బ్రిటన్ ఎన్నికల్లో పీవీ బంధువు రికార్డ్ బ్రేక్ చేసేనా?
యూకేలో కన్జర్వేటివ్ పార్టీకి కంచుకోటగా ఉన్న పార్లమెంటు స్థానంలో తెలంగాణ బిడ్డ ఉదయ నాగరాజు విజయం సాధిస్తారా?
బ్రిటన్ లో ఎన్నికల హడావిడి తుది అంకానికి చేరుకుంది. భారతదేశంలో ఇప్పటికే ఎన్నికలు ముగిసి మూడవసారి ఎన్డీయే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంవత్సరంలోనే బ్రిటన్, అమెరికాల్లోనూ ఎన్నికలు జరుగనున్నాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్ - పాలస్తీనా ఘర్షణలు, ప్రంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జరుగుతున్న బ్రిటన్, అమెరికా ఎన్నికల మీద పప్రంచ దేశాల దృష్టి ఉంది.
యూకే లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ దేశ పౌరులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీగా తరలివెళ్తున్నారు. బ్రిటన్ లో ఎన్నికలవేళ భారతదేశంలోనూ ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఎక్కువ మంది భారతి సంతతికి చెందిన అభ్యర్థులు పోటీలో నిలబడ్డారు. 2019 ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు రికార్డ్ స్థాయిలో ఎన్నికై యూకే పార్లమెంటులో ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. 2019లో పార్లమెంటు దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్స్ కి 15 మంది భారత సంతతివారు ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికల్లోనూ ఎక్కువమంది భారతి సంతతి అభ్యర్థులు
ఈసారి కూడా కన్జర్వేటివ్ పార్టీ తరపున ప్రధాని రిషి సునాక్ తో పాటు శైలేష్ వారా, ప్రీతి పటేల్, గగన్ మొహీంద్ర, క్లెయిర్ కౌటిన్హో మరోసారి అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. వీరితోపాటు కొత్తగా శివానీ రాజా, అమీత్ జోగియా లకు ఈ పార్టీ టికెట్లు ఇచ్చింది. ఇదే పార్టీ నుంచి ఏపీకి చెందిన ఎన్నారై చంద్ర కన్నెగంటి బరిలో ఉన్నారు. మరోవైపు లేబర్ పార్టీ తరఫున నవేందు మిశ్రా, ప్రీత్ కౌర్ గిల్, తన్మన్జత్ సింగ్ దేశి, లీసా నంది, సీమా మల్హోత్రా తదితరులు పోటీ చేస్తున్నారు. ఇదే పార్టీ నుంచి భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు దూరపు బంధువు, తెలంగాణకి చెందిన ఉదయ్ నాగరాజు పోటీలో ఉన్నారు. ఇతర పార్టీలు కూడా భారత సంతతికి చెందినవారికి టికెట్లు ఇచ్చాయి.
అయితే, ఈసారి కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీల మధ్యే బలమైన పోటీ ఏర్పడింది. కానీ, కన్జర్వేటివ్ పార్టీ 14 ఏళ్ల పాలనకు ముగింపు పలికే అవకాశం ఉన్న కైర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ఒపీనియన్ పోల్స్ సూచిస్తున్నాయి. అంతేకాదు, 1992 నుంచి కన్జర్వేటివ్ పార్టీకి కంచుకోటగా ఉన్న పార్లమెంటు స్థానంలో తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజు భారీ విజయం సాధిస్తారని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి.
తెల్లోడి గడ్డపై తెలంగాణ బిడ్డ సత్తా చాటేనా?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరకు చెందిన ఉదయ్ నాగరాజు (45) లేబర్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ లేబర్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ బౌండరీ కమిషన్ సూచనతో ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పాటైంది. కొద్దిరోజుల క్రితం అక్కడి ప్రఖ్యాత సర్వే సంస్థ ఎలెక్టోరల్ కాల్కులస్ ఎన్నికల ఫలితాలపై ఓ రిపోర్ట్ ఇచ్చింది. ఈ నివేదిక పక్రారం నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ నియోజకవర్గంలో 68 శాతం లేబర్ పార్టీ గెలవబోతోందని అంచనా వేసింది.
తాజాగా, ఉదయ్ నాగరాజు మరో సర్వే సంస్థ వేసిన అంచనాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సర్వేషన్ (Survation) అనే సంస్థ నిర్వహించిన పోలింగ్ సర్వే వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సంస్థ 2010 నుండి లండన్, ఇంగ్లాండ్‌లో పోలింగ్, మార్కెట్ పరిశోధన సర్వేలను నిర్వహిస్తోంది. సర్వేషన్ అంచనా ప్రకారం 1992 నుండి కన్జర్వేటివ్ పార్టీకి కంచుకోటలా ఉన్న ఈ నియోజకవర్గంలో లేబర్ పార్టీ అభ్యర్థి ఉదయ్ నాగరాజు గెలుస్తాడని పేర్కొంది. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో లేబర్ పార్టీకి 38.8% ఓట్ షేర్, కన్జర్వేటివ్ అభ్యర్థికి 33% ఓట్లు లభిస్తాయని అంచనా వేసింది. లిబరల్ డెమొక్రాట్‌లు 9.3%, గ్రీన్స్ 2.7%, రిఫార్మ్ అభ్యర్థి 16.2% ఓట్ షేర్ దక్కించుకోవచ్చని చెబుతోంది. ఈ ఒపీనియన్ పోల్స్ నిజమై ఉదయ్ నాగరాజు గెలిస్తే మూడు దశాబ్దాలుగా ఇక్కడ గెలుస్తూ వస్తోన్న కన్జర్వేటివ్ పార్టీ రికార్డ్ బ్రేక్ చేసినవాడవుతాడు.
ఉదయ్ నాగరాజు ఎక్కడివాడు?
తెలంగాణలోని ఉమ్మడికరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఉదయ్ నాగరాజు జన్మించారు. ఆయన హనుమంత రావు, నిర్మలాదేవి దంపతుల కుమారుడు. చిన్నప్పటి నుంచే కష్టపడేతత్వం కలిగి ఉండే ఉదయ్ అంచెలంచాలుగా ఎదిగారు. బ్రిటన్ లోని పప్రంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ లో అడ్మినిస్ట్రేషన్ లో పీజీ చేశారు.
ఉదయ్ లాభాపేక్ష లేని సంస్థలను నడపడం నుండి సమగ్ర అభివృద్ధిని పరిశోధించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పభ్రావం ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ ల్యాబ్స్ ని నెలకొల్పడంలో కృషి చేశారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా పేరు సంపాదించారు. స్కూల్ గవర్నర్ గా, వాలంటీర్ గా, లేబర్ పార్టీలో విస్తృత రాజకీయ పచ్రారకుడిగా ఒక దశాబ్దకాలంగా ఇంటింటికీ పచ్రారం చేసి సామాన్యుల కష్టాలపై మంచి అవగాహన సాధించారు.
ఇటీవల తెలుగు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా వివిధ సర్వేల ఆధారంగా కన్సర్వేటివ్ పార్టీ కనీవిని ఎరుగని రీతిలో ఓడిపోయి లేబర్ పార్టీ గెలుస్తుందని విశ్లేషించారు. గత కొన్ని ఎన్నికల్లోనూ లేబర్ పార్టీ ఎంపీలు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. మే లో జరిగిన కౌన్సిలర్, రాష్ట్ర మేయర్ ఎన్నికలోనూ లేబర్ పార్టీ విజయం సాధించింది. దీంతో తెలంగాణకి చెందిన ఉదయ్ నాగరాజు కూడా బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధిస్తారని ఆయన సన్నిహితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.