
కాంగ్రెస్ బలోపేతానికి మీనాక్షి జీవన్ టోన్ అవుతుందా ?
పార్టీ బలోపేతం అవటానికి తాను జీవన్ టోన్ టానిక్ లాగ పనిచేయాలని అనుకున్నట్లున్నారు
కొంతకాలం క్రితంవరకు జీవన్ టోన్ టానిక్ ప్రకటన ఎక్కువగా వచ్చేది. ఈమధ్యనే ఎందుకో తగ్గిపోయింది. జీవన్ టోన్ టానిక్ ఎందుకు పనిచేస్తుందంటే బలహీనంగా ఉన్న వారిలో సత్తువనింపి బలంగా తయారుచేస్తుంది. ఇపుడీ జీవన్ టోన్(Jeevantone) టానిక్ ప్రస్తావన ఎందుకంటే కొత్త ఇన్చార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) కూడా కాంగ్రెస్(Telangana Congress) బలోపేతానికి సరికొత్త ఐడియాను అమలుచేస్తున్నారు. పార్టీ బలోపేతం అవటానికి తాను జీవన్ టోన్ టానిక్ లాగ పనిచేయాలని అనుకున్నట్లున్నారు. అందుకనే కొత్త ఐడియాను అమలుచేస్తున్నారు. ఇంతకీ ఆ ఐడియా ఏమిటంటే ఎంపికచేసిన కొందరు ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో ఏఐసీసీ పరిశీలకులు ముఖాముఖి మాట్లాడటమే. మాట్లాడటం ఎందుకంటే క్షేత్రస్ధాయిలో పార్టీపరిస్ధితి ఎలాగుంది ? బలోపేతనికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి ? అమలుచేస్తున్న సంక్షేమపథకాల ప్రభావం జనాల్లో ఎలాగుంది ? పార్టీ నిర్మాణం ఎలాగుండాలని మీరు అనుకుంటున్నారు ? ఎలాంటి చర్యలు తీసుకుంటే పార్టీ బలోపేతమవుతుంది ? కీలకస్ధానంలో మీరే ఉంటే పార్టీ బలోపేతానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ? అనే ప్రశ్నలను వేశారు.
మీనాక్షి నటరాజన్ పార్టీ పరిస్ధితిపై రకరకాల మార్గాల్లో ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఏఐసీసీ(AICC) నుండి ఇద్దరు కార్యదర్శులు విశ్వనాధన్, విష్ణునాధన్ను పిలిపించారు. గాంధీభవన్లో ఇద్దరిని కలిసి ముఖాముఖి మాట్లాడాలని సుమారు 40 నియోజకవర్గాల నుండి ఒక్కోనేతకు డైరెక్టుగా మీనాక్షి ఫోన్ నుండే మెసేజులు అందాయి. దాని ప్రకారమే నేతలంతా గాంధీభవన్లో(Telangan Gandhi Bhavan) పై ఇద్దరు జాతీయ కార్యదర్శులతో సమవేశమై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ముఖాముఖి సమావేశంలో కార్యదర్శలు మాట్లాడుతు హాజరైన నేతలు పార్టీలో ఎంతకాలంగా పనిచేస్తున్నారు ? ప్రస్తుత వాళ్ళ హోదా ఏమిటి, పార్టీ లేదా ప్రభుత్వం నుండి ఏమైనా ఆశిస్తున్నారా ? అందుకు వారికి ఉన్న అర్హతలు ఏమిటి ? ఇతర పార్టీల్లో ఏమైనా పనిచేశారా ? భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవటానికి సూచనలు, సలహాలను అడిగి తెలుసుకున్నారు. మహిళా నేతలతో మాట్లాడినపుడు బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రభావం ఎలాగుంది ? రు. 500కే సిలిండర్ పథకంపై మహిళల స్పందన ఎలాగుంది ? లాంటి అనేక ప్రశ్నలు వేసి సమాధానాలను తెలుసుకున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కాంగ్రెస్ లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇవ్వండి, సలహాలు చెప్పండని ఎప్పుడూ అడిగిన దాఖలాలు లేవు. పార్టీ మీటింగుల్లో అధినేతలు మాట్లడి వెళ్ళిపోవటమే కాని అదేపనిగా వన్ టు వన్ మీటింగు నిర్వహించి సలహాలు, సూచనలు తీసుకున్నది లేదు. ఇన్చార్జిగా మీనాక్షి బాధ్యతలు తీసుకున్న తర్వాతనే ఈ ప్రక్రియ మొదలైంది. ముఖాముఖిలో ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు చెప్పింది జాతీయ కార్యదర్శలు నోట్ చేసుకున్నారు. తర్వాత తమ రిపోర్టును మీనాక్షికి అందిస్తారు. తర్వాత ఆ రిపోర్టును మీనాక్షి ఏమిచేస్తారన్నది చూడాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే నూరుశాతం ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ అన్నవిషయం తెలిసిందే. కాబట్టి నిర్మొహమాటంగా మనసులోని ఆలోచనలను నేతలు స్పష్టంగా చెప్పేస్తారు. అదేపద్దతిలో ఇపుడు కూడా నేతలంతా కార్యదర్శులకు తమ ఆలోచనలను చెప్పినట్లు పార్టీవర్గాల సమాచారం.
ముఖముఖిలో పాల్గొన్న వారిలో ఖానాపూర్ ఎంఎల్ఏ వెడ్మబొజ్జా, అచ్చంపేట ఎంఎల్ఏ వంశీకృష్ణ, వరంగల్ వెస్ట్ ఎంఎల్ఏ రాజేంద్రరెడ్డి, ఎంఎల్సీలు బల్మూరు వెంకట్(Balmuru Venkat), బస్వరాజు సారయ్యతో పాటు మరో 30 మంది సీనియర్ నేతలు పాల్గొన్నారు. నేతల ముఖాముఖిలో వాళ్ళ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితి, 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితి ఎలాగుంది ? ప్రత్యర్ధి పార్టీ బలాబలాలపైన కూడా వివరాలు తీసుకున్నారు. నేతలు మాట్లాడుతు పార్టీ బలోపేతానికి తాము చేసిన కృషిని వివరించినట్లు సమాచారం. ఎంఎల్ఏ టికెట్లు దక్కనివారికి ఎంఎల్సీలుగా అవకాశం ఇస్తామని, కార్పొరేషన్లు ఛైర్మన్లుగా అవకాశాలు ఇస్తామని ఇచ్చిన హామీలను గుర్తుచేశారు. మొదటినుండి పార్టీలోనే ఉంటున్న వాళ్ళకే టాప్ ప్రయారిటి ఇవ్వాలని చెప్పారు. కాంగ్రెస్ అనుబంధసంఘాలైన కిసాన్ సెల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, లీగల్ సెల్ ను బలోపేతం చేయాల్సిన అవసరాలను, ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. తాజాగా గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికలో ఓటమిపైన కూడా సమాచరం సేకరించారు. తనకు కార్యదర్శలు ఇచ్చేరిపోర్టు ఆధారంగా మీనాక్షి పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే.