కాంగ్రెస్ గూటికి చేరిన తండ్రీకూతుళ్లు.. కడియం కావ్యకు వరంగల్ టికెట్!
x
కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కడియం కావ్య

కాంగ్రెస్ గూటికి చేరిన తండ్రీకూతుళ్లు.. కడియం కావ్యకు వరంగల్ టికెట్!

కడియం శ్రీహరి, కడియం కావ్య.. కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ సీటును కావ్యకు ఇచ్చే దిశగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మరి ఏమవుతుందో..


లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. తాజాగా వర్దన్న పేట ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య.. కారుకు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన వారికి టీపీసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. అనంతరం రేవంత్ రెడ్డి, కడియం శ్రీహరి పలు అంశాలపై చర్చించుకున్నారు. వీటిలో భాగంగా కడియం శ్రీహరికి రేవంత్ రెడ్డి కీలక హామీ ఇచ్చారని, త్వరలో దాన్ని నెరవేరుస్తానని కూడా మాట ఇచ్చారని సమాచారం.

వరంగల్ ఎంపీగా కడియం కావ్య
వరంగల్ ఎంపీ బరిలో నిలబడిన కావ్య కొన్ని రోజుల క్రితమే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. తాజాగా ఆమె హస్తం గూటికి చేరారు. అయితే ఇప్పుడు ఆమె మళ్లీ వరంగల్ ఎంపీ బరిలోకి దిగనున్నట్లు సమాచారం. ఇప్పటికే వరంగల్ సీటు కోసం కావ్య పేరును కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆదివారం ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ పెద్దలతో ఎంపీ స్థానాలపై చర్చించనున్నారు. అందులో వరంగల్ అభ్యర్థిగా కావ్య పేరు ఫైనల్ కావొచ్చని, ఆ దిశగానే రేవంత్ చర్చలు కొనసాగించనున్నారని విశ్వసనీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కడియం కుటుంబీకులు కాంగ్రెస్‌లో చేరడాన్ని వరంగల్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం ఆ నేతలకు సర్దిచెప్పి, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించింది.
ఇదిలా ఉంటే ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న ఎంపీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడానికే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి పయనమవుతున్నారు. ఈ రోజు సాయంత్రమే ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్‌లో ఎంపీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 13 ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. కానీ ఖమ్మం ఎంపీ సీటు విషయంలో కాంగ్రెస్‌కు ఇంకా క్లారిటీ లేదని, ఈ సీటు కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, భట్టి విక్రమార్క భార్య నందిని పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి టికెట్ ఇవ్వాలన్న అంశంపై కాంగ్రెస్ తలమునకలవుతుంది. మరి ఖమ్మం ఎంపీ సీటు ఎవరిని వరిస్తుందో చూడాలి.
Read More
Next Story