
కేసీఆర్, కేటీఆర్ కు రాబోయేది గడ్డుకాలమేనా ?
పీసీ ఘోష్ కమిషన్, ఏసీబీ రిపోర్టు రెండూ ఈనెలాఖరులోగా ప్రభుత్వానికి చేరే అవకాశాలు కనబడుతున్నాయి.
క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు అందరిలో ఇవే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. కాస్త అటుఇటుగా తండ్రి, కొడుకులు ఇద్దరికీ అవినీతి ఉచ్చు బిగుసుకునే అవకాశాలున్నాయని సమాచారం. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్, ఫార్ముల ఈ కార్ రేసు(Formula E Car Race) అవినీతిలో కేటీఆర్(KTR) సమస్యలు ఎదుర్కోక తప్పేట్లులేదు. నిజానికి కాళేశ్వరం అవినీతి మీద ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ విచారణ నెమ్మదిగానే నడిచింది. ప్రాజెక్టులో భాగస్వాములైన అందరినీ విచారించిన కమిషన్ కేసీఆర్, హరీష్, ఈటల రాజేందర్ ను మాత్రం వదిలేసింది. ఈ ముగ్గురిని కమిషన్ విచారణ చేయటంలేదన్న విషయం అర్ధమైపోయింది. ఎందుకంటే ఈనెలాఖరులోగా కమిషన్ విచారణ గడువు ముగుస్తోంది. అందుకనే నెలాఖరులోగా రిపోర్టును ప్రభుత్వానికి అందిస్తుందని సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతిలో ఎవరి పాత్ర ఎంత ? ఎంతమంది బాధ్యులన్న విషయాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ సాక్ష్యాలతో సహా ప్రభుత్వానికి ఇప్పటికే రిపోర్టిచ్చింది. ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవటం అన్నది నాసిరకం నిర్మాణానికి నిదర్శనంగా నిలుస్తోంది. దీనిమీద పీసీ ఘోష్ రిపోర్టు కూడా అందితే ప్రభుత్వం బాధ్యులపై చర్యలకు ఉపక్రమించవచ్చు. ఇదేసమయంలో ప్రాజెక్టులో జరిగిన నాసిరకం నిర్మాణాన్ని సాక్ష్యాలతో సహా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటి(ఎన్డీఎస్ఏ) పూర్తి సమాచారంతో ప్రభుత్వానికి మరోక రిపోర్టు ఇచ్చింది. ఏ కోణంలో చూసుకున్న ప్రాజెక్టులో జరిగిన అవినీతికి కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీషే బాధ్యులని రేవంత్(Revanth), మంత్రులు పదేపదే ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే ప్రాజెక్టు శంకుస్ధాపన జరిగింది కేసీఆర్(KCR) హయాంలోనే. ప్రాజెక్టు ప్రారంభమైంది, ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షిందంతా కేసీఆరే. కాబట్టి ప్రాజుక్టులో అవినీతికి పూర్తి బాధ్యత వహించాల్సింది కేసీఆర్, హరీష్ మాత్రమే అని ఇప్పటికే రేవంత్ చాలాసార్లు చెప్పారు.
అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగనేలేదని హరీష్(Harish Rao) బుకాయిస్తున్నారు. ప్రాజెక్టులో పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయని అడిగితే మాత్రం సమాధానం చెప్పటంలేదు. నిర్మాణం నాసిరకం కాబట్టే పిల్లర్లు కుంగిపోయిన విషయాన్ని హరీష్ అంగీకరించకుండా ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతున్నారు. పీసీ ఘోష్ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పిస్తేకాని జరిగిన అవినీతిలో ఎవరిపాత్ర ఎంత అనే విషయంలో కమిషన్ ఏమిచెప్పిందన్న విషయం బయటపడదు.
ఇక కేటీఆర్ విషయం చూస్తే క్యాబినెట్లో అనుమతులు తీసుకోకుండానే, రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండానే, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఫార్ముల ఈ కార్ రేసు నిర్వహణకు బ్రిటన్ కంపెనీకి హెచ్ఎండీఏ(HMDA) నుండి రు. 45.71 కోట్లు చెల్లింపులు జరిగిపోయాయి. ఏవిషయంలో అయినాసరే విదేశీకంపెనీలకు పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించాలంటే ముందుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అనుమతి తప్పనిసరి. అంతకన్నా ముందు క్యాబినెట్ సమవేశంలో చర్చించి తీర్మానం ఆమోదించాలి. ఈకార్ రేసును మున్సిపల్ శాఖ పర్యవేక్షిస్తే డబ్బులు హెచ్ఎండీఏతో ఇప్పించటమే ఆశ్చర్యం. ఫార్ముల కార్ రేసులో జరిగిన ఉల్లంఘనలు ఏమిటంటే మొదటిది క్యాబినెట్ అనుమతి తీసుకోలేదు. రెండోది ఆర్బీఐ అనుమతీ తీసుకోలేదు. మూడోది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నపుడు కోట్లాది రూపాయలను కేంద్ర ఎన్నికల కమీషన్ అనుమతి తీసుకోకుండానే చేసేశారు. నాలుగో తప్పు ఏమిటంటే మున్సిపల్ శాఖ చేయాల్సిన చెల్లింపులను హెచ్ఎండీఏ తో చేయించటం.
ఇన్ని ఉల్లంఘనలకు కేటీఆర్ ఎందుకు పాల్పడ్డారంటే తాను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టే. మున్సిపల్ శాఖ+హెచ్ఎండీఏ రెండూ కేటీఆర్ పరిధిలోని శాఖలే కాబట్టి బుర్రకు తోచినట్లుగా పేమెంట్లు చేయించేశారు. కేసీఆర్ కొడుకు హోదా+మంత్రి కాబట్టి తాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రశ్నించేవారు క్యాబినెట్లో ఎవరూ ఉండరన్న ధైర్యంతో. కేంద్ర ఎన్నికల కమీషన్ అనుమతి ఎందుకు తీసుకోలేదంటే మూడోసారి ప్రభుత్వంలోకి రాబోయేది ఎలాగూ తమపార్టీనే కాబట్టి అధికారంలోకి వచ్చినతర్వాత అన్నీవిషయాలకు ర్యాటిఫికేషన్ చేయించుకోవచ్చన్న అతివిశ్వాసమే కనబడుతోంది. ఈకారణంగానే ఆర్బీఐ నిబంధనలను కూడా కేటీఆర్ ఉల్లంఘించారు. అందుకనే విషయం బయటపడిన తర్వాత ఆర్బీఐ కేసీఆర్ ప్రభుత్వానికి సుమారు రు. 7 కోట్లు జరిమానా విధించింది. ఆ జరిమానాను కేసీఆర్ ప్రభుత్వం కట్టడంతోనే అప్పట్లో కేటీఆర్ తప్పుచేశారన్నది నిర్ధారణైంది.
అయితే జరిగిన ఉల్లంఘనలు, నియమ, నిబంధనల అతిక్రమణ అన్నీ కళ్ళకు కనబడుతున్నా కేటీఆర్ మాత్రం ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారు. జరిగిన అవినీతి, అవకతతవకలపై కేసులు నమోదుచేసిన ఏసీబీ(Telangana ACB) అధికారులు కేటీఆర్, అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపుల్ శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని విచారించింది. నిధుల దుర్వినియోగంపై మనీల్యాండరింగ్ కేసు నమోదుచేసిన ఈడీ(ED) కూడా పై ముగ్గురిని విచారించింది. విచారణ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించబోతున్న ఏసీబీ పై ముగ్గురిపైన యాక్షన్ తీసుకునేందుకు అనుమతి కోరబోతున్నట్లు సమాచారం. ప్రభుత్వంగనుక అనుమతిస్తే వెంటనే ఏసీబీ అధికారులు పై ముగ్గురిని అరెస్టుచేసి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశముంది. రిపోర్టు ప్రభుత్వానికి సబ్మిట్ చేసి యాక్షన్ తీసుకోవటానికి ఈనెలఖరులోనే అనుమతి కోరే అవకాశాలున్నాయని సమాచారం.
గ్రౌండ్ లెవల్లో జరుగుతున్నది చూస్తుంటే పీసీ ఘోష్ కమిషన్, ఏసీబీ రిపోర్టు రెండూ ఈనెలాఖరులోగా ప్రభుత్వానికి చేరే అవకాశాలు కనబడుతున్నాయి. రెండురిపోర్టులు ప్రభుత్వానికి చేరినతర్వాత రేవంత్ వాటిని క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తారు. తర్వాత రెండు కేసుల్లోను బాధ్యులపై యాక్షన్ తీసుకోమని దర్యాప్తు సంస్ధలకు అనుమతి ఇస్తారా లేకపోతే స్టడీ పేరుతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేస్తారా అన్నది ఆసక్తిగా మారింది. ఏదేమన్నా రాబోయే కాలం తండ్రి, కొడుకులు కేసీఆర్, కేటీఆర్ కు గడ్డుకాలం లాగే అనిపిస్తోంది. చివరకు ఏమవుతుందో చూడాలి.