
‘బీసీ రిజర్వేషన్లను నెరవేర్చి తీరుతాం’
తెలంగాణ ప్రజల్లో అపోహలు సృష్టించే విధంగా బీఆర్ఎస్ నేతల వైఖరి ఉందన్న సీఎం రేవంత్ రెడ్డి.
ఏది ఏమైనా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని, దాని ప్రకారమే దానిని పూర్తి స్థాయిలో అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో వచ్చిన అడ్డంకులు తెలంగాణలో రాకూడదన్నదే తమ ఆలోచన అని, ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఆరునూరైనా.. అటు సూర్యుడు ఇటు పొడిచినా బీసీ రిజర్వేషన్లను నెరవేర్చి తీరుతామని చెప్పారు. రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దంటూ గత ప్రభుత్వం తెచ్చిన చట్టమే ఇప్పుడు బీసీలకు అన్యాయం చేస్తోందని ఆయన మరోసారి గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తోందని, కానీ బీఆర్ఎస్ నాయకులే ప్రజల్లో అపోహలు సృష్టించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాలు అతిపెద్ద అడ్డంకులుగా, గుదిబండలుగా మారాయని అన్నారు. ఆ అడ్డంకి తొలగించాలన్న ఉద్దేశంతోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్‌కు అందించామని, కానీ తెరవెనుక జరిగిన లాబీయింగ్ కారణంగా అది కూడా కేంద్రం దగ్గర పెండింగ్‌లో పడిందని చెప్పారు. బీసీ రిజర్వేషన్లతో ప్రతిపక్ష పార్టీలో గంగుల కమలాకర్ ఒక్కరే సంతోషంగా ఉన్నారని, బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, హరీష్, కేటీఆర్ వంటి వారు సంతోషంగా లేరని గంగుల మాటలే స్పష్టం చేస్తున్నాయని చురకలంటించారు రేవంత్. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు.. బీసీ రిజర్వేషన్ల విషయంలో తీవ్ర దుఃఖంతో ఉన్నారని, వారు దీనికి వ్యతిరేకంగా ఉన్నారని గంగుల మాటలు చెప్పకనే చెప్తున్నాయని రేవంత్ అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తవుద్ధి బీఆర్ఎస్‌కు లేదని అన్నారు.
‘‘వాళ్లు చేసిన పాపాలకు ఇప్పటికే ఒకసారి ప్రజలు శిక్ష వేశారు. ఇప్పటికి కూడా మా బుద్ధి మారదు, మేము సహకరించం అంటే మరోసారి ప్రజలే సమాధానం చెప్తారు. మీరు మాకు సూక్తులు చెప్పాల్సిన అవసరం లేదు.. ముందు మీ నాయకుడిని సభకు రమ్మనండి.. కేసీఆర్ సభకు రాడు.. వచ్చిన వాళ్లు ఇలా ఉన్నారు.. కల్వకుంట్ల కాదు.. కలవకుండా చేసే కుటుంబం.. తెరవెనుక లాబీయింగ్ చేసి బిల్లును రాష్ట్రపతికి పంపించేలా చేశారు.. ఒకిరిపై ఒకరు విమర్శలు చేసుకుని పలుచన కావొద్దు.. పొన్నంను అవమానిస్తే నీకేం రాదు.. అలా మాట్లాడితే మీరే చులకన అవుతారు’’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
పూర్తి చిత్తశుద్ధితో ప్రభుత్వం..
‘‘స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అయ్యాయంటూ కొందరు హైకోర్టుకు వెళ్లారు. దాని వెనక ఎవరి హస్తం ఉందో నాకు తెలియదు. కానీ సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. రిజర్వేషన్లను కూడా నిర్ధారించాలని తెలిపింది. ఆ ప్రకారమే మా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అన్ని పరిస్థితులు, చట్టాలను పరిశీలించాం. గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమే అడ్డంకి అయిందని గుర్తించాం. దానిని మార్చడం కోసమే ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. కానీ ఏమైంది బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మి దానిని గవర్నర్.. రాష్ట్రపతికి పంపారు. దాంతో అది కూడా ఢిల్లీలో పెండింగ్‌లో పడింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరుతాం’’ అని రేవంత్ పునరుద్ఘాటించారు.
ఢిల్లీలో ధర్నాకు మద్దతివ్వలేదేం..
‘‘బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. దీంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం కోసం ఢిల్లీ జంతర్‌మంతర్‌లో భారీ ధర్నా చేపట్టాం. దానికి ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు 100 మంది వరకు పూర్తి మద్దతు ఇచ్చారు. కానీ రాజ్యసభలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం అటువైపు కూడా రాలేదు. కనీసం ధర్నాకు మాట పూర్వకంగా కూడా మద్దతు ఇవ్వలేదు. బీసీలకు రిజర్వేషన్లు వస్తే ముందుగా అత్యంత సంతోషపడేది నేనే అంటూ అసెంబ్లీ చెప్పిన ఈ గంగుల కమలాకర్ కూడా ఆ రోజు ధర్నాకు మద్దతుగా నిలవలేదు. తన మద్దతును కూడా ప్రకటించలేదు. ఈరోజు కూడా సభలో గందరగోళం సృష్టించి బిల్లు ఆమోదం చెందకుండా ప్రయత్నిస్తున్నారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నేరవేర్చేందుకు కృషి చేస్తోంది’’ అని చెప్పుకొచ్చారు రేవంత్.
కేసీఆర్ అలా చేస్తే గౌరవం పెరుగుతుంది..
‘‘ మాటకొస్తే ఎన్నికలప్పుడు కనిపించిన రాహుల్ గాంధీ మళ్ళీ కనిపించలేదు, పట్టించుకోలేదు అంటున్నారు. అసలు ఇక్కడే ప్రజల చేత ఎన్నుకోబడి, ప్రతిపక్ష నేతగా ఉన్న నాయకుడే అసెంబ్లీకి రావడం లేదు. అసలు అసెంబ్లీ మొఖమే చూడట్లేదు ప్రతిపక్ష నేత. అలా కాకుండా వచ్చి ఇక్కడ కూర్చుని సూచనలు ఇచ్చి. బీసీ రిజర్వేషన్లపై ఇలా ముందుకు వెళ్దామని తెలిపి. తమ ప్రభుత్వం చేయలేకపోయిన పనిని ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ చేస్తుంది. అందుకు తాను మద్దతు ఇస్తాను అని ప్రకటిస్తే ఆయన గౌరవం ఇంకా పెరుగుతుంది కదా. రాహుల్ గాంధీ ఆదేశాలు లేకుండా ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ నిర్ణయాలన్నీ చేస్తాడా? ఇంత ముఖ్యమైన చర్చ జరుగుతుంటే.. వందేళ్ల నుంచి జరగనని కులగణను చేస్తుందుకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ వచ్చి ఈ ప్రభుత్వాన్ని అభినందించి ఉంటే ఆయన గౌరవం రెట్టింపు అయ్యుండేది కదా’’ అని రేవంత్ చురకలంటించారు.
ఒత్తిడికి లొంగకు గంగుల..
ఈ సందర్భంగానే బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్‌కు కీలక సూచనలు చేశారు. పార్టీ పెద్దల ఒత్తిడికి లొంగొద్దని సూచించారు. మంచి వైపు నిలుచోవాలని, ఏమైనా ఉంటే మంచీచెడ్డ తాను చూసుకుంటానని, పాత మిత్రులం కాబట్టి మీకు తెలుసుకదా అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా ఈ ముఖ్యమైన బిల్లుకు మద్దతు ఇవ్వాలి అని రేవంత్ కోరారు. చర్చ లేకుండా సభ అంతా కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపితే దీనిపై కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుందని రేవంత్ చెప్పారు.