
ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేస్తారా..?
తనది బీఆర్ఎస్ పార్టీనే అన్న రాగమే అందుకుంటారా?
బీఆర్ఎస్‌లో కవిత ఎపిసోడ్ హాట్‌హాట్‌గా మారింది. తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖతో మొదలైన కవిత ఎపిసోడ్.. ఇప్పుడు సస్పెన్షన్ చాప్టర్ వరకు చేరుకుంది. కేసీఆర్‌కు లేఖతో రాష్ట్రమంతా టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారిన కవిత.. ఇప్పుడు కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు, సంతోష్ హస్తం ఉందన్న ఆరోపణలతో నేషనల్ హెడ్‌లైన్స్‌లోకి ఎక్కారు. ఆమె వైఖరిని తీవ్రంగా పరిగణించిన పార్టీ అధినేత కేసీఆర్.. ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ఇప్పుడు ఆమె దారెటు? సస్పెన్షన్ తొలగించే వరకు వేచి చూస్తారా? లేదంటే అసలు ఆమె ప్లాన్స్ ఏంటి? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.
పదవినీ వదులుకుంటారా..!
ఇన్నాళ్లూ కూడా కవిత.. బీఆర్ఎస్ తనది, తాను బీఆర్ఎస్ నాయకురాలినే, తానే కాబోయే సీఎం అని కూడా చెప్పుకున్నారు. అలాంటిది బీఆర్ఎస్సే ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేసింది. దీంతో ఆమె ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తారా? అన్న చర్చ మొదలైంది. అయితే సస్పెన్షన్‌పై కవిత నుంచి కానీ, ఆమె అనుచర వర్గం నుంచి కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదు. ఆ విషయంపైనే ఆమె కూడా తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి.. జాగృతినే సొంత పార్టీగా మార్చి, దాని బలోపేతానికి ప్రణాళికలు సిద్ధం చేస్తారా? అన్న చర్చ కూడా మొదలైంది.
ఎమ్మెల్సీగానే కొనసాగుతారా..!
అంతేకాకుండా కవిత తన ఎమ్మెల్సీ పదవిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కేసీఆర్‌కు ఆమె రాసిన లేఖ తీవ్ర దుమారం రేపింది. ఆ సమయంలోనే కేటీఆర్‌కు కవితకు మధ్య భారీ అగాధం కూడా ఏర్పడింది. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం బంద్ చేశారు. ఆ సమయంలోనే బీఆర్ఎస్ పార్టీ.. కవితను దూరం పెట్టడం కూడా ప్రారంభించింది. ఆమె చేపట్టిన ఏ విషయానికి కూడా బీఆర్ఎస్ మద్దతు తెలిపింది లేదు. అదే విధంగా కవిత కూడా లేఖ వివాదం తర్వాత బీఆర్ఎస్ పార్టీ కండువాను వేసుకున్నదీ లేదు. కానీ అనేక సందర్భాల్లో తాను బీఆర్ఎస్ నేతనే అని, బీఆర్ఎస్ తన పార్టీ అని చెప్పుకున్నారు. అదే విధంగా ఇప్పుడు కూడా సస్పెన్షన్ వేటు వేసినా.. పార్టీ తనను వద్దనుకున్నా.. తాను మాత్రం బీఆర్ఎస్ నేతనే అని కవిత చెప్పుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సస్పెండ్ అయినా తాను బీఆర్ఎస్ నాయకురాలినే అని, బీఆర్ఎస్ తన పార్టీ అని ఆమె అన్నా అనొచ్చని విశ్లేషకులు అంటున్నారు.
రాజీనామావైపే కవిత చూపు..
తనను పార్టీ సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని కవిత నిర్ణయించుకున్నారని సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ అంశంపైనే ఆమె తన అనుచరులతో సమావేశమవుతున్నారని, మంగళవారం సాయంత్రంలోపు తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. అంతేకాకుండా తన రాజీనామా లేఖను కూడా ఆమె మంగళవారమే శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అందించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ‘కేసీఆర్‌పైనే సీబీఐ కేసులు పడిన తర్వాత పార్టీ ఉంటే ఎంత.. పోతే ఎంతా’ అంటూ కవిత ఒక విధమైన వైరాగ్యంలోకి వెళ్లిపోయారు. ‘ఎన్నికల్లో గెలుస్తుంటాం.. ఓడుతుంటాం.. నేను గెలవకపోతే ఏంటి’ అని కూడా అన్నారామే. ఇప్పుడు ఆ ఆలోచనతోనే ఆమె ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.