
పండగ పూట పేట్రేగిన చికెన్ ధరలు
ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయ్....
కార్తీక మాసం ముగిసిన తర్వాత… చికెన్ కు డిమాండ్ బాగానే పెరిగింది. దీనికి తోడు వరుస పండగలు వస్తుండటంతో… ధరలు పైపైకి వెళ్తున్నాయి. కొద్ది రోజుల కిందటి వరకు రూ.280 వరకు పలికిన కిలో చికెన్ ధర.. ఇప్పుడు రూ.320 వరకు పలుకుతోంది. లైవ్ కోడి రేటు రూ.170 వరకు ఉంది. చికెన్ తో పాటు గుడ్డు ధర కూడా రిటైల్ మార్కెట్ లో రూ.7 నుంచి రూ.8 పలుకుతోంది. డిసెంబర్ నుంచి క్రమంగా ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగ, ఆ తర్వాత మేడారం జాతర నేపథ్యంలో చికెన్ కు భారీ డిమాండ్ ఉండే అవకాశం వుంది.
డిమాండ్‌కు తగ్గట్లుగా పౌల్ట్రీ ఉత్పత్తి లేక పోవడంతో సరఫరా దెబ్బతిని ధరలు పెరిగినట్లు తెలంగాణా పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు కె.మోహన్‌రెడ్డి ఫెడరల్ తెలంగాణాతో తెలిపారు. "ఉత్పత్తి ఎందుకు తగ్గిందంటే గడిచిన వేసవి కాలంలో పౌల్ట్రీ రైతులు ఘోరంగా నష్టపోయారు. ఎండ వేడికి వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. మరో వైపు కోళ్ళకు వేసే దాణా ధర విపరీతంగా పెరిగింది. కిలో 18 రూపాయలున్న మొక్కజొన్న దర 27 రూపాయలు అయింది. 25 రూపాయలున్న సోయా ధర 45 రూపాయలకు పెరగడంతో ఉత్పత్తి ఖర్చు 100 రూపాయల నుంచి 110 రూపాయలకు పెరిగింది," అని కె.మోహన్‌రెడ్డి చెప్పారు.
డిమాండ్ తగ్గితే కోళ్ల సరఫరా ఎక్కువై ధరలు పడిపోతాయి. డిమాండ్ ఒక్క సారిగా పెరిగితే ధరలు వెంటనే ఎగసిపోతాయి. ఈ వేగవంతమైన ఉత్పత్తి విధానమే చికెన్ ధరల్లో హెచ్చుతగ్గులకు కారణం. ఇప్పుడు పండగల సీజన్, పైగా వాతావరణం చలిగా వుండటంతో వినియోగం పెరిగింది. "కోడి గుడ్డు ఉత్పత్తి ధర 4 రూపాయల 85 పైసలు. అయితే హోల్‌సేల్ మార్కెట్‌లో 5 రూపాయల 50 పైసలకు అమ్ముతున్నారు. అందులో పది పైసలు కమీషన్ పోను రైతుకు మిగిలేది 5 రూపాయల 40 పైసలే. ఎండ వేడి, బర్డ్‌ఫ్లూ తదితర కారణాలతో ఘోరంగా నష్టపోయిన రైతులు చికెన్ ఫార్మింగ్‌లో వెనక్కి తగ్గారు. దీంతో ఉత్పత్తి తగ్గింది," అని పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవీందర్‌రెడ్డి తెలిపారు.
దాణా ధరలు, వ్యాధులు, వాతావరణం ప్రభావం చికెన్ ధరల్లో మార్పులకు కారణం అని ఆయన చెప్పారు."మొక్కజొన్న, సోయా వంటి దాణా ఉత్పత్తులతో పాటు పౌల్ట్రీ ఇండస్ట్రీ పరికరాలపై జీఎస్టీ భారం పెరిగిపోయింది, వ్యాక్సిన్ దిగుమతులకు సత్వర అనుమతులు లేవు, అని పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్‌సింగ్ బయాస్ ఫెడరల్ తెలంగాణాతో చెప్పారు.
రాష్ట్ర విభజన కంటే ముందు దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు తెలంగాణా నాల్గవ స్థానానికి పడిపోయింది. కొత్తగా కోళ్ళ ఫాం పెట్టుకోవాలంటే ప్రభుత్వం నిబంధనలు కఠినంగా ఉన్నాయి. పట్టణం నుంచి గ్రామాలకు వెళ్ళడానికి 40 ఫీట్ల రోడు వుండదు కానీ, ఆయా గ్రామాల్లో పెట్టే కోళ్ళ ఫాంలకు వెళ్ళడానికి 40 ఫీట్ల రోడు వుండాలనే నిబంధన పెట్టారు. దీంతో కొత్తగా ఫాంలు రావడం లేదు," అని ఉదయ్‌సింగ్ బయాస్ చెప్పారు.
దేశంలో ఒక మిలియన్ బ్రాయిలర్ రైతులున్నారు. "ఏటా 5 మిలియన్ టన్నుల బ్రాయిలర్ మాంసం, 118 బిలియన్ల గుడ్లను దేశం ఉత్పత్తి చేస్తోంది. భారత్ గుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలో మూడోస్థానంలోనూ, బ్రాయిలర్ కోళ్ల మాంసం ఉత్పత్తిలో నాలుగో స్థానంలోనూ నిలిచింది. ఈ రంగం 18 మిలియన్ టన్నుల మొక్కజొన్న, 5.5 మిలియన్ టన్నుల సోయా వినియోగిస్తోంది, అని" అని ఉదయ్‌సింగ్ బయాస్ చెప్పారు.
తెలంగాణ కోళ్ల పరిశ్రమలో 5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. రోజుకు 1,397.2 టన్నుల చికెన్ ఉత్పత్తి అవుతుండగా.. సగటున 5.04 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి.

