హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేనా? మూడు అంశాలపై రేవంత్ దృష్టి
x

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేనా? మూడు అంశాలపై రేవంత్ దృష్టి

హైదరాబాద్‌లో డ్రగ్స్ డెన్లుగా మారిన పబ్‌లు,హోటళ్లలో కల్తీఆహారం, చెరువులు,ప్రభుత్వ భూముల ఆక్రమణలు గ్లోబల్ సిటీ అయిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి.


అంతర్జాతీయ నగరమైన హైదరాబాద్‌లో గత కొద్దిరోజులుగా డ్రగ్స్,కల్తీ ఆహారం, భూముల ఆక్రమణలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్న ఈ మూడు అంశాలపై రేవంత్ రెడ్డి సర్కారు ఉక్కుపాదం మోపుతోంది.

- హైదరాబాద్ నగరానికి విదేశీ పెట్టుబడులు రావాలన్నా,తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మూలమైన నగరం ప్రతిష్ఠ పెంచేందుకు తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో, తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు, హైడ్రా అధికారులు కొన్నాళ్లుగా దృష్టి సారించారు.
- హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.

డ్రగ్స్ నియంత్రణకు టీజీ న్యాబ్ తనిఖీలు
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో ఉన్న పబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లలో నిరంతరం తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో, పోలీసులు, ఎక్సైజ్ అధికారులు వరుస దాడులు చేసి డ్రగ్స్ పెడ్లర్లు, రవాణ చేస్తున్న వారు, డ్రగ్స్ తీసుకున్నవారిని అరెస్టు చేసి వరుస కేసులు పెట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ హైదరాబాద్ నగరానికి రాకుండా నిరోధించడంతోపాటు దీని నియంత్రణకు టీజీ న్యాబ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధుల్లోని 25 ప్రముఖ పబ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లపై వీకెండ్లలో అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. హైదరాబాద్‌ పరిధిలో 12, రంగారెడ్డి జిల్లా పరిధిలో 13 ప్రాంతాల్లో శనివారం రాత్రి 10 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు తనిఖీలు జరిపారు. డ్రగ్స్ నియంత్రణకు ప్రచారోద్యమం చేపట్టడంతో పాటు విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ సంఘాలను ఏర్పాటు చేశారు. 24 గంటలూ పనిచేసేలా యాంటీ నార్కొటిక్స్ బ్యూరో కంట్రోల్ రూంను అందుబాటులోకి తీసుకువచ్చారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు.

ఆహార కల్తీపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ కొరడా
కల్తీ ఆహారం విక్రయాల్లో హైదరాబాద్ నగరం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని నేషనల్ క్రైంబ్యూరో రికార్డులు వెల్లడించాయి. హైదరాబాద్ నగరంలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్ స్టాళ్లలో కల్తీ ఆహారం విక్రయిస్తున్నారనే ఫిర్యాదులపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వరుస దాడులు చేయించి కేసులు పెట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేయిస్తున్నారు. ఇప్పటికే 200 కుపైగా రెస్టారెంట్లు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు జరిపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కల్తీ ఆహారాన్ని విక్రయించిన యజమానులకు నోటీసులకు జారీ చేశారు. కల్తీ ఆహారానికి అడ్డు కట్ట వేయడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలంటే...
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలంటే పబ్ లలో డ్రగ్స్ ను నియంత్రించడంతోపాటు హోటళ్లలో కల్తీ ఆహారాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించాలని ఆర్థికవేత్త పాపారావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను పూర్తిగా తొలగించాలని ఆయన సూచించారు. గత కొద్ది రోజులుగా డ్రగ్స్ నియంత్రణ కోసం టీజీ న్యాబ్ అధికారులు, పోలీసులు వరుస దాడులు చేయడం మంచి పరిణామం అన్నారు. దీంతోపాటు హోటళ్లలో కల్తీ ఆహారానికి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న వరుస తనిఖీలు దోహదపడతాయని ఆయన చెప్పారు. అయితే తరచూ కరెంటు పోతుండటం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని పాపారావు వివరించారు.

‘హైడ్రా’ కూల్చివేతలు
హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, సరస్సులు, కాల్వలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాల పాలయ్యాయి. కబ్జాల వల్ల హైదరాబాద్ నగరానికి చెడ్డపేరు వస్తుంది. దీన్ని గుర్తించిన రేవంత్ సర్కారు కబ్జాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువులు కబ్జాల వల్ల అంతరించి పోయాయని, మరికొన్ని చెరువు శిఖం భూముల్లోనూ ఆక్రమణలున్నాయని నేషనల్ రీమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నివేదికలో వెలుగుచూసింది. దీంతో హైడ్రా ఆక్రమణలను గుర్తించి గండిపేట, జీడిమెట్ల, పాత నగరంతోపాటు పలు ప్రాంతాల్లో వరుస కూల్చివేతలు చేపట్టింది.

హైదరాబాద్ ఇమేజ్ పెరగాలంటే ఆక్రమణలు పూర్తిగా తొలగించాలి : సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ లూబ్నా సర్వత్
హైదరాబాద్ ఇమేజ్ పెరగాలంటే నగరంలోని చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉందని సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ లూబ్నా సర్వత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నగరంలోని పలు చెరువులు ఆక్రమణదారుల పరమయ్యాయని, వీటిని పూర్తి స్థాయిలో తొలగించి మళ్లీ చెరువుల్లో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, చెరువుల రక్షణతోనే హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుందని డాక్టర్ లూబ్నా చెప్పారు.
డ్రగ్స్, కల్తీ ఆహారం, భూముల ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగించి,హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఏ మేర కాపాడుతుందనేది భవిష్యత్ కోసం వేచిచూడాల్సిందే.


Read More
Next Story