కేసీయార్ రమ్మంటే వచ్చేస్తారా ?
x

కేసీయార్ రమ్మంటే వచ్చేస్తారా ?

కేసీయార్ వ్యవహారం ఎలాగుందంటే దగ్గరైన సామాజికవర్గాలను చేతులారా దూరంచేసుకుని దెబ్బపడిన తర్వాత మళ్ళీ అవే సామాజికవర్గాలను దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.


మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బీసీలను దూరం చేసుకోవటం కూడా ఒక కారణమని బీఆర్ఎస్ విశ్లేషణల్లో బయటపడింది. అందుకని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కేసీయార్ బీసీలకు పెద్దపీట వేశారు. 17 సీట్లలో కేసీయార్ ఆరుగురు బీసీలకు సీట్లిచ్చారు. అయితే దీనిపైనా బీసీ సంఘాలు మండుతున్నాయి. గెలిచేటపుడేమో ఓసీలకు సీట్లిచ్చి, గెలుపు నమ్మకంలేని సీట్లను బీసీలకు ఇస్తారా అని గోలచేస్తున్నాయి. కులసంఘాల మనోభావాలను గ్రహించిన కీయార్ కులసంఘాల్లోని పెద్దలతో సమావేశాలు పెట్టుకోవాలని డిసైడ్ అయినట్లు పార్టీవర్గాల సమాచారం. అందుకనే బీసీల్లో ప్రధాన సామాజికవర్గాలైన ముదిరాజ్, మున్నూరుకాపు, యాదవులు, గౌడ్ల సంఘాలతో కేసీయార్ ప్రత్యేకంగా సమావేశాలు పెట్టుకోబోతున్నారు. కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్న బీసీలను మళ్ళీ బీఆర్ఎస్ వైపుకు లాక్కోవటమే కేసీయార్ ప్లాన్. కేసీయార్ వ్యవహారం ఎలాగుందంటే దగ్గరైన సామాజికవర్గాలను చేతులారా దూరంచేసుకుని దెబ్బపడిన తర్వాత మళ్ళీ అవే సామాజికవర్గాలను దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

విషయం ఏమిటంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల్లోని కొన్ని సామాజికవర్గాలకు కేసీయార్ టికెట్లివ్వలేదు. బీఆర్ఎస్ అధినేత తమను అవమానిస్తున్నారని సంఘాలు ఎంత గోలచేసినా పట్టించుకోలేదు. ఉదాహరణకు ముదిరాజ్ లాంటి పెద్ద సామాజికవర్గానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. పద్మశాలీలకు కూడా టికెట్లివ్వలేదు. ఇదేసమయంలో ముదిరాజులను కాంగ్రెస్ చేరదీసింది. దాంతో 26.25 లక్షలున్న ముదిరాజుల ఓట్లలో అత్యధికం బీఆర్ఎస్ కు దూరమైంది. అలాగే 11.80 లక్షలున్న పద్మశాలీల్లో కూడా తమను కేసీయార్ చిన్నచూపు చూశారని మండుతున్నారు. ముదిరాజ్ నేత అయిన ఈటల రాజేందర్ ను కేసీయార్ కావాలనే అవమానించారనే మంట వాళ్ళలో ఉంది. ఇలాంటి అనేక అంశాలు ఒకదానికి మరోటి తోడై మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది.

భవిష్యత్తులో కష్టమేనా ?

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఆశించిన సీట్లు గెలుచుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడకతప్పదని కేసీయార్ గ్రహించారు. అందుకనే దూరమైన బీసీ సామాజికవర్గాలను మళ్ళీ దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీసీ సామాజికవర్గాలు ఎటువైపుంటే అధికారం ఆ పార్టీదే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే మొత్తం జనాభాలో బీసీలే 56 శాతమున్నారు కాబట్టి. అందుకనే 17 పార్లమెంటు సీట్లలో ఆరుసీట్లను బీసీలకే కేటాయించారు. జహీరాబాద్, నిజామాబాద్ నియోజకవర్గాలను మున్నూరుకాపులకు కేటాయించారు. చేవెళ్ళ సీటులో ముదిరాజ్ ను పోటీచేయిస్తున్నారు. సికింద్రాబాద్ టికెట్ ను గౌడ్ కు ఇచ్చారు. భువనగిరిలో గొల్లకురుమ, హైదరాబాద్ సీటును యాదవ సామాజికవర్గానికి కేటాయించారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు కేసీయార్ నాలుగు సీట్లు మాత్రమే ఇచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది.

పై సామాజికవర్గాలు బలమైన మద్దతుదారుగా ఉండటం వల్లే 2004,2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. రాష్ట్రవిభజన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో పై సామాజికవర్గాలు బీఆర్ఎస్ కు మద్దతుగా ఉండటంతో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. 2023 ఎన్నికల్లో కేసీయార్ స్వయంకృతం వల్ల మెజారిటి సామాజికవర్గాలు దూరమవ్వటంతో ఫలితం ఏమిటో అందరికీ తెలిసిందే. ఆ తప్పు మళ్ళీ జరగకుండా ఐదు మేజర్ సామాజికవర్గాల్లో ముదిరాజ్, మున్నూరుకాపు, గౌడ్, యాదవ్ లకు ఆరుసీట్లిచ్చారు. ఇపుడు కూడా తమకు టికెట్ ఇవ్వలేదని పద్మశాలీలలు మండుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి అనేక కారణాల్లో బీసీ సామాజికవర్గాల విషయంలో కేసీయార్ చేసిన తప్పు కూడా ఒకటిని చెప్పాలి.

చేసిన తప్పు దిద్దుకుంటున్నారా ?

పోయిన ఎన్నికల్లో ముదిరాజులకు ఒక్క అసెంబ్లీ టికెట్ కూడా ఇవ్వకపోవటం తప్పని అర్ధమైన కేసీయార్ చేవెళ్ళ పార్లమెంటు స్ధానాన్ని కేటాయించారు. ఈనెల 13వ తేదీన చేవెళ్ళ బహిరంగసభలో ముదిరాజులకు తమ ప్రభుత్వం చేసిన సేవలను కేసీయార్ ప్రత్యేకంగా ప్రస్తావించబోతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే అంతకన్నా ముందే ముదిరాజ్ సామాజికవర్గంలోని పెద్దలతో భేటీ అవబోతున్నారు. చెరువులపై హక్కులను ముదిరాజులకు కల్పించింది, చేపపిల్లల పెంపంకం, అమ్మకానికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించిన విషయాలను కేసీయార్ వివరించబోతున్నారు. అలాగే జహీరాబాద్, నిజామాబాద్ బహిరంగసభల్లో మున్నూరుకాపులకు చేసిన సేవలను ప్రస్తావించబోతున్నారు.

అలాగే తొందరలోనే జరగబోతున్న భువనగిరి, హైదరాబాద్ బహిరంగసభల్లోపే గొర్రెల పెంపకం పథకంలో యాదవులకు తమప్రభుత్వం చేసిన సాయాన్ని సంఘాల నేతలకు గుర్తుచేయబోతున్నారు. మొత్తానికి దూరమైన బీసీ సామాజికవర్గాలను దగ్గరకు తీసుకునేందుకు కేసీయార్ చేస్తున్న ప్రయత్నాలు ఇంట్రెస్టింగుగా ఉంది.

సోషల్ ఇంజనీరింగే మోసం

ఇదే విషయమై తెలంగాణా సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి మాట్లాడుతు సోషల్ ఇంటనీరింగ్ పద్దతిలో కేసీయార్, ఇతర పార్టీలు సామాజికవర్గాలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. సామాజికవర్గాల్లోని కొందరిని చేరదీసి వారికి మాత్రమే రాజకీయంగా, ఆర్ధికంగా ఎదిగేందుకు అవకాశాలు కల్పిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. వ్యక్తులను కాకుండా మొత్తం సామాజికివర్గానికి మేలుచేయాలన్న ఆలోచన పార్టీల్లో కనిపించటంలేదన్నారు. కేసీయార్ ను బీసీలు నమ్మరని అభిప్రాపడ్డారు. సోషల్ ఇంజనీరింగ్ పేరుతో బీసీలకు ఆత్మగౌరవంలేకుండా చేసినట్లు చెప్పారు. బీసీలకు కావాల్సింది పదువులు కాదని రాజ్యాంగ, ప్రజాస్వామ్య బద్దమైన గౌరవమన్నారు.



Read More
Next Story