Action on Kaushik Reddy|కౌశిక్ రెడ్డిపై యాక్షన్ తప్పదా ?
x
MLA Padi and MLA Sanjay

Action on Kaushik Reddy|కౌశిక్ రెడ్డిపై యాక్షన్ తప్పదా ?

తనపై పాడి దాడిచేశారని మరో ఎంఎల్ఏ సంజయ్(MLA Sanjay) స్పీకర్ కు సోమవారం ఫిర్యాదుచేశారు


బీఆర్ఎస్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డిపై యాక్షన్ తప్పేట్లులేదు. ఎంఎల్ఏపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదులు అందాయి. తనపై పాడి దాడిచేశారని మరో ఎంఎల్ఏ సంజయ్(MLA Sanjay) స్పీకర్ కు సోమవారం ఫిర్యాదుచేశారు. వెంటనే పాడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో సంజయ్ కోరారు. ఆదివారం ఉమ్మడి కరీంనగర్(KarimNagar) జిల్లాలో అభివృద్ధిపై సమీక్ష జరుగుతున్నపుడు పాడి గొడవచేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్(BRS) తరపున గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎంఎల్ఏ డాక్టర్ సంజయ్ మాట్లాడటానికి రెడీఅవగానే సమావేశంలోనే ఉన్న పాడి(Padi Kaushik Reddy) ఒక్కసారిగా లేచి గొడవ మొదలుపెట్టారు. సంజయ్ మాట్లాడనీయకుండా మైకును లాక్కునేందుకు ప్రయత్నించారు. మైక్ ఇవ్వటానికి ఇష్టపడకపోవటంతో సంజయ్ పైకి పాడిదూసుకుపోయి నోటికొచ్చినట్లు విరుచుకుపడ్డారు. దాంతో సంజయ్ కూడా రియాక్టవ్వటంతో ఇద్దరు ఎంఎల్ఏల మధ్య తోపులాటలు జరిగాయి. ఒకళ్ళపై మరొకళ్ళు చేతులు కూడా చేసుకున్నారు. దాంతో అక్కడేఉన్న మిగిలిన ప్రజాప్రతినిధులు, పోలీసులు వేదికమీదకు చేరుకుని ఇద్దరినీ విడదీశారు.

గొడవ మరింత పెద్దదికాకుండా పోలీసులు పాడిని సమావేశం నుండి బయటకు తీసుకువెళిపోయారు. గొడవ తర్వాత సోమవారం డాక్టర్ సంజయ్ స్పీకర్ ను కలిసి ఫిర్యాదుచేశారు. తనపై బీఆర్ఎస్ ఎంఎల్ఏ దాడికి ప్రయత్నించినట్లు ఫిర్యాదులో సంజయ్ ఆరోపించారు. తనఫిర్యాదును విచారించి వెంటనే కౌశిక్ రెడ్డిపై యాక్షన్ తీసుకోవాలని అడిగారు. స్పీకర్(Speaker Gaddam Prasad Kumar) కు సంజయ్ ఫిర్యాదుచేయటంతో పాటు జగిత్యాల ఎంఎల్ఏ పీఏ కూడా హుజూరాబాద్ ఎంఎల్ఏ కౌశిక్ పై కరీంనగర్ వన్ టౌన్ లో ఫిర్యాదుచేశారు. దాంతో పీఏ ఫిర్యాదు ఆధారంగా కౌశిక్ పై రెండు కేసులు నమోదయ్యాయి. సమావేశంలో పాడికౌశిక్ రెడ్డి చాలా దురుసుగా వ్యవహరించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదుచేశారు. అలాగే తనపట్ల పాడి చాలాదురుసుగా ప్రవర్తించారని గ్రాంధాలయ ఛైర్మన్ మల్లేశం ఫిర్యాదుతో పోలీసులు నాలుగో కేసు నమోదుచేశారు.

కౌశిక్ ఎందుకు రెచ్చిపోయారు ?

నిజానికి కౌశిక్ జగిత్యాల ఎంఎల్ఏ సంజయ్ పై రెచ్చిపోవాల్సిన అవసరమే లేదు. అయినా ఎందుకు రెచ్చిపోయాడంటే సంజయ్ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించారన్న కారణంతోనే రెచ్చిపోయాడు. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించటం సంజయ్ వ్యక్తిగతం. సంజయ్ ఫిరాయింపుపై బీఆర్ఎస్ ఎంఎల్ఏలు హైకోర్టులో పిటీషన్ వేసినా ఉపయోగంలేకపోయింది. ఫిరాయింపులపై అనర్హత వేటువేయాలని అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించలేమని స్పష్టంగా హైకోర్టు తేల్చిచెప్పింది. దాంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు కేసులు వేసిన వివేకానందగౌడ్, కౌశిక్ కు షాక్ కొట్టినట్లయ్యింది. కోర్టు ద్వారా అనర్హత వేటు వేయించాలన్న ప్రయత్నం ఫెయిలైందన్న మంట వీళ్ళల్లో బాగా పెరిగిపోయింది.

అందుకనే ఫిరాయింపు ఎంఎల్ఏలు ఎక్కడైతే సమావేశాల్లో పాల్గొంటున్నారో బీఆర్ఎస్ ఎంఎల్ఏలు అక్కడ కావాలనే గొడవచేస్తున్నారు. ఇపుడు సంజయ్ విషయంలో కౌశిక్ రెడ్డి చేసిన గొడవ ఇందులో భాగమే. గతంలో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ అరెకపూడి గాంధీ(Arekapudi Gandhi) విషయంలో కౌశిక్ ఇలాగే వ్యవహరించిన విషయం గుర్తుండే ఉంటుంది. బీఆర్ఎస్ గోలచేసినంత మాత్రాన ఫిరాయింపులు ఎంఎల్ఏ పదవులకు రాజీనామాలు చేసేదిలేదు, ఉపఎన్నికలు జరిగేదిలేదని అందరికీతెలుసు. కౌశిక్ టార్గెట్ ఏమిటంటే ఫిరాయింపు ఎంఎల్ఏల విషయంలో గోలచేసి మీడియా, సోషల్ మీడియాలో హైలైట్ అవ్వటమే. ఏదో ఒక గలబాచేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచి పార్టీ చీఫ్ కేసీఆర్(KCR), వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) దృష్టిలో పడటమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు అర్ధమవుతోంది. లేకపోతే ఫిరాయింపు ఎంఎల్ఏల విషయంలో ఇంతగా వెంటపడి కౌశిక్ రెడ్డికి గోలచేయాల్సిన అవసరమే లేదు.

ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కూడా ఫిరాయింపులను యధేచ్చగా ప్రోత్సహించిన విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నపుడు 18 మంది కాంగ్రెస్, టీడీపీ ఎంఎల్ఏలతో పాటు 20 మంది ఎంఎల్సీలను కేసీఆర్ బీఆర్ఎస్ లోకి లాగేసుకున్నారు. అప్పట్లో అధికారంలో ఉన్నారు కాబట్టి కేసీఆర్ తాను అనుకున్నది చేశారు. ఇపుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి తాను కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తు బీఆర్ఎస్ ఎంఎల్ఏలను లాక్కుంటున్నారు. అప్పట్లో కేసీఆర్ చేసింది తప్పయితే ఇపుడు రేవంత్(Revanth) చేస్తున్నదీ తప్పే. అప్పట్లో కేసీఆర్ చేసింది కరెక్టయితే ఇపుడు రేవంత్ చేస్తున్నది కూడా కరెక్టే. ఇంతచిన్న లాజిక్ తెలియక కాదు కౌశిక్ గోలచేస్తున్నది, కావాలనే గొడవలు చేస్తున్నాడంతే. అందుకనే ఇపుడు సంజయ్ చేసిన ఫిర్యాదుతో స్పీకర్ కూడా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే జరిగిన గొడవకు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సాక్ష్యం. కాబట్టి కౌశిక్ మీద స్పీకర్ యాక్షన్ తీసుకునేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరివిచారణ ఎప్పుడుచేస్తారు, ఏమి యాక్షన్ తీసుకుంటారన్నది చూడాల్సిందే.

Read More
Next Story