
కేటీఆర్ మళ్ళీ అమెరికాకు వెళ్ళిపోతారా ?
ఎన్నికలకు ముందు తమపార్టీ ప్రజలకిచ్చిన అన్నీ హామీలను చిత్తశుద్దితో అమలుచేస్తోందన్నారు
కారుపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్ళీ అమెరికాకు వెళ్ళటం ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు జోస్యంచెప్పారు. మంగళవారం మైనంపల్లి(Mynampally HanumanthaRao) మీడియాతో మాట్లాడుతు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై బురదచల్లేస్తు ప్రజలను కేటీఆర్(KTR) తప్పుదోవపట్టిస్తున్నట్లు మండిపడ్డారు. ఎన్నికలకు ముందు తమపార్టీ ప్రజలకిచ్చిన అన్నీ హామీలను చిత్తశుద్దితో అమలుచేస్తోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళవుతోందని గుర్తుచేశారు. రెండేళ్ళల్లోనే చాలాహామీలను తమ ప్రభుత్వం అమలుచేసిందని మిగిలిన హామీలను మూడేళ్ళల్లో అమలుచేస్తామని మైనంపల్లి చెప్పారు.
కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి ప్రజలు విలక్షణమైన తీర్పిచ్చినట్లు చెప్పారు. బీఆర్ఎస్ ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నా ఇంకా తామే అధికారంలో ఉన్నట్లు కేటీఆర్ తదితరులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ళలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చని బీఆర్ఎస్ నేతలు హామీల అమలుపై తమ ప్రభుత్వాన్ని విమర్శించటం విడ్డూరంగా ఉందని ఎద్దేవాచేశారు. కాళేశ్వరం, ఫార్ములా కార్ రేసు..ఇలా అన్నింటిలోను స్కాములు చేసి పార్టీ ఫండును కూడబెట్టుకున్నట్లు కేటీఆర్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలుచేశారు మైనంపల్లి.
బీఆర్ఎస్ కు మద్దతుగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న మీడియాసంస్ధలపై చర్యలు తీసుకోవాలని మైనంపల్లి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను కోరారు. పంచాయితీ ఎన్నికలగురించి మాట్లాడుతు మెదక్ జిల్లాలోని 240 గ్రామపంచాయితీల్లో 15 ఏకగ్రీవమైనట్లు చెప్పారు. స్ధానికసంస్ధల ఎన్నికల్లో 80శాతం స్ధానాలను కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందన్న ధీమాను వ్యక్తంచేశారు.

