తెలంగాణ పదేళ్లలోనే ఇలా అయిపోయిందేమిటి?
x

తెలంగాణ పదేళ్లలోనే ఇలా అయిపోయిందేమిటి?

ఏ నాయకుడు, ఏ పార్టీతో, ఏ జెండాతో ఓట్లుఅడగడానికి వస్తాడో తెలియని పరిస్థితి. జెండాలు -ఎజెండాలు పక్కదారి పట్టాయి. డబ్బుతో, లిక్కర్ తో కుల బలం ప్రాతిపదిక అయింది.



-రమణాచారి


దేశంలో పార్లమెంట్ ఎన్నికలతో రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. ఏ నాయకుడు, ఏ పార్టీతో, ఏ జెండాతో ఓట్లుఅడగడానికి వస్తాడో తెలియని పరిస్థితి. పార్టీల ప్రణాళికలు, జెండాలు -ఎజెండాలు పక్కదారి పట్టాయి. డబ్బుతో, లిక్కర్ తో కుల బలం ప్రాతిపదికన గెలుచుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. జనం ఆకాంక్షలు పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. తిట్లు,బూతు పురాణాలు వార్తాంశాలుగా మారాయి . ఎవరికి ఎవరు తగ్గకుండా వారసులను పోటీకి దింపే ప్రయత్నాల్లో తలమునకలయ్యారు .

ఒక పార్టీ టికెట్ ఇవ్వకపోతే, ఆ నాయకుడిని ఆ పార్టీని తిడుతూ,మరో పార్టీలో టికెట్ దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు ఎంత అదృష్టవంతులో కదా! అయ్యా! ప్రజాసేవ కోసమేనా ఇదంతా?. సీట్లు సాధించడం కోసం,పదవులు పొందడానికి దిగజారి ప్రవర్తిస్తున్నారు. వీళ్లు రాష్ట్రానికి,దేశానికి, ప్రజలకు ఏం చేయగలరు?

అందుకే ప్రజల ఆలోచనలు కూడా యధా రాజా తథా ప్రజా అన్నట్లుంది. బుద్ధిజీవులు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి దారి చూపలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎటు పాలు పోక, ఏ స్పష్టత రాక గందరగోళంలో పడిపోతున్నారు. స్థూలంగా ప్రస్తుత ఎన్నికల రాజకీయ ముఖచిత్రం ఇది.

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజకీయ అనిష్చితి కొనసాగుతుంది.ఇది చాలా విషాదకరం.ఎన్నో ఆశలు, ఎన్నో ఆకాంక్షలు, ఎన్నో కలలు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అన్ని సమస్యల పరిష్కారం అవుతాయి అన్న భావన.ఆరు దశాబ్దాల ప్రజల కల. నాలుగున్నర కోట్ల ప్రజల చిరకాల వాంఛ. పుష్కర కాలం తర్వాత కూడా ఇంకా పూర్తిగా నెరవేరలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు అనేక రూపాల్లో ఉద్యమించారు. త్యాగాల, గాయాలతో స్వరాష్ట్రం సాధించుకున్నారు. మా భూములు మా ఉద్యోగాలు, మానీళ్లు మాకే అన్నారు. మమ్మల్ని మేమే పాలించుకుంటామన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో కోల్పోయిన వాటిని తిరిగి సాధించుకోవడం, కావలసిన వాటిని నిర్మించుకోవడం తేలికగా జరుగుతుందని భావించారు. ప్రజలందరికీ ఉచిత విద్యా, వైద్యం అందుబాటులోకి వస్తాయనుకున్నారు . వ్యవసాయం,ఉపాధి, సాంస్కృతిక వైభవం, స్వేచ్ఛ- సౌబ్రాతృత్వం, ప్రజాస్వామిక వాతావరణం పెంపొందించే చర్యలు స్వపరిపాలనలో సాధించుకోగలమని భావించారు. భౌగోళిక తెలంగాణ అంటే ప్రత్యేక రాష్ట్రం మాత్రమే ఏర్పడింది. పాలకుడు మనవాడే కాబట్టి మెడలు మంచి పనులు చేయించుకోమని గలవని భావనబలంగా ఉండింది. ఇప్పుడు వారి ఆశలన్నీ, అడియాసలై ఎండమావులుగా మారాయి.


అమరుల త్యాగఫలమైన తెలంగాణలో ఉద్యమకారుల ఊసే లేదు. ఎన్నికల వాగ్దానమైన పెన్షన్, సంక్షేమం, ఇంటి స్థలాల కేటాయింపు పై చర్చ లేదు. వారి సలహాలు సూచనలకు తావులేదు. తలాపున పారుతున్న గోదావరి,కృష్ణా జలాల వినియోగం పైన,రైతాంగ సమస్యల పరిష్కారానికి శాశ్వత ప్రణాళిక రచన జరగలేదు పర్యావరణానికి నష్టం చేసే ఫార్మాసిటీలు రద్దు చేయలేదు. తెలంగాణలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీల నిర్మాణం పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఉత్తర తెలంగాణలో విస్తరించి ఉన్న సింగరేణి భవిష్యత్తుపైన హామీ లేదు.పొడు భూముల సమస్య, కౌలు రైతుల సమస్య చర్చలకే పరిమితం అయ్యాయి. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, సిర్పూర్ కాగజ్నగర్ కాగిత పరిశ్రమ, నిజాంబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు, సింగరేణిలో ఓపెన్ ఓపెన్ కాస్ట్ మైన్స్ రద్దు లాంటివి ఎన్నికల వాగ్దానాలు గానే మిగిలాయి. భద్రాచలం డివిజన్ పరిధిలో ఐదు మండలాలను తిరిగి తెలంగాణ రాష్ట్రంలో కలపాలనే డిమాండ్ నిలిచిపోయింది. సారపాక పేపర్ బోర్డులో,మణుగూరు పవర్ ప్లాంట్ లో, సత్తుపల్లి కిన్లీ వాటర్ ప్లాంట్ లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండ, బయటి నుంచి వచ్చిన వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు అన్న, స్థానికుల ఆవేదనను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల వల్ల స్థానిక ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు తవ్వితే కాలుష్యం సమస్య తగ్గి, ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి. యూనివర్సిటీలలో అధ్యాపకుల కొరత, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ముందడుగు పడటం లేదు. ఉచితవైద్యం పూర్తిగా అందుబాటులోకి రాలేదు సాంస్కృతిక పునరూజ్జీవనంపై చర్చకు సమయమే ఇవ్వడం లేదు!
ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ప్రజల ఆకాంక్షలను, డిమాండ్లను స్పష్టంగా వ్యక్తం చేయలేకపోవడం, ప్రచారం చేయలేకపోవడం వల్లనే తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి దాపురించింది.తెలంగాణ ఉద్యమకారులపై ఉక్కు పాదం మోపిన వారు, ప్రజలపై గన్ను ఎక్కు పెట్టిన వారు, ఉద్యోగుల, లాయర్ల మీటింగులపై భౌతిక దాడులు చేయించిన వారు అధికారంలో కొనసాగుతున్నంతకాలం, ఏ పార్టీ అధికారంలో ఉన్న ప్రజలకు ఒనగూరేది శూన్యం. ప్రజాస్వామిక హక్కుల పునరుద్ధరణ కోసం హక్కుల నేతలు చేస్తున్న డిమాండ్లు పాలకులకు చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లున్నది .ఎన్టీఆర్ నుండి వైయస్సార్ కలుపుకొని కెసిఆర్ తో సహా నేడు రేవంత్ రెడ్డి కూడా నక్సలైట్ల సమస్యపై అన్ని పార్టీలది, నాయకులది ఎన్నికల సమయంలో ఒకే విధంగా ఉంది. ఎన్నికలలో లబ్ధి కోసం మాత్రమే, ఈ సమస్యను నినాదంగా మాత్రమే వాడుకుంటున్నారు. తదుపరి కార్యాచరణ అంతా ఒకే విధంగా సాగుతున్నది. జీవించే హక్కు కు భంగం వాటిల్లుతూనే ఉన్నది. తెలంగాణ ప్రజల ఆకలి నైనా భరిస్తారు కానీ, స్వేచ్ఛ పై దాడి జరిగితే సహించరన్నది చారిత్రక సత్యం. ఈ అంశాన్ని పాలకులు నిత్యం మననం చేసుకోవాలి . పౌర హక్కుల నేతల, మానవ హక్కుల నేతల, బుద్ధి జీవుల, ఉద్యమకారుల సూచనలు సలహాలు రౌండ్ టేబుల్ లకు, ప్రెస్ మీట్లకు పరిమితమయ్యాయి. ప్రజా భవన్ కు చేరిన విన్నపాలు ఏమైనాయో తెలియదు. ప్రజాస్వామీకరణ ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు
దేశంలో రాష్ట్రంలో ఓట్ల పండుగ వాతావరణం ఏర్పడింది. నాయకుల బస్సు యాత్రలో పాదయాత్రలో ప్రారంభం అయ్యాయి. ఇప్పటికైనా పౌర ప్రజాస్వామికవాదులు వాస్తవాలనుగుర్తించాలి. పార్టీలకు, అంటగాగే ఆలోచన విరమించుకుని ప్రజల పక్కన నిలబడి ఉద్యమాలకు సిద్ధం కావాలి. ప్రజలలో నిడదీసే/ నిగ్గదీసి చైతన్యాన్నిపెంపొందించాలి. రాజకీయ పార్టీ నేతలను నెరవేసేందుకు దొరికిన సమయమిది. రచయితలు కవులు కళాకారులు గళ మెత్తి గర్జించవలసిన సందర్భం ఇది . విద్యార్థులు యువకులు నడుం బిగించి హక్కుల సాధనకై ఉద్యమించాల్సిన తరుణమిది . ప్రజాస్వామిక ఉద్యమాలే సమస్యలకు పరిష్కార మార్గాలు. ప్రజల మౌలిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేయకుండ పాలకుల వాగ్దానాల వలలో చిక్కితే పరిస్థితులు పునరావృతం అవుతాయన్నది నిజం.



Read More
Next Story