ప్రభుత్వానికి కవిత సూటి ప్రశ్న..!
x

ప్రభుత్వానికి కవిత సూటి ప్రశ్న..!

సమాచార హక్కు చట్టంలో కనిపించని సామాజిక న్యాయం.


సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ)లో సామాజిక న్యాయం కనిపించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత కవిత వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె ప్రభుత్వానికి సూటి ప్రశ్న వేశారు. ఆర్‌టీఐలో బీసీలు, ఎస్టీలకు ఎందుకు చోటు కల్పించలేదని నిలదీశారు. ఈ మేరకు కవిత.. ఎక్స్ వేదికగా కీలక పోస్ట్ ఒకటి పెట్టారు. ఇటీవల జరిగిన ఆర్‌టీఐ కమిషనర్ల నియామకంలో ప్రభుత్వ వైఖరిని కవిత తప్పుబట్టారు. ఈ అంశంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆర్‌టీఐలో బీసీలకు, ఎస్టీలకు చోటు ఇవ్వరా? అని ప్రశ్నించారు. ‘‘సమాచార హక్కు చట్టం కమిషన్ లో బీసీలు, ఎస్టీలకు చోటు లేదా? ఇప్పటికే నియమించిన చీఫ్ కమిషనర్, నలుగురు కమిషనర్ లలో ఒక్కరు కూడా, ఎస్టీ, బీసీలు లేరు. మరో ముగ్గురు కమిషనర్ల నియామకాలకు రూపొందించిన ప్రతిపాదనల్లోనూ బీసీలు, ఎస్టీలకు ఛాన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. జనాభా దామాషా ప్రకారం పెండింగ్ లో ఉన్న మూడు కమిషనర్ పోస్టులను బీసీలు, ఎస్టీలతో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ది ఉన్నదో ఈ చర్యలే రూడీ చేస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే మే 2025లో సమాచార హక్కు కమిషనర్లుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నియమించారు. జర్నలిస్టులు పీవీ శ్రీనివాసరావు, బోరెడ్డి అయోధ్యరెడ్డి, న్యాయవాదులు దేశాల భూపాల్‌, మొహిసినా పర్వీన్‌లను ఎస్‌ఐసీలుగా నియమించారు. వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు కమిషనర్ల నియామక ఉత్తర్వులను జారీచేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు లేదా వయసు 65 ఏళ్లు నిండే వరకు వారు రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా కొనసాగుతారు. వారి నియామకంపైనే తాజాగా కవిత స్పందించారు.

ఇన్నాళ్లూ ఎందుకు ప్రశ్నించలేదు..?

అయితే కమిషనర్ల నియామకం మే నెలలో జరిగితే.. కవిత జులై చివర్లో ప్రశ్నించడం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. సమాచార హక్కు చట్టం కమిషన్‌లో బీసీలకు, ఎస్టీలకు స్థానం కల్పించలేదని గుర్తించడానికి కవిత ఇంత కాలం పట్టిందా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. లేదంటే.. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీసీలు, ఎస్టీలను ప్రసన్నం చేసుకోవడానికి కవిత పడుతున్న ప్రయాసా? అని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా బీసీలు, ఎస్టీలకు స్థానం కల్పించడమే కవిత ఉద్దేశం అయితే.. ఇన్ని రోజులు ఎందుకు ప్రశ్నించలేదు అనేది తెలపాలని కోరుతున్నారు విశ్లేషకులు.

Read More
Next Story