చంద్రబాబు ఆ నాలుగు సవాళ్ళు అధిగమించగలరా?
x
Chandrababu

చంద్రబాబు ఆ నాలుగు సవాళ్ళు అధిగమించగలరా?

తెలంగాణాలో పార్టీ బలోపేతానికి అన్నీ చర్యలు తీసుకుంటానని చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. చంద్రబాబు చెప్పినట్లుగానే టీడీపీని బలోపేతం చేయటం సాధ్యమేనా ?


తెలంగాణాలో తమకు ఎదురేలేదని అనుకున్న బీఆర్ఎస్ పరిస్ధితి ఇపుడు దిక్కతోచనిస్ధితిలో పడిపోయింది. అలాగే భూస్ధాపితమైపోయింది అనుకున్న తెలుగుదేశంపార్టీకి కొత్తగా ఊపిరి వస్తోంది. చంద్రబాబునాయుడులో ఎక్కడలేని ఉత్సాహం కనబడుతోంది. దీనికి కారణం ఏమిటంటే అంతా కాలమహిమ అనే చెప్పాలి.

ఏపీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలవటంతో చంద్రబాబులో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. సీఎం హోదాలో మొదటిసారి హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబు ప్రకటనలు చూస్తేనే అర్ధమైపోతోంది. తెలంగాణాలో పార్టీ బలోపేతానికి అన్నీ చర్యలు తీసుకుంటానని చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. చంద్రబాబు చెప్పినట్లుగానే టీడీపీని తెలంగాణాలో బలోపేతం చేయటం సాధ్యమేనా ? అన్నదే అసలైన ప్రశ్న. ఇక్కడ నాలుగు అంశాలున్నాయి. మొదటిది పార్టీ తెలంగాణాలో దాదాపు భూస్ధాపితమైపోయింది. రెండో అంశం ఏమిటంటే తాను ఎన్డీయే క్యాంపు ముఖ్యమంత్రయితే తెలంగాణాలో అధికారంలో ఉన్నది ఇండియా క్యాంపులోని కాంగ్రెస్ పార్టీ. మూడో అంశం ఏమిటంటే స్వతంత్రంగానే అధికారంలోకి రావటానికి బీజేపీ ఎప్పటినుండో గట్టిగా ప్రయత్నిస్తోంది. నాలుగో అంశం ఏమిటంటే చంద్రబాబు యాక్టివ్ అయితే కేసీయార్ చూస్తూ ఊరుకుంటారా ?

ఎప్పుడైతే చంద్రబాబు తెలంగాణాలో యాక్టివ్ అవుతారో వెంటనే కేసీయార్ తెలంగాణా అస్త్రాన్ని ప్రయోగిస్తారు. అస్త్రం వర్కవుటవుతుందా లేదా అన్నది వేరే విషయం జనాలను రెచ్చగొట్టడానికి కేసీయార్ దగ్గరున్న అస్త్రం సెంటిమెంటు మాత్రమే. పైగా టీడీపీని చంద్రబాబు బలోపేతం చేస్తే రేవంత్ కే ఇబ్బందిగా మారుతుంది. ఎందుకంటే ఇద్దరూ వ్యక్తిగతంగా మంచి సన్నిహితులనటంలో సందేహంలేదు. కాని ముఖ్యమంత్రులుగా రెండుపార్టీలుగా వేర్వేరు కూటముల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చంద్రబాబుతో సన్నిహితంకన్నా ముందు తన అస్ధిత్వాన్ని కాపాడుకోవటం రేవంత్ కు చాలా ముఖ్యం. కాబట్టి టీడీపీ బలపడుతుంటే రేవంత్ చూస్తు ఊరుకోరు. కాబట్టి కచ్చితంగా టీడీపీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నంచేస్తారు. లేకపోతే పార్టీలోని ప్రత్యర్ధులు రెడీగా కాచుకుని కూర్చున్నారు ఎండగట్టేయటానికి.

బీజేపీ విషయం చూస్తే చంద్రబాబుతో కలవటానికి కమలంపార్టీ నేతలకు ఏమాత్రం ఇష్టంలేదు. ఏపీలో అసలు ఉనికిలో కూడా లేదు కాబట్టి అక్కడ పొత్తు సాధ్యమైంది. పైగా ఏపీ బీజేపీలోని కీలకనేతల్లో చాలామంది చంద్రబాబు మనుషులే. కాబట్టి అధిష్టానం దగ్గర పొత్తుకు మార్గం సుగమంచేశారు. అదే తెలంగాణాలో చాలామంది నేతలు చంద్రబాబును పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కాకపోతే తెలంగాణాలో కూడా చంద్రబాబుతో కలిసి నడవాలని నరేంద్రమోడి నిర్ణయిస్తే తెలంగాణా నేతలు ఎదురుకాదనే అవకాశంలేదు. ఇదే సమయంలో బీజేపీ+టీడీపీ కలిస్తే కేసీయార్ చూస్తూ ఊరుకోరు. ఇక్కడే నాలుగో అంశం తెరపైకి వస్తుంది. సీసాలో బిగించిన భూతాన్ని బయటకు తీసినట్లుగా కేసీయార్ తెలంగాణా సెంటిమెంటును బయటకు తీస్తారు. అయితే ఎంతవరకు వర్కవుటవుతుందన్నది కాలమే చెప్పాలి.

పోయిన ఏడాది. ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కేసీయార్ ప్రయోగించిన తెలంగాణా సెంటిమెంట్ పనిచేయలేదు. దాని ఫలితమే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంటు ఎన్నికల్లో ఘోరపరాజయం. ప్రతిసారి సెంటిమెంటు రాజకీయాలే గట్టెక్కిస్తాయన్న కేసీయార్ భ్రమలు వీగిపోయాయనే చెప్పాలి. అయితే భవిష్యత్తులో సెంటిమెంటు అస్త్రం వర్కవుట్ కాదని గట్టిగా చెప్పేందుకు కూడా లేదు. రాజకీయాల్లో చిన్న ఘటన చాలు మొత్తం పరిస్ధితులను సమూలంగా మార్చేసేందుకు. కాబట్టి సెంటిమెంటు రాజకీయాలు ఎప్పుడు వర్కవుటవుతుందో ఎప్పుడు కాదో ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. చంద్రబాబు తెలంగాణాలో మళ్ళీ రాజకీయాలు మొదలుపెట్టిన తర్వాత అప్పటి వాతావరణాన్నిబట్టి కేసీయార్ వ్యూహాలకు పదునుపెడతారనటంలో సందేహంలేదు.

రెండు వరుసఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి కేసీయార్ను తక్కువగా అంచనా వేస్తే దెబ్బపడటం ఖాయం. బీఆర్ఎస్ పుంజుకోవటం అన్నది రేవంత్ పాలన, చంద్రబాబు వేసే అడుగులమీద ఆధారపడున్నది. పాలనలో రేవంత్ ఫెయిలయ్యారని ప్రజలు అనుకుంటే తక్షణ ప్రత్యామ్నాయంగా జనాలకు బీఆర్ఎస్సే కనబడుతుంది కాని టీడీపీ ఎంతమాత్రం కాదు. ఎందుకంటే టీడీపీ బలోపేతం అవ్వాలంటే చాలా సమయం పడుతుందనటంలో సందేహంలేదు. ఇన్ స్టంట్ కాఫీలాగ టీడీపీ ఒక్కసారిగా బలోపేతమైపోవాలంటే అందుకు ఒక మార్గముంది. టీడీపీని వదిలేసి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో చేరిన ప్రజాప్రతినిధులంతా తిరిగి సైకిల్ ఎక్కేయాలి రేవంత్ రెడ్డి కలిపి. అప్పుడే టీడీపీ బలోపేతమైనట్లు కనబడుతుంది.

బీఆర్ఎస్ కు చెందిన ఎంఎల్ఏలు ఆరెకపూడి గాంధి, ప్రకాష్ గౌడ్ ఇప్పటికే చంద్రబాబుతో భేటీ అయ్యారు. మరికొందరు ఎంఎల్ఏలు మాగంటి గోపి, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానందగౌడ్ కూడా చంద్రబాబును కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబుతో భేటీలో వీళ్ళంతా ఏమి మాట్లాడుకున్నారో ఎవరికీ తెలీదు. తెలంగాణాలో టీడీపీని బలోపేతం చేయటం చెప్పినంత సులువు కాదని చంద్రబాబుకు కూడా తెలుసు. వయసురీత్యా దీర్ఘకాల ప్రణాళికలు వేసి వెయిట్ చేసే సమయం చంద్రబాబుకు లేదు. పార్టీ అర్జంటుగా పార్టీని బలోపేతం చేయాలంటే పైన చెప్పిన పద్దతి ఒకటే మార్గం. మరి ఈ మార్గాన్ని జనాలు ఆమోదిస్తారా అన్నది కూడా అనుమానమే. కాబట్టి పార్టీ బలోపేతానికి చంద్రబాబు ఏమి ప్లాన్ చేస్తారో చూడాల్సిందే.

Read More
Next Story