జగ్గారెడ్డి ఆశ తీరాలంటే ఒకటే మార్గమా ?
x
Telangana Congress leader Jaggareddy

జగ్గారెడ్డి ఆశ తీరాలంటే ఒకటే మార్గమా ?

కోరిక అలా అలా పెరిగి పెరిగి పెద్దదైపోతోంది కాని జగ్గారెడ్డి కోరిక మాత్రం తీరటంలేదు.


తెలంగాణా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అవ్వాలన్నది తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి చిరకాల కోరిక. ఈ కోరిక ఇప్పటిది కాదు చాలా సంవత్సరాలుగా ఉన్నదే. కోరిక అలా అలా పెరిగి పెరిగి పెద్దదైపోతోంది కాని జగ్గారెడ్డి కోరిక మాత్రం తీరటంలేదు. ఇపుడిదంతా ఎందుకంటే బొమ్మా మహేష్

కుమార్ గౌడ్ ను అధిష్టానం కొత్త పీసీసీ సారధిగా నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గౌడ్ కు జగ్గారెడ్డి అభినందనలు చెప్పటంతో పాటు శుభాకాంక్షలు కూడా చెప్పారు. పనిలో పనిగా తన మనసులోని మాటను కూడా బయటపెట్టారు. అదేమిటంటే పైన చెప్పుకున్నట్లే ‘తాను ఎప్పటికైనా పీసీసీ అధ్యక్షుడిని అవుతా’నని.

రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా పదవులు పొందాలని, అధికారాలను అనుభవించాలనే. కాబట్టి ఇందుకు జగ్గారెడ్డి కూడా మినహాయింపేమీ కాదు. కాకపోతే చాలామందిలాగ మనసులో ఒకటి ఉంచుకుని బయటకు మరోటి చెప్పేరకం కాదు జగ్గన్న. గతంలో రేవంత్ రెడ్డితో పీసీసీ సారధ్య బాధ్యతల కోసం బాగా పోటీపడ్డారు. అయితే రకరకాల కాంబినేషన్లను లెక్కేసిన అధిష్టానం జగ్గారెడ్డిని పక్కనపెట్టి రేవంత్ కు కిరీటం పెట్టింది. దాంతో కొంతకాలం అలకలో ఉన్న జగ్గన్న తర్వాతెప్పుడో అలక వీడి జనాల్లో పడ్డారు. ఇపుడు కూడా పీసీసీ అధ్యక్షపదవి కోసం పోటీపడ్డారు. కాని అధిష్టానం మహేష్ వైపు మొగ్గుచూపింది.

ఇక్కడే జగ్గారెడ్డి కోరిక ఎప్పటికైనా తీరుతుందా అనే అనుమానాలు పెరిగిపోయాయి. జగ్గన్న కోరిక అంత తీరని కోరికేమీ కాదు. కాకపోతే ఆ కోరిక తీరాలంటే చాలా పెద్ద మార్పు జరగాలి. మార్పు ఎందులో జరగాలంటే ముఖ్యమంత్రి కుర్చీ విషయంలో. రెడ్డి సామాజికవర్గానికి చెందిన జగ్గారెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి దక్కాలంటే ముఖ్యమంత్రిగా నాన్ రెడ్డి ఉండాల్సిందే. ఎందుకంటే ఇటు ముఖ్యమంత్రి పదవిని అటు పీసీసీ అధ్యక్ష పదవిని రెడ్డి సామాజికవర్గానికే ఇవ్వటం సాధ్యంకాదు కాబట్టి. కాంగ్రెస్ పార్టీలో చాలాకాలంగా ఒక ఆనవాయితీ వస్తోంది. అదేమిటంటే సీఎం పోస్టు ఒక సామాజికవర్గానికి ఇస్తే పీసీసీ పోస్టు మరో సామాజికవర్గానికి కేటాయిస్తారు. సామాజికవర్గాలను బ్యాలెన్స్ చేయటంలో ఇదో కాంబినేషన్ మాత్రమే.

జగ్గారెడ్డి పీసీసీ అధ్యక్షుడు కావాలంటే ముఖ్యమంత్రిగా నాన్ రెడ్డి ఉండాలి. సీఎంగా రేవంత్ కు అధిష్టానం దగ్గర మంచి పట్టుంది. అధిష్టానం గుడ్ లుక్సులో ఉన్నారు రేవంత్. కాబట్టి రేవంత్ ను ఇప్పటికిప్పుడు తప్పిస్తారని అనుకునేందుకు లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడేమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు కాని లాజికల్ గా మాత్రం రేవంత్ ను తప్పించటం ఇప్పటికిప్పుడు జరిగే పనికాదు. ఒకవేళ రేవంత్ ను తప్పించాల్సొస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు రేసులోకి వస్తారు. అయితే వీళ్ళందరికీ అధిష్టానం దగ్గర మంచి వెయిటే ఉంది. వీళ్ళల్లో కోమటిరెడ్డి, ఉత్తమ్ ఆర్ధికంగా కూడా చాలా బలమైన వాళ్ళు. కాబట్టి ఎంఎల్ఏల మద్దతు కూడగట్టుకోవటంలో భట్టికన్నా వీళ్ళు ముందుంటారు. అయితే అంతటి బలమైన వాళ్ళని అధిష్టానం సీఎంను చేస్తుందా ? ఏమో ఇపుడు రేవంత్ ను చేసినట్లే రేపు అవసరమైతే మళ్ళీ గట్టి వాళ్ళనే సీఎం కుర్చీలో కూర్చోబెడుతుందేమో చెప్పలేము.

మళ్ళీ సీఎం కుర్చీలో రెడ్డి సామాజికవర్గం నేతే కూర్చుంటే అప్పుడు కూడా జగ్గారెడ్డికి అవకాశం దక్కదన్నది వాస్తవం. కాబట్టి ముఖ్యమంత్రిగా ఏ భట్టీయో లేకపోతే దామోదర రాజనరసింహానో లేకపోతే మరొకరో కావాలి. అందుకే తాను పీసీసీ అధ్యక్షుడు కావాలని కోరుకునే బదులు భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా నాన్ రెడ్డి ఉండాలని కోరుకుంటే బెటరేమో. అప్పుడైనా జగ్గారెడ్డి కోరిక తీరుతుందా ? ఏమో చెప్పలేము కాని ప్రయత్నం చేసుకునేందుకు అవకాశమైతే దొరుకుతుంది. మరి చూద్దాం జగ్గారెడ్డి ఆశ ఎప్పటికి తీరుతుందో ?

Read More
Next Story