
టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకరరావు ప్రొక్లైమ్డ్ అఫెండరవుతారా ?
కోర్టు ఆదేశాలమేరకు నోటీసులు అందించేందుకు ప్రభాకరరావు ఇంటికి వెళ్ళిన పోలీసులకు ఇంటికి తాళం ఎదురైంది
టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకపాత్రదారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ బాస్ టీ ప్రభాకరరావు ప్రొక్లైమ్డ్ అఫెండర్ అవుతారా ? ఇపుడిదే విషయం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. కారణం ఏమిటంటే జూన్ 20వ తేదీలోగా హాజరుకావాలని నాంపల్లి కోర్టు ప్రభాకరరావును ఆదేశించింది. జూన్ 20లోగా కోర్టులో హాజరుకాకపోతే ప్రభాకరరావును ప్రొక్లైమ్డ్ అఫెండర్ గా ప్రకటించాల్సుంటుందని, అంతేకాకుండా నిందితుడికి సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసుకుంటామని కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలమేరకు నోటీసులు అందించేందుకు ప్రభాకరరావు ఇంటికి వెళ్ళిన పోలీసులకు ఇంటికి తాళం ఎదురైంది. ఇంట్లో ఎవరూ లేకపోవటంతో చేసేదిలేక పోలీసులు ఇంటికి నోటీసును అందించి వచ్చేశారు.
బీఆర్ఎస్(BRS) హయాంలో కేసీఆర్ వ్యతిరేకులకు చెందిన వేలాది మొబైల్ ఫోన్లను ప్రభాకరరావు ట్యాపింగ్(Telephone Tapping) చేయించిన విషయం తెలిసిందే. 2023 ఎన్నికలకు ముందే రేవంత్(Revanth) తో పాటు మరికొందరు నేతలు తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఎంతగా మొత్తుకున్నా కేసీఆర్(KCR) ప్రభుత్వం పట్టించుకోలేదు. తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే టెలిఫోన్ ట్యాపింగ్ పైన విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ఏర్పాటుచేశారు. ట్యాపింగ్ కేసులో మొదటి అరెస్టు జరగ్గానే మరుసటిరోజు ప్రభాకరరావు(T Prabhakar Rao)తో పాటు ట్యాపింగ్ లో కీలకపాత్ర పోషించిన మీడియా అధిపతి శ్రవణ్ రావు కూడా విదేశాలకు పారిపోయారు. ప్రభాకరరావు అమెరికా(America)లో కూర్చుని ఇక్కడ విచారణకు ఏమాత్రం సహకరించటంలేదు.
శాశ్వతంగా తాను అమెరికాలోనే ఉండిపోయేట్లుగా ప్రభాకరరావు ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా కుదరలేదు. ఇదేసమయంలో నిందితుడిని అమెరికా నుండి రప్పించేందుకు సిట్ అధికారులు చేసిన ప్రయత్నాలు కూడా సక్సెస్ కాలేదు. కోర్టులో పిటీషన్ వేసిన పోలీసులు ముందు లుక్ అవుట్ నోటీసు జారీచేయించారు. లాభంలేకపోవటంతో అమెరికాలోని ఇంటర్ పోల్(Interpol) అధికారుల ద్వారా రెడ్ కార్నర్(Red corner Notice) నోటీసు ఇప్పించారు. అయినా ఉపయోగంలేకపోవటంతో ఆయన పాస్ పోర్టును రద్దుచేయించారు. అప్పటికీ లాభంలేకపోయింది. ఒకవైపు పోలీసులు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే తనను అరెస్టుచేయకుండా ముందస్తు బెయిలిస్తే తాను ఇండియాకు వచ్చి విచారణకు హాజరవుతానని ప్రభాకరరవు కోర్టుకే షరతులు విధించారు.
ఈయన పిటీషన్ను నాంపల్లి కోర్టు కొట్టేసింది. వెంటన ఈయన ప్రభాకరరావు ముందస్తుబెయిల్ కోసం వేసిన కేసును హైకోర్టు కూడా కొట్టేసింది. అమెరికాలోనే ఉండిపోయేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ముందస్తుబెయిల్ కోసం వేసిన కేసులను కోర్టులు కొట్టేశాయి. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచనిస్ధితిలో ఉన్న ప్రభాకరరావుకు వ్యతిరేకంగా గురువారం నాంపల్లి కోర్టు రెండు షాకులిచ్చింది. షాకులు ఏమిటంటే జూన్ 20లోపు నాంపల్లి కోర్టులో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. హాజరుకాకపోతే ప్రొక్లైమ్డ్ అఫెండర్(Proclaimed Offender) అంటే ప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. రెండో షాక్ ఏమిటంటే గడువులోగా విచారణకు హాజరుకాకపోతే ఆయన ఆస్తులన్నింటినీ కోర్టు అటాచ్ చేసుకుంటుందని. నాంపల్లి కోర్టు ఇచ్చిన తాజా షాకులతో ప్రభాకరరావు ఏమిచేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఎప్పటిలాగే విచారణకు డుమ్మా కొడతారా ? లేకపోతే ఆస్తులను కాపాడుకోవటానికి జూన్ 20లోగా నాంపల్లి కోర్టులో హాజరవుతారా ? అన్నది చూడాలి.