
బీహార్లో ఇండియా కూటమిని ఆడుకుంటున్న ఓవైసీ
అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi)రెండువారాలుగా బీహార్లో(Bihar elections) ఎంఐఎం(AIMIM) పోటీచేయాలని అనుకుంటున్న ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు
తొందరలోనే జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం కీలకపాత్ర పోషించబోతోంది. రాష్ట్రంలోని 243 సీట్లలో ఎంఐఎం 35 సీట్లలో పోటీచేయాలని అనుకుంటోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, హైదరాబాద్(Hyderabad) ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi)రెండువారాలుగా బీహార్లో(Bihar elections) ఎంఐఎం(AIMIM) పోటీచేయాలని అనుకుంటున్న ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీఅభ్యర్ధులను గెలిపించాలని నియోజకవర్గాల్లో ప్రచారంచేస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీలో పార్టీకి ఐదుగురు ఎంఎల్ఏలున్న విషయం తెలిసిందే. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం 25 నియోజకవర్గాల్లో పోటీచేయగా ఐదుగురు గెలిచారు. మొదటినుండి కూడా ఎంఐఎం ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపైనే బాగా దృష్టిపెడుతోంది. దీని ఫలితంగా ముస్లింఓట్లు ఎంఐఎం, (Congress)కాంగ్రెస్, మిత్రపక్షాలు, ఎన్డీయే మధ్య చీలిపోతోంది.
ముస్లిం ఓట్లలో చీలికవల్ల సహజంగానే బీజేపీ లాభపడుతోంది. ఐదేళ్ళ క్రితం బీహార్లో జరిగిందిదే. రాష్ట్రంలోని సీమాంచల్ ప్రాంతంలో పోటీచేయటంపైనే ఓవైసీ ఎక్కువగా దృష్టిపెట్టారు. ఎందుకంటే ఈ ప్రాంతంలోని పూర్ణియా, కతియార్, కిషన్ గంజ్, అరారియా జిల్లాల్లోని 24 అసెంబ్లీ సీట్లలో ముస్లింజనాభా చాలాఎక్కువగా ఉన్నారు. సీమాంచల్ ప్రాంతంలో హిందువులు సుమారు 53శాతం ఉంటే ముస్లింలు 46శాతం ఉన్నారు. అందుకనే ఓవైసీ వ్యూహాత్మకంగా సీమాంచల్ ప్రాంతంపైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. ఓవైసీ ప్లాన్ కు తగ్గట్లుగానే సీమాంచల్ లో పోటీచేసిన 19 సీట్లలో ఐదుగురు ఇక్కడినుండే గెలిచారు. రాష్ట్రం మొత్తంమీద 25 సీట్లలో పోటీచేస్తే సీమాంచల్లోనే ఓవైసీ 19మందిని పోటీలోకి దింపారంటే ఎంతగా వర్కవుట్ చేసుంటారో అర్ధంచేసుకోవచ్చు. అమోర్ నియోజకవర్గం నుండి ఇమాన్, బైసీ నుండి రుక్నుద్దీన్ అహ్మద్, కొచ్చాదామన్ నుండి ఇషార్ అస్ఫి, బహదూర్ గంజ్ నుండి అన్జార్ నయీమ్, జొకిహాట్ నుండి షానవాజ్ ఆలం గెలిచారు.
ఈవిషయాన్ని పక్కనపెట్టేస్తే తొందరలో జరగబోయే ఎన్నికల్లో 35 సీట్లలో అభ్యర్ధులను పోటీలోకి దింపాలని ఓవైసీ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే చాలాకాలంగా అభ్యర్ధుల ఎంపికపై గట్టి కసరత్తు చేస్తున్నారు. ఓవైసీ ప్లాన్ వల్ల దెబ్బ ఎవరికి అంటే ఇండియా కూటమికే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పోయినఎన్నికల్లో పోటీచేసిన 19 నియోజకవర్గాల్లో ఎంఐఎం గట్టిపోటీ ఇచ్చింది. వీటిల్లో ఐదుచోట్ల గెలవగా మిగిలిన 14 చోట్ల కాంగ్రెస్, ఆర్జేడీ ఓటమికి కారణమయ్యింది. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు కలిసి గ్రాండ్ అలయన్స్ గా పోటీచేశాయి. గ్రాండ్ అలయన్స్ అభ్యర్ధులు, ఎంఐఎం, ఎన్డీయే అభ్యర్ధుల మధ్య 19 నియోజకవర్గాల్లోను తీవ్రమైన పోటీజరిగింది. ఆ పోటీలో ఐదుచోట్ల ఎంఐఎం గెలిస్తే మిగిలిన 14నియోజకవర్గాల్లో గ్రాండ్ అలయన్స్ అభ్యర్ధులఓటమికి ఎంఐఎం అభ్యర్ధులే కారణమయ్యారు.
రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే-ఇండియా కూటమి మధ్య గట్టిపోటీ జరగబోతోందనే సంకేతాలు కనబడుతున్నాయి. బీహార్ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవటం చాలాచాలా ముఖ్యం. ఇలాంటి పరిస్ధితుల్లో ఎంఐఎం 35 నియోజకవర్గాల్లో పోటీచేయబోతోందనే సంకేతాలు ఇండియా కూటమికి ఊహించని షాక్ అనేచెప్పాలి. ఎందుకంటే ఎంఐఎం చీల్చుకునే ఓట్లలో అత్యధికం ఇండియా కూటమికి పడతాయని అనుకుంటున్న ఓట్లే. ఇదే జరిగితే మళ్ళీ ఎన్డీయేనే అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉంటుందని చెప్పవచ్చు.
వచ్చేఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావటం ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీకి చాలా అవసరం. అందుకనే ఓవైసీని ఇండియా కూటమిలోకి కలుపుకోవటానికి కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు నానా అవస్తలు పడుతున్నారు. దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్న ఓవైసీ రెండుషరతులు పెట్టారు. మొదటిది పోయిన ఎన్నికల్లో తాము గెలుచుకున్న ఐదు నియోజకవర్గాల్లో తమఅభ్యర్ధులే పోటీచేస్తారని. రెండో షరతు ఏమిటంటే ఈ ఐదు నియోజకవర్గాలు కాకుండా అదనంగా మరో 30నియోజకవర్గాలు ఇచ్చితీరాల్సిందే అని. రెండుషరతుల్లో దేనికి ఇండియా కూటమి అంగీకరించకపోయినా తమకు వచ్చేనష్టం ఏమీలేదని ఓవైసీ తెగేసి చెబుతున్నారు. మొదటినుండి తాము అనుకున్నట్లే 35 సీట్లలో పోటీచేస్తామని గట్టిగా చెబుతున్నారు.
ఓవైసీ షరతులకు కాంగ్రెస్, ఆర్జేడీలు అంగీకరించటంలేదు. ఎందుకంటే ఈ రెండుపార్టీలకు కూడా సీమాంచల్ లో గట్టి పట్టే ఉంది. అందుకనే ఓవైసీ అడిగినన్ని సీట్లు ఇవ్వటానికి ఇండియా కూటమి సిద్ధంగా లేదు. ఫలితంగా మళ్ళీ త్రిముఖపోటీ జరిగితే ఎన్డీఏ కూటమి అభ్యర్ధులు గెలిచే అవకాశాలున్నాయి. ఈవిషయమే ఇండియా కూటమి నేతలను కలవరానికి గురిచేస్తోంది. ఓవైసీ షరతులకు అంగీకరించలేకపోతున్నారు. అలాగని ఓవైసీనీ పోటీచేయనీయకుండా అడ్డుకోలేకపోతున్నారు. మొత్తంమీద బీహార్లో ఇండియా కూటమిని ఓవైసీ ఒక ఆట ఆడుకుంటున్నట్లే ఉన్నారు. చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.