తెలంగాణలో ‘ 2024 సన్ బర్న్’  లేదు.  ఇంతకీ సన్ బర్న్ ఫెస్టివల్ అంటే ఏంటి?
x
Source: Sunburn X

తెలంగాణలో ‘ 2024 సన్ బర్న్’ లేదు. ఇంతకీ సన్ బర్న్ ఫెస్టివల్ అంటే ఏంటి?

సన్ బర్న్ అనేది విపరీతంతా క్రేజ్ ఉన్న యూత్ ఎలెక్ట్రానిక్ డాన్స్ ఫెస్టివల్. దీనికి మద్యం, డ్రగ్స్, నగ్న ప్రదర్శనల హబ్ అని చెడ్డ పేరు.ఇంతకీ సన్ బర్న్ కథేంటి?


న్యూ ఇయర్ వేడుకల పేరుతో నిర్వహించే సన్ బర్న్ చిందుల విందు వేడుకకు తెలంగాణ సర్కారు అడ్డు చెప్పింది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సన్ బర్న్ పేరుతో ఒక అంతర్జాతీయ సంస్థ ఈ ఫెస్టివల్ ఈవెంట్లను నిర్వహిస్తుంది. ఇదంతా మద్యం, డ్రగ్స్ సేవించి అరుస్తు, పాడుతూ డ్యాన్స్ చేస్తూ జరిగే ఎలెక్ట్రానిక్ వేడుక. అందుకే దీనిని ఎలెక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ ( Electronic Dance Music :EDM) గా పిలుస్తున్నారు. పాలకులు కూడా భారీగా ముడుపులు స్వీకరించి ఈ యూత్ చిందులాటకు పర్మిషన్ ఇస్తూ ఉంటారని సర్వత్రా అనుమానం. ఈ చిందులాట ఎక్కడ ఏర్పాటు చేసినా అక్కడ వివాదమవుతూ ఉంది. పరిసర ప్రాంతాలలోని ప్రజలు, వ్యాపారస్థులు ఈ ఫెస్టివల్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ప్రజలనుంచి, ప్రజా సంస్థల నుంచి విపరీతంగా వ్యతిరేకత వస్తూ ఉండటంలో ఈ సంస్థకు పరిమిత అనుమతి నిస్తున్నారు. అయితే, ఒక్కటి మాత్రం నిజం, ఈ వినోదానికి యువతీ యువకుల్లో విపరీతమయిన క్రేజ్ ఉంది.

అయితే, తెలంగాణ కొత్త ప్రభుత్వం ఈ అనుమతి కూడా ఇచ్చేందుకు సిద్ధంగా లేదని స్పష్టమవుతున్నది. ఈ చిందుల్లో మద్యంతో పాటు డ్రగ్స్ వినియోగించే అవకాశం ఉన్నందునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ మీద యుద్దం ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ హైదరాబాద్ లో ఇకపై ఇలాంటి వాటికి అనుమతి లేదంటూ చాలా స్పష్టంగా ప్రకటించారు. ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఈవెంట్స్ అనౌన్స్ చేసి బుక్ మై షో ద్వారా సన్ బర్నఫెస్టివల్ ఆర్గనైజర్లు ఆన్ లైన్లో భారీగా టిక్కెట్ల అమ్మకాలు మొదలు పెట్టినట్లు వార్తలు రావడంతో ఆయన మండిపడ్డారు.

బుక్ మై షో ఆన్ లైన్లో టికెట్లు విక్రయించేందుకు పర్మిషన్ ఎవరిచ్చారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనితో పర్మిషన్ లేకుండా ఎలాంటి ఈవెంట్లు నిర్వహించవద్దని, గీత దాటితే చట్టపరంగా చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్ సన్ బర్న్ 2024

హైదరాబాద్‌ 2024 కు స్వాగతం పలుకుతూ హైదరాబాద్ లోని మాదాపూర్‌లో డిసెంబరు 31 రాత్రి ఎనిమిది గంటలకు ఈ ఫెస్టివల్ నిర్వహించాల్సి ఉంది. టికెట్ ధర రు. 2,299 నుంచి మొదాలవుతాయి. బుక్ మై షోలో ప్లాట్ ఫాంలో టికెట్ల విక్రయం కూడా మొదలయింది. అంటే ఎవరో అధికారులు ఈ సంస్థకు ఎన్ వొసి ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్లుగా అనుమానించాలి. ప్రభుత్వ నియమాల ప్రకారమే మద్యం అందిస్తామని కూడా నిర్వాహకులు చెప్పారు.

హైదరాబాద్ కు ఎపుడొచ్చింది

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సన్ బర్న్ ఫెస్టివల్ ను హైదరాబాద్ కు తీసుకురావడంలో నాటి ఐటి మంత్రి కెటి రామారావు కీలకపాత్ర పోషించారు. హైదరాబాద్ అంతర్జాతీయ లీజర్ డెస్టినేషన్ కావాలంటే సన్ బర్న్ వంటి ఫెస్టివల్స్ అవసరమని ఆయన చెప్పేవారు. ఆయన కృషిఫలితంగా ఆయేడాది నవంబర్ 22 న హైదరాబాద్ లో తొలి సన్ బర్న్ ఫెస్టివల్ జరిగింది. అపుడాయన ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.


అప్పటి నుంచి జరుగుతూనే వస్తున్నది. అయితే, ఈ ఫెస్టివల్ ను హైదరాబాద్ కు పట్టుకువచ్చింది కెటిఆర్ కాబట్టే రేవంత్ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఉందా? ఎందుకంటే, అంతర్జాతీయ నగరాలలో ఇలాంటి వేడుకులు కామన్ అవుతున్నాయి. కోర్టులుకూడా కొన్ని మార్గదర్శక సూత్రాలు నిర్ణయించి అనుమతులు ఇస్తుడటం జరుగుతున్నది. పునే లో ప్రజలనుంచి ఎంత వ్యతిరేకత ఉన్నా ఈ సంస్థ కు కోర్టు అనుమతినిచ్చింది.

ముగ్గురు మృతి

గోవ్ సన్ బర్న్ ఫెస్టివల్ బాగా పాపులర్ . దీనికి ఇతర రాష్ట్రాలనుంచి కూడా యువకులు వెళ్లుతూ ఉంటారు. 2019 ఫెస్టివల్ ముగ్గరు తెలుగు యువకులు గోవా ఫెస్టివల్ లో చనిపోయారు. అదే సంవత్సరంలో హైదరాబాద్ వేడుకల్లో మరొకరు చనిపోయారు.

అతిపెద్ద యూత్ ఫెస్టివల్ సన్ బర్న్

ప్రపంచంలో జరిగే టాప్ యూత్ ఫెస్టివల్స్ సన్ బర్న్ ఒకటని 2009లోనే సిఎన్ ఎన్ గుర్తించింది. గోవాలో తొమ్మది సార్లు ఈ ఫెస్టివల్ జరిగింది. తర్వాత అది మ హారాష్ట్ర లో ప్రవేశించింది. అయితే, మద్యం, డ్రగ్స్, నగ్న అశ్లీల నృత్యాల విచ్చలవిడిగా ఈ ఫెస్టివల్ సాగుతున్నట్లు వార్తలు రావడంతో ఈ ఫెస్టివల్ వివాదంలో పడిపోయింది.

గోవాలో వివాదం

గోవాలో ఈ ఏడాది 31వ తేదీన సన్ బర్న్ ఫెస్టివల్ నిర్వహించేందుకు అనుమతి నిరాకరించారు. నిజానికి అక్కడ డిసెంబర్ 28వ తేదీ నుంచి 30 దాకా ఈ యూత్ ఫెస్టివల్ నిర్వహించేందుకు అనుమతినిచ్చారు. దీనికి బాగా స్పందన రావడంతో దీనిని డిసెంబర్ 31 కి పొడిగించి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే వేడుకగా మార్చాలని ఆర్గనైజర్లు భావించారు. అయితే, ఈ లోపు ఈ ఫెస్టివల్ ఆవరణలో జరుగుతున్నదేమిటో తెలిశాక సర్వత్రా ఆందోళన మొదలయింది. సన్ బర్న్ పేరుతో లోపల సాగేదంతా లిక్కర్, డ్రగ్స్ సేవనం మాత్రం. నిజానికి ఈ ఫెస్టివల్ని డ్రగ్స్ భారీగా విక్రయించే హబ్ గా వాడుకుంటుకొన్నట్లు హిందూత్వ సంస్థలనుంచి విమర్శలున్నాయి.

నిజానికి ఈ మూడు రోజులు అనుమతి కూడా చట్ట వ్యతిరేకమని చెబుతున్నారు. 2022లో ఈ ఫెస్టివల్ వివాదం హైకోర్టు దాకా వెళ్లింది. అపుడు బొంబాయి హైకోర్టు గోవా బెంచ్ చాలా స్పష్టంగా 2022 లో సన్ బర్న్ కు ఇచ్చిన అనుమతులు చట్ట వ్యతిరేకమన కోర్టు పేర్కొంది. అయితే, ఈ సారి మూడు రోజుల ఫెస్టివల్ కు అనుమతినిచ్చారు.

మొదటి ఫెస్టివల్ 2007 లో

సన్ బర్న్ మొదటి ఫెస్టివల్ 2007, డిసెంబర్ 27,28 తేదీలో గోవాలోని కాండోలిమ్ బీచ్ లో జరిగింది. 2016 దాకా ఈ కంపెనీ నిరాటంకంగా ఈ ఫెస్టివల్ నిర్వహించింది. అయితే ఏడాది ఈ ఫెస్టివల్ ను నిషేధించారు. అయితే, 2019 నుంచి ఈ కంపెనీ అధికారులను బుజ్జగించి అనుమతులు సంపాదించింది. అయితే, 2022లో రాజేష్ సినారె అనే వ్యక్తి ఈ పెష్టివల్ కు వ్యతిరేకంగా నిర్వహక సంస్థ మెస్సర్స్ సన్ బౌండ్ వెబ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మీద హైకోర్టులో పిల్ వేశారు. ఈ పిల్ మీద తీర్పు ఇస్తూ గోవా బెంచ్ 2022 అనుమతులు చట్ట వ్యతిరేకమని పేర్కొంది.

ఈ ఏడాది కూడా దోబూచూలాట

ఈఏడాది అనుమతుల మీద కూడా గోవా ప్రభుత్వం దోబూచులాడింది. ప్రభుత్వం నుంచి తొలుత సానుకూల స్పందన రావడంతోనే ఈ కంపెనీ 31 తేదీకి తన చిందుల్ని పొడిగిస్తున్నట్లు చెప్పింది. దీనితో హిందూ సంస్థలే రచ్చ చేశాయి. ఇదే విధంగా ప్రజలు, వ్యాపారాస్థులు, నార్త్ గోవాలోని గ్రామాల ప్రజలు అందోళన చేశారు. ఈ ఫెస్టివల్ నిర్వహిస్తే ఆశ్లీల సంస్కృతికి యువతీ యువకులు బలవుతారని విమర్శ వచ్చింది. దీనితో ముఖ్యమంత్రి ప్రమోద సావంత్ వివరణ ఇస్తూ పండగని డిసెంబర్ 31 న నిర్వహించేందుకు అనుమతి ఉండదని చెప్పారు.

పునాలో వివాదం

పూనాలో కూడా ఈ ఫెస్టివల్ వివాదంలో చిక్కుకుంది. 2017 లో అక్కడ లావాలే, భావధాన్ ప్రాంతాల ప్రజలు వ్యతిరేకించడంతో ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అయితే, నిర్వాహకులు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నాక ఆక్స్ ఫోర్డ్ ప్రాంతంలో ఏర్పాటుచేశారు.

ఇలాంటి ఫెస్టివల్స్ ఎంతో కాలం నిషేధించడం కష్టమని ఈ ఇవెంట్లకు వస్తున్న ఆదరణను బట్టి అర్థమవుతుంది. కోర్టులు కొన్ని మార్గదర్శకు సూత్రాలు ప్రకటించి వాటిని పాటించేలా ఉంటే అనుమతినీయాలని చెబుతున్నారు. ఈ మార్గదర్శక సూత్రాలను పాటిస్తున్నారా లేదా అనేదాన్ని పరిశీలించేందుకు గోవా ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అందుకే డిసెంబర్ 28 నుంచి 30 దాకా అనుమతినిచ్చింది. ఇపుడు వివాదమంతా 31 నాటికి పొడిగించాల వద్దా అనేది. అయితే, ప్రజలు ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తూఉండటంతో ప్రభుత్వం పొడిగింపులేదని స్పష్టం చేసింది.

Read More
Next Story