హరీష్ నిర్ణయంపై పెరిగిపోతున్న ఉత్కంఠ
x
Tanneeru Harish Rao

హరీష్ నిర్ణయంపై పెరిగిపోతున్న ఉత్కంఠ

పంద్రాగష్టులోగా ప్రభుత్వం రైతురుణమాఫీ చేస్తే తాను ఎంఎల్ఏగా రాజీనామా చేస్తానని హరీష్ ఆమధ్య బహిరంగంగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.


బీఆర్ఎస్ కీలకనేత తన్నీరు హరీష్ రావు నిర్ణయంపై అందరిలోను ఉత్కంఠ పెరిగిపోతోంది. పంద్రాగష్టులోగా ప్రభుత్వం రైతురుణమాఫీ చేస్తే తాను ఎంఎల్ఏగా రాజీనామా చేస్తానని హరీష్ ఆమధ్య బహిరంగంగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. హరీష్ ఉద్దేశ్యం ఏమిటంటే ప్రభుత్వం ఎప్పటికీ రుణమాఫీ చేయలేందని. ఎందుకంటే ప్రస్తుత ఆర్ధిక పరిస్ధితిలో రుణమాఫీపై సుమారు 48 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసే పరిస్ధితి లేదని హరీష్ గట్టిగా నమ్మారు. ఆ ధైర్యంతోనే రాజీనామా చేస్తానని ఓపెన్ చాలెంజ్ చేశారు.

అయితే ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల్లో రుణమాఫీ మొత్తం తగ్గింది. అప్పటి లెక్కల ప్రకారం రుణమాఫీ లబ్దిని అందుకోవాల్సిన రైతుల సంఖ్య 67 లక్షలుగా అప్పట్లో అధికారులు లెక్కలు తేల్చారు. అయితే రుణమాఫీకి అర్హులను ఫైనల్ చేయటంలో రాష్ట్రప్రభుత్వం కేంద్రం రైతులకు ఇస్తున్న పెట్టుబడిసాయం పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మార్గదర్శకాలను వర్తింపచేయాలని డిసైడ్ అయ్యింది. దీని ప్రకారం ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు, మంత్రులు, మాజీమంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీలతో పాటు మాజీలు, ఉన్నతాధికారులు తదితర వర్గాలను లబ్దిదారుల జాబితాలో నుండి తొలగించింది. దీనివల్ల లబ్దిదారుల సంఖ్య తగ్గటంతో రుణమాఫీ చేయాల్సిన మొత్తం కూడా తగ్గింది.

ఇదే విషయమై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతు లక్ష రూపాయల జీతం తీసుకుంటున్న వారిని రుణమాఫీ పథకం లబ్దిదారుల జాబితాలనుండి తొలగించినట్లు చెప్పారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం లక్ష జీతం అందుకుంటున్న వారిసంఖ్య సుమారు 20 వేలుందన్నారు. అంటే ఈ 20 వేలమందికి రుణమాఫీ లబ్ది దొరకదు. 20 వేలమందిని లబ్దిదారుల నుండి తొలగించటం వల్ల ప్రభుత్వానికి సుమారు 200 కోట్ల రూపాయలు ఆదా అయ్యింది. ఇలాంటి ఉన్నత ఆదాయవర్గాలను లబ్దిదారుల నుండి తొలగించటం వల్ల ప్రభుత్వానికి సుమారు 17 వేల కోట్లరూపాయలు ఆదా అయ్యింది. మొదట్లో రుణమాఫీకి 48 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుందని అధికారులు అంచనాలు వేశారు. అయితే పై మార్గదర్శకాల తర్వాత అవసరమయ్యే మొత్తం 31 వేల కోట్ల రూపాయలకు తగ్గింది. లబ్దిదారుల సంఖ్య కూడా 67 లక్షల నుండి సుమారు 50 లక్షలకు తగ్గిపోయిందని ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి.

ఎప్పుడైతే రుణమాఫీలో అర్హుల సంఖ్య తగ్గి మాపీ చేయాల్సిన మొత్తం కూడా తగ్గిందో వెంటనే రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి ధైర్యం వచ్చింది. వెంటనే ఆర్ధికసంస్ధలతో సంప్రదింపులు చేసింది. అవసరమైన అప్పు ఇవ్వటానికి ఆర్ధికసంస్ధలు ముందుకొచ్చాయి. ఇదే సమయంలో ప్రభుత్వానికి రెగ్యుల్ గా వచ్చే ఆదాయాలను కలిపితే ఏకమొత్తంలో రైతు రుణమాఫీ చేసేయచ్చని ప్రభుత్వానికి అర్ధమైంది. అందుకనే రు. 2 లక్షల వరకు రుణాలను ఏకమొత్తంలో రుఫమాపీ చేసేయాలని క్యాబినెట్లో డిసైడ్ చేసింది. ఆ నిర్ణయాన్నే ఇపుడు ప్రభుత్వం అమలుచేయబోతోంది. ఇందులో భాగంగానే గురువారం సాయంత్రం మొదటవిడగా లక్ష రూపాయలలోపు ఉన్న రుణాలను రద్దు చేయబోతోంది.

లక్ష రూపాయల రుణాలున్న రైతుల 11.50 లక్షల మంది ఖాతాల్లో సాయంత్రం డబ్బులు జమకాబోతున్నాయి. ఇప్పటికే ఇందుకు అవసరమైన రు. 7 వేల కోట్లను ప్రభుత్వం బ్యాంకుల్లో జమచేసేసింది. అలాగే ఈనెలాఖరులోగా లక్షన్నర రూపాయల రుణాలు, ఆగష్టు 2వ తేదీలోగా 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేయటానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది. ప్రభుత్వం పెట్టుకున్న డెడ్ లైన్ ప్రకారం ఆగస్టు 2వ తేదీకి రుణమాఫీ పథకాన్ని నూరుశాతం అమలుచేసేయాలి. అంటే గతంలో రుణమాఫీకి ప్రభుత్వం ప్రకటించిన ఆగష్టు 15వ తేదీకన్నా 13 రోజుల ముందే రుణమాఫీ పథకాన్ని అమలు చేసేయబోతోంది. రుణమాఫీ పథకం అమలుపై హరీష్ రావు చేసిన ఛాలెంజ్ కు రేవంత్ ధీటుగా వ్యవహరించినట్లు అర్ధమవుతోంది. మరి తాను చేసిన చాలెంజ్ ప్రకారం హరీష్ ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేస్తారా ? అనే ఉత్కంఠ పెరిగిపోతోంది.

హరీష్ ఏమిచేస్తారు ?

రుణమాఫీ పథకం అమల్లోకి రాబోతున్న నేపధ్యంలో ఇపుడు హరీష్ ఏమి చేయబోతున్నారు ? అనే చర్చ జనాల్లో పెరిగిపోతోంది. పార్టీవర్గాల సమాచారం ప్రకారం ఎంఎల్ఏ పదవికి హరీష్ రాజీనామా చేసే ఉద్దేశ్యంలో లేరు. రాజీనామా చేయకుండా ఉండేందుకు రుణమాఫీ పథకం అములులో లోపాలను చూపించి ఎదురుదాడికి రెడీ అవుతున్నారు. అందుకనే మొదటినుండి షరతులు లేకుండా రుణమాఫీ పథకాన్ని అమలుచేయాలంటు పదేపదే డిమాండ్లు చేస్తున్నారు. ఏ పథకాన్ని అయినా ప్రభుత్వం షరతులు లేకుండా అమలుచేస్తుందా ? పదేళ్ళు మంత్రిగా పనిచేసిన హరీష్ కు ఇంతచిన్న విషయం తెలీకుండానే ఉంటుందా ? రాజీనామా ఛాలెంజ్ నుండి పక్కకు తప్పుకోవటానికే హరీష్ ఇలాంటి డిమాండ్లు మొదలుపెట్టినట్లు అర్ధమైపోతోంది. చూద్దాం రాజీనామాపై హరీష్ ఏ విధంగా స్పందిస్తారో.

Read More
Next Story