తెలంగాణ యూనివర్శిటీలన్నీ క్రుంగిపోతున్నాయి, ఎవరు కారణం?
x

తెలంగాణ యూనివర్శిటీలన్నీ క్రుంగిపోతున్నాయి, ఎవరు కారణం?

ప్రస్తుత ప్రభుత్వమైనా రాజకీయాలు, పైరవీలకి తావు లేకుండా పారదర్శకంగా మెరిట్ ప్రాతిపదికన విసీలను నియమించకపోతే విశ్వవిద్యాలయాల భవిష్యత్తు అంధకార మవుతుంది.



ఉన్నత విద్యావ్యవస్థలో బోధన లో పరిశోధన లోనూ తమ కంటూ ఒక ప్రత్యేకతను కలిగిన విశ్వవిద్యాలయాలు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తమ పూర్వపు వైభవాన్ని ప్రతిష్టను కోల్పోతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్ఐఆర్ఎఫ్ 2024 (నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్) ర్యాంకింగ్ లలో రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రభుత్వ విశ్వవిద్యాలయం కూడా మంచి ర్యాంకు సాధించలేకపోయింది. మొదటి వంద ర్యాంకులలో తమిళనాడుకు చెందినవి 15 కర్ణాటక నుండి 11 ఆంధ్ర ప్రదేశ్ నుండి 5 కేరళ నుండి నాలుగు విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకుంటే తెలంగాణ రాష్ట్రం నుండి మాత్రం రెండు విశ్వవిద్యాలయాలకు మాత్రమే చోటూ దొరికింది. అవి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉస్మానియా విశ్వవిద్యాలయం. తెలంగాణలో ఉస్మానియా, కాకతీయ అనేది రెండు ప్రధాన విశ్వవిద్యాలయాలు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ర్యాంకు 36 నుండి 43 కి పడిపోయింది. వ కాకతీయ విశ్వవిద్యాలయానికి మొదటి 100 ర్యాంకులలో చోటు కూడా దక్కలేదు. దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల హోదా, మెరిట్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి (2004-2009)గా ఉన్నపుడు అనేక విశ్వవిద్యాలయాలు తెలంగాణలో ఏర్పాటయ్యాయి. 2006లో 18 విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసినారు. జిల్లాకి ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగా శాతవాహన (కరీంనగర్), తెలంగాణ (నిజామాబాద్), పాలమూరు (మహబూబ్ నగర్), మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయా (నల్గొండ)లను రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన ఉన్నత విద్యమీద ఆశించిన శ్రద్ధ కనిపించలేదు. 2001-2014 మధ్య ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కేంద్రాలుగా విలసిల్లిన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు రాష్ట్రాన్ని సాధించాక నిర్లక్ష్యానికి గురైనాయి. 2014-2024 మధ్య పదేళ్ల కాలంలో విశ్వవిద్యాలయాలలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టలేదు. విశ్వవిద్యాలయాల నిర్వహణకి కావలసిన బడ్జెట్ (Budget) కేటాయించలేదు. ఉపకులపతుల (Vice-Chancellors) నియామకాలలో నిర్లక్ష్యంగా జరిగింది. మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టకపోవడంతో నిత్యం విశ్వవిద్యాలయాలు సమస్యల వలయంలో చిక్కుకుపోయినాయి.

ప్రత్యేక తెలంగా సాధించాక మొదటి పది సంవత్సరాల కాలంలో 2014 నుండి 2016 వరకు 2019 నుంచి 2021 వరకు విశ్వవిద్యాలయాలకి వైస్ ఛాన్సలర్ లని నియమించకపోవడం వలన ఇన్ ఛార్జ్ ల పాలనే కొనసాగింది. గత ప్రభుత్వం కేవలం రెండు పర్యాయాలు మాత్రమే వైస్ ఛాన్సలర్ లను నియమించింది. కాని, వారు పూర్తి సామర్థ్యంతో పని చేయకపోవడం, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉండడంతో సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదనే ఆరోపణల ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాల పరిస్థితి మరింత దిగజారింది.

మరొకవైపు ఒక దశాబ్దానికి పైగా విశ్వవిద్యాలయాలలో రిక్రూట్మెంట్ అటక ఎక్కిందనే చెప్పాలి. 11 ప్రధాన విశ్వవిద్యాలయాలలో 75 శాతం బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీని ప్రభావం బోధనే మీదే కాకుండా పరిశోధన పైన ప్రతికూల ప్రభావం చూపించటం వలనే రాష్ట్ర విశ్వవిద్యాలయాలు జాతీయస్థాయిలో ర్యాంకులు సాధించడంలో వెనుకబడి పోతున్నాయి.

పబ్లిక్ విశ్వవిద్యాలయాలలో వివిధ దశలలో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు దాదాపు 4500కి పైగా ఖాళీగానే ఉన్నాయి. శాశ్వత ప్రాతిపదికన బోధనా సిబ్బంది నియామకాలు చేపట్టకపోవటం వలన 1445 మంది కాంట్రాక్టు అధ్యాపకులు, 678 మంది పార్ట్ టైం అధ్యాపకులు యూనివర్శిలలో బోధిస్తున్నారు. వీళ్లంతా రెగ్యులర్ కాదు కాబట్టి పూర్తిజీతాలకు అర్హులు కాదు. చాలీచాలని వేతనాలు, ఉద్యోగ భద్రత లేకుండా పనిచేయాల్సిరావడం వాళ్లను బాధిస్తున్నది.

తెలంగాణ విశ్వవిద్యాలయాలు ఎదుర్కొంటున్న మరొక ప్రధానమైన సమస్య నిధుల కొరత. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో సహా అన్ని విశ్వవిద్యాలయాలు నిధుల సమస్యని ఎదుర్కొంటున్నాయి. కొంతకాలంగా విశ్వవిద్యాలయాలు అంతర్గతంగా సమకూర్చుకొనే నిధులు కూడా తగ్గిపోయాయి. దీనితో విశ్వవిద్యాలయాలు పూర్తిగా ప్రభుత్వం ఇచ్చే బ్లాక్ గ్రాంట్ అభివృద్ధి నిధులపైనే ఆధారపడాల్సి వస్తున్నది. ప్రభుత్వాలు చాలీ చాలని బడ్జెట్ ని విశ్వవిద్యాలయాలకు కేటాయించడం. దానిని కూడా సకాలంలో విడుదల చేయకపోవడంతో నిధుల సమస్య జటిలమయింది. 2023- 24 బడ్జెట్ లో 784.64 కోట్ల రూపాయల బ్లాక్ గ్రాంట్ 2024- 25 బడ్జెట్ లో 910.34 కోట్ల రూపాయల బ్లాక్ గ్రాంట్ మాత్రమే విశ్వవిద్యాలయాలకు కేటాయించింది. కేటాయించిన నిధులే అరకొర వాటిని కూడా పూర్తిస్థాయిలో విడుదల చేయకపోవడం వలన విశ్వవిద్యాలయాలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సొంత రాష్ట్రంలో సొంత ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత విశ్వవిద్యాలయాల ప్రమాణాలు పెరుగుతాయని, సమస్యలను పరిష్కరించడానికి మార్గాలను చూపెడుతుందని ఆశించారు. అలాంటి దేమీ జరగలేదు. 2023 లో కొత్త ప్రభుత్వం వచ్చాక నైనా పరిస్థితులుమెరుగుపడతాయని ఆశిస్తున్నారు. 2024 మే 21 నాటికి పది విశ్వవిద్యాలయాలలో వైస్ ఛాన్సలర్ ల పదవీకాలం ముగిసి మూడు నెలలు అవుతున్నది. విశ్వవిద్యాలయాలలో వైస్ ఛాన్సలర్ ల నియామకానికి సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది కానీ వైస్ ఛాన్సలర్ ల నియామకాలు పూర్తికాలేదు. ఇంకా జాప్యం కొనసాగడం పై అకడిమిక్ రంగంలో, విద్యార్థులలో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. మూడు నెలలుగా రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలు ఇన్ ఛార్జ్ ల పాలనలోనే కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వం కూడా ఇదే వైఖరితో వైస్ చాన్సలర్ ల నియామకాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించటం విశ్వవిద్యాలయాలు ఈ దుస్థితిలో ఉండటానికి ఒక కారణం. నిప్పు కనికలు లాంటి విసీలను నియమిస్తామనే హామీని గత ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయింది గత ప్రభుత్వ హయాంలో నియమించబడిన విసీలు ఎంత వివాదాస్పదంగా వ్యవహరించారో అందరికీ విదితమే.

ప్రస్తుత ప్రభుత్వమైనా రాజకీయ ప్రమేయం, పైరవీలకి తావు లేకుండా పారదర్శకంగా అనుభవం అర్హత సమర్ధత నిర్వహణ నైపుణ్యం కలవారిని విసీలుగా నియమించకపోతే విశ్వవిద్యాలయాల భవిష్యత్తు అంధకార మవుతుంది. ప్రస్తుత ప్రభుత్వం గుర్తుంచుకోవలసి విషయాలు:

1. అన్ని యూనివర్శిటీలలో వైస్ ఛాన్సలర్ ల నియామకాలను సత్వరమే పూర్తి చేయాలి.

2. విశ్వవిద్యాలయాలను పీడిస్తున్న అకడిమిక్, నాన్ అకడమిక్ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం దృష్టి పెట్టాలి.

3. రిక్రూట్మెంట్ మెంట్ నే ప్రారంభించి పూర్తి చేయాలి.

4. కాంట్రాక్టు, పార్ట్ టైం అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి.

5. యూనివర్శిటీల విద్యాప్రమాణలు మెరుగుపరిచే విధంగా బడ్జెలు కేటాయింపులు ఉండాలి.

6. విశ్వవిద్యాలయాలలో మౌలిక వసతుల మెరుగుపరిచి విద్యాభ్యాస వాతావరణం ఆకర్షణీయంగా మారేందుకు చర్యలు తీసుకోవాలి.

7. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నలంద విశ్వవిద్యాలయం ఒక గౌరవం ఒక విలువ ఒక అద్భుతం అని వ్యాఖ్యానించారు. అలాంటి యశస్సు కలిగిన అనే విశ్వవిద్యాలయాలు దేశంలో ఉన్నాయి. అందులో ఉస్మానియా విద్యాలయం ఒకటి. అలాంటి ప్రతిష్టాత్మక మైన యూనివర్శిటీలను రక్షించుకోవాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి.


Read More
Next Story