే అనిపిస్తుంది. అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర సంస్ధలు, కేంద్ర ఆర్ధిక సంస్ధలు కాళేశ్వరం ప్రాజెక్టులో పాలుపంచుకున్న మాట వాస్తవం. రాష్ట్రప్రభుత్వ సంస్ధలు సరే, మరి కేంద్ర సంస్ధలను దర్యాప్తు చేయించేంత సీన్ సీఐడి లేదా సిట్ కు ఉందా ? అందుకనే కాళేశ్వరాన్ని రేవంత్ సీబీఐకి అప్పగించింది. ఇదే సమయంలో రాజకీయ కోణం కూడా కనబడుతోంది.
ఎందుకంటే ఫార్ముల ఈ కార్ రేసు వ్యవహారం తెలంగాణను కాదు ఏకంగా దేశపు ఎల్లల్నే దాటిసింది. ఈ కార్ రేసు వ్యవహారంలో బ్రిటన్ కంపెనీ ‘ఫార్ముల వన్ ఆపరేషన్స్’ అనే కంపెనీ ఇన్వాల్స్ అయ్యుంది. రిజర్వ్ బ్యాంకు నిబంధనలను కేటీఆర్ ఉల్లంఘించి మరీ రు. 45 కోట్లను బ్రిటన్ కంపెనీ ఖాతాకు మళ్ళించారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎన్నిసార్లు డిమాండ్ చేసినా రేవంత్ పట్టించుకోలేదు. ఈ కేసును ఏసీబీనే దర్యాప్తుచేస్తోంది. ఈ కేసులో కీలకపాత్రదారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదుచేసినా ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతోంది. ఈ కేసులో మనీల్యాండరింగ్ కోణం ఉందని ఏసీబీకి సమాంతరంగా ఈడీ కూడా దర్యాప్తుచేస్తోంది. ఇదేసమయంలో టెలిఫోన్ ట్యాపింగ్ కేసును రాష్ట్రప్రభుత్వ నియమించిన సిట్ అధికారులే దర్యాప్తుచేస్తున్నారు. ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రమంత్రులు ఎన్నిసార్లు డిమాండ్ చేసినా రేవంత్ పట్టించుకోలేదు.
ఫార్ములా, ట్యాపింగ్ కేసుల్లో సీబీఐ దర్యాప్తు అవసరంలేదని భావించిన రేవంత్ సడెన్ గా కాళేశ్వరం కేసు దర్యాప్తును మాత్రం సీబీఐకి అప్పగించాలని ఎందుకు డిసైడ్ చేశారు అన్నదే కీలకం. అసలు ఫార్ములా కార్ రేసు, ట్యాపింగ్ కేసులను సీబీఐకి ఎందుకు అప్పగించలేదు ? ఎందుకంటే కేసుల దర్యాప్తును కేంద్రదర్యాప్తు సంస్ధలకు అప్పగిస్తే కేసీఆర్ ను గుప్పిట్లో ఉంచుకుని బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసుకునేందుకు బీజేపీ ఆరాటపడుతోందని చాలాసార్లు రేవంత్ బహిరంగంగానే ఆరోపించిన విషయం అందరికీ తెలిసిందే. రెండుపార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని చాలాసార్లు రేవంత్ ఆరోపించారు. అలాంటిది కాళేశ్వరం దర్యాప్తును సీబీఐకి ఎందుకు అప్పగించారు ? ఇక్కడే రేవంత్ వ్యూహం అర్ధమవుతోంది.
వ్యూహం ప్రకారమే..
ముందుజాగ్రత్తగా తనచేతికి మట్టి అంటకుండా కేసీఆర్, హరీష్ మీద చర్యలు తీసుకునే బాధ్యతలను సీబీఐ మీదకు రేవంత్ నెట్టేశారని తెలుస్తోంది. కేసీఆర్ ను శిక్షించే అవకాశం కేంద్రానికి ఇచ్చారు. సాధ్యంకాకపోతే ఆనిందను భరించాల్సింది కేంద్రప్రభుత్వం, బీజేపీనే కాని రేవంత్ కాదు. ఇదే నిర్ణయంలో మూడో కోణం కూడా ఉంది. అదేమిటంటే జస్టిస్ ఘోష్ రిపోర్టు ద్వారా కేసీఆర్ మీద చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని న్యాయనిపుణులు రేవంత్ కు సలహా ఇచ్చినట్లు సమాచారం. వ్యవహారం ఒకసారి కోర్టు మెట్లెక్కితే ఎప్పటికి తెములుతుందో ఎవరూ చెప్పలేరు.
కాళేశ్వరంలో అవినీతి, అవకతవకలకు కేసీఆర్ పాల్పడ్డారని కమిషన్ రిపోర్టు ద్వారా తేల్చేందుకే రేవంత్ ప్రభుత్వానికి 20 నెలలు పట్టింది. రిపోర్టు ఆధారంగా కేసీఆర్, హరీష్, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తో పాటు చాలామంది మీద కేసులు నమోదుచేసి దర్యాప్తు చేసి యాక్షన్ తీసుకునేందుకు పుణ్యకాలం గడిచిపోతుంది. ఇంతలో 2028 షెడ్యూల్ ఎన్నికలు వచ్చేస్తాయి. అప్పటికీ కూడా కాళేశ్వరం బాధ్యులపై యాక్షన్ తీసుకోవటం రేవంత్ ప్రభుత్వం వల్ల కాకపోవచ్చు. ఎందుకంటే కేసీఆర్, హరీష్ మీద ప్రభుత్వం కేసులు నమోదుచేయగానే వెంటనే వాళ్ళు కోర్టుల్లో కేసులు వేస్తారు. కోర్టు గనుక స్టే ఇస్తే దాన్ని వెకేట్ చేయించటానికి ప్రభుత్వానికి ఎంతకాలం పడుతుందో ఎవరూ చెప్పలేరు. సో, ఏ కోణంలో చూసినా కేసీఆర్, హరీష్ ను చట్టపరంగా శిక్షించటం రేవంత్ ప్రభుత్వానికి అంత వీజీకాదు. ఈలోపు రేవంత్ తమపై కక్షసాధిస్తున్నారని, కేసులతో వేధిస్తున్నారని బీఆర్ఎస్ నానా గోలచేయటం ఖాయం.
కాళేశ్వరంపై దర్యాప్తు జరిపి, శిక్షలు వేయించటం సీబీఐకి కూడా అంత ఈజీకాదు. ఎందుకంటే ఘోష్ కమిషన్ రిపోర్టు ప్రకారం బాధ్యులు కేసీఆర్, హరీష్ మాత్రమే కాదు ఈటల రాజేందర్ కూడా. కేసీఆర్, హరీష్ బీఆర్ఎస్ అయితే ఈటల బీజేపీ మల్కాజ్ గిరి ఎంపీ. ప్రత్యర్ధులపైన యాక్షన్ తీసుకుని, ఈటలను సీబీఐ వదిలేసేందుకు లేదు. బీజేపీ ఎంపీ మీద కేసునమోదు చేసి దర్యాప్తుచేసేంత సీన్ సీబీఐకి ఉందా ? కాబట్టి సొంత ఎంపీని కాపాడుకోవాలని బీజేపీ పెద్దలు అనుకుంటే కేసీఆర్, హరీష్ కూడా సేఫ్ అయిపోతారు. ఎలాగ చూసినా కాళేశ్వరంలో కేసీఆర్, హరీష్ కు శిక్షలు పడే అవకాశాలు చాలా తక్కువే. ఇవన్నీ ఆలోచించే రేవంత్ ముందుజాగ్రత్తగా కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించేసినట్లు అర్ధమవుతోంది.
పెండింగులో 7 వేల కేసులు
పై విషయాలన్నింటినీ రేవంత్ బాగా ఆలోచించి దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించేసి చేతులు దులుపేసుకున్నట్లు కనబడుతోంది. దీనివల్ల రేవంత్ కు రెండు ప్రయోజనాలున్నాయి. మొదటిది సీబీఐ దర్యాప్తుకు అప్పగించినా కేంద్రం ఏమీచేయటంలేదని బీజేపీ మీద ఆరోపణలు గుప్పించవచ్చు. అలాగే బీఆర్ఎస్-బీజేపీ మధ్యలో లోపాయికారి ఒప్పందం ఉందన్న తమఆరోపణలకు కాళేశ్వరం సీబీఐ దర్యాప్తు తీరునే ఉదాహరణగా రేవంత్, మంత్రులు జనాలకు చెప్పవచ్చు. ఇప్పటికే సీబీఐ చేతిలో సుమారు 7072 వేల కేసులున్నాయి. వీటిల్లో 20 ఏళ్ళకు పైగా దర్యాప్తు చేస్తున్నవే 379 కేసులున్నాయి. వీటికి కాళేశ్వరం దర్యాప్తు కేసు మరోటి కలుస్తుందంతే. 2024, డిసెంబర్ నాటికి మూడేళ్ళుగా పెండింగులో ఉన్న కేసులు 1506. మూడేళ్ళ నుండి ఐదేళ్ళ మధ్యలో పెండింగులో ఉన్న కేసులు 791.
ఐదేళ్ళ నుండి పదేళ్ళ మధ్యలో పెండింగులో ఉన్న కేసులు 2,281. సీబీఐతో పాటు నిందితులు దాఖలు చేసుకుని పెండింగులో ఉన్న సుప్రింకోర్టు, హైకోర్టులోని అప్పీళ్ళ, సవరణలు 13,100. కేసుల్లో జాప్యం, అప్పీళ్ళు చేయటంలో ఆలస్యానికి ప్రధాన కారణం సిబ్బంది కొరత, అధికారుల పనితీరే. ఇలాంటి నేపధ్యంలో కాళేశ్వరం కేసు దర్యాప్తును అత్యంత వేగంగా పూర్తిచేసి కేసీఆర్, హరీష్ కు శిక్షలు పడేట్లుగా సీబీఐ దర్యాప్తు పూర్తిచేస్తుందనే భ్రమలు ఎవరిలోను లేవు. ఇదంతా ఆలోచించే కాళేశ్వరం దర్యాప్తును రేవంత్ సీబీఐకి అప్పగించారా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. తొందరలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తు ఎప్పుడు అవసరమైతే అప్పుడు కేసీఆర్, హరీష్ తో బీజేపీ లోపాయికారి ఒప్పందం కారణంగా సీబీఐ దర్యాప్తు వేగంగా జరగటంలేదని ఆరోపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. క్షేత్రస్ధాయి పరిస్ధితి చూస్తుంటే కాళేశ్వరం కేసు వచ్చే ఎన్నికల్లోగా తేలే అవకాశాలు కనిపించటంలేదన్నది వాస్తవం. తాజా పరిణామాలపై కేంద్రప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
రేవంత్ నిర్ణయం సరైనదే : కూరపాటి
రాజకీయనేతలు ఎప్పుడూ నిజాలు చెప్పరని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ అభిప్రాయపడ్డారు. కాళేశ్వరం కేసు దర్యాప్తు బాధ్యతను రాష్ట్రప్రభుత్వం సీబీఐకి ఇచ్చిన విషయమై కూరపాటి మాట్లాడుతు ‘‘కాళేశ్వరం విచారణను సీఐడీ ద్వారా మాత్రమే చేయిస్తానని నమ్మించి చివరినిముషంలో దెబ్బకొట్టార’’ని చెప్పారు. ‘‘సీఐడీ ద్వారా విచారణ చేయిస్తే సమస్యలు వస్తాయని అనుకుని, కేసీఆర్, హరీష్ కు శిక్షలు పడేట్లుగా చేయలన్న ఉద్దేశ్యంతో చివరినిముషంలో సీబీఐ విచారణకు ఆదేశించార’’ని తెలిపారు. ‘‘కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ప్యామిలీకి ఇప్పటికే జరగాల్సిన డ్యామేజీ అంతా జరిగిపోయింద’’న్నారు.. ‘‘కేసీఆర్ ఫ్యామిలీకి జరగాల్సిన డ్యామేజీ ఏమిటంటే సీబీఐ కేసులు నమోదుచేసి విచారణ మొదలుపెట్టడమే’’ అన్నారు. ‘‘కేసీఆర్ అవినీతి మీద దర్యాప్తుచేయించి శిక్షలుపడేట్లుగా చేయించేంత శక్తి రేవంత్ ప్రభుత్వానికి లేద’’ని చెప్పారు.. కాబట్టే సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించి శిక్షలు పడేట్లుగా రేవంత్ ఆలోచించి ఉంటాడని అభిప్రాయపడ్డారు. ‘‘దర్యాప్తు సక్రమంగా జరిపించటం, శిక్షలు వేయించటం అన్నది ఇపుడు కేంద్రం చేతిలో ఉంద’’న్నారు. ‘‘దర్యాప్తు జరిపించి, శిక్షలు వేయించలేకపోతే అప్పుడు పాపాలన్నీ బీజేపీ, కేంద్రప్రభుత్వం మీద పోతుంద’’ని చెప్పారు. అందుకనే తెలివిగా రేవంత్ కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తును ఆదేశించారు.