
5వ సారైనా అదృష్టం వరిస్తుందా ? కాంగ్రెస్ అభ్యర్ధిగా నవీన్
జూబ్లీహిల్స్(Jubilee Hills) అసెంబ్లీ ఉపఎన్నికలో నవీన్(Naveen Yadav) అభ్యర్ధిత్వాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది.
ఐదవసారి వల్లాల నవీన్ యాదవ్ తనఅదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తొందరలో జరగబోయే జూబ్లీహిల్స్(Jubilee Hills) అసెంబ్లీ ఉపఎన్నికలో నవీన్(Naveen Yadav) అభ్యర్ధిత్వాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. బుధవారం రాత్రి పొద్దుపోయాక ఏఐసీసీ(AICC) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పార్టీ అభ్యర్ధిత్వాన్ని ప్రకటించారు. టికెట్ కోసం మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్(GHMC) మాజీమేయర్ బొంతురామ్మోహన్ కూడా గట్టిగా పోటీపడినప్పటికీ అధిష్ఠానం మాత్రం నవీన్ వైపే మొగ్గుచూపింది. నవంబర్ 11వ తేదీన జరగబోయే ఉపఎన్నికకు 14వ తేదీన కౌంటింగ్ ఉంటుంది.
నవీన్ తన రాజకీయ జీవితాన్ని ఎంఐఎం పార్టీతో మొదలుపెట్టారు. కార్పొరేటర్ గా, ఎంఎల్ఏగా ఇప్పటికి నాలుగుసార్లు పోటీచేసి ఓడిపోయారు. ఇన్నిసార్లు ఓడిపోయాడంటేనే ఎన్నికల్లో నవీన్ కు గట్టి అనుభవం ఉందనే అనుకోవాలి. 2009లో యూసుఫ్ గూడ డివిజన్ కు ఎంఐఎం అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయాడు. తర్వాత 2014లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ అభ్యర్ధిగా ఎంఐఎం తరపున పోటీచేసినా గెలవలేదు. 2015లో మళ్ళీ ఎంఐఎం అభ్యర్ధిగానే రహ్మత్ నగర్ డివిజన్ కు కార్పొరేటర్ గా పోటీచేసి ఓడిపోయాడు. చివరగా 2018లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇండిపెండెంటుగా పోటీచేసి ఓడిపోయారు. అంటే ఇప్పటికి నాలుగుసార్లు ఎన్నికల్లోఓడిపోయిన నవీన్ ఐదోసారి తనఅదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఎంఐఎం తరపున లాభంలేదని అనుకుని 2023 నవంబర్ 15వ తేదీన ఎనుముల రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరాడు.
బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చదివిన నవీన్ ఆర్కిటెక్ట్ గా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్ధిరపడ్డాడు. యూసుఫ్ గూడకు చెందిన నవీన్ అధిష్ఠానం చెప్పినట్లుగా స్దానికనేత కాబట్టే రేవంత్ కూడా టికెట్ విషయంలో మొగ్గు చూపించారు. నవయువ ఫౌండేషన్ ఏర్పాటుచేసి నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈఎన్నికల్లో అయినా నవీన్ ను అదృష్టం వరిస్తుందేమో చూడాలి.