స్వాగత ఏర్పాట్లతో రాహుల్ థ్రిల్ అయిపోవాల్సిందేనా ?
ఎయిర్ పోర్టు లాంజులో నుండి బయటకు వచ్చేదారిలో పూలవర్షం కురిపించేందుకు పార్టీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఏర్పాట్లుచేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన ఒక మరపురానిదిగా మిగలబోతోంది. మంగళవారం సాయంత్రం రాహుల్(Rahul Gandhi) మహారాష్ట్ర(Maharashtra) నుండి హైదరాబాద్(Hyderabad) కు వస్తున్న విషయం తెలిసిందే. రాహుల్ కు అపూర్వ స్వాగతం చెప్పటానికి రేవంత్(Revanth Reddy), మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), మంత్రులు, ప్రజాప్రతినిధిలతో పాటు సీనియర్లు, క్యాడర్ వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 6వ తేదీన బుధవారం మొదలవబోతున్న కులగణన(Family Survey) కార్యక్రమంపై ప్రజాసంఘాలు, బీసీసంఘాల నేతలతో పాటు పార్టీలోని సీనియర్లందరితో రాహుల్ సమావేశం అవబోతున్నారు. సుమారు గంటసేపు జరగబోయే ఈ సమవేశంలో సభకు హాజరైనవారినుండి సూచనలు, సలహాలు తీసుకోవటమే కాకుండా తన ఆలోచనలను కూడా పంచుకోబోతున్నారు. బోయినపల్లిలోని మహాత్మాగాంధీ ఐడియాలజీ సెంటర్లో(Mahatma Gandhi Ideology Centre) షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు సమావేశం జరగబోతోంది. బేగంపేట ఎయిర్ పోర్టులో ప్రత్యేక విమానంలో దిగుతున్న రాహూల్ ఐడియాలజీ సెంటర్లోనే గడిపి అక్కడి నుండి మళ్ళీ బేగంపేట విమానాశ్రయంకు చేరుకుని ఢిల్లీకి వెళిపోతారు.
రాహుల్ గాంధీ తెలంగాణాలో పర్యటించటం, హైదరాబాద్ లో సమావేశాల్లో పాల్గొనటం మామూలే. అయితే ఈరోజు పర్యటన మాత్రం రాహుల్ కు అత్యంత మరపురాని స్వాగతంగా ఉండిపోవాలని ప్రభుత్వం+పార్టీ సంయుక్తంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎలాగంటే బేగంపేట విమానాశ్రయం(Begum Pet Air Port) నుండి బోయినపల్లిలోని ఐడియాలజీ సెంటర్ కు మధ్య దూరం 8 కిలోమీటర్లు. మామూలుగా అయితే 8 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి 10 నిముషాలకన్నా పట్టదు. కాని ఈరోజు సాయంత్రం రాహుల్ ప్రయాణం మాత్రం ఎంతసేపు పడుతుందో చెప్పలేకపోతున్నారు.
ఎందుకంటే బేగంపేట నుండి బోయినపల్లి వరకు బ్రహ్మాండమైన ర్యాలీని ఏర్పాటు చేశారు. మెయిన్ రోడ్డులో రాహుల్ ప్రయాణించే దారి మొత్తం భారీ కటౌట్లు, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు, స్వాగత తోరణాలను ఏర్పాటుచేశారు. వందలాది మోటారుబైకులతో ర్యాలీ ఏర్పాటుచేశారు. ఎయిర్ పోర్టు లాంజులో నుండి బయటకు వచ్చేదారిలో పూలవర్షం కురిపించేందుకు పార్టీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఏర్పాట్లుచేశారు. 8 కిలోమీటర్ల రాహుల్ ప్రయాణం మొత్తం పూల వర్షం కురిసేట్లుగా ఏర్పాట్లు చేసినా సెక్యూరిటీ అధికారులు అభ్యంతరాలు వ్యక్తంచేశారని సమాచారం. రోడ్డుకు రెండువైపులా ఉన్న అపార్టుమెంట్ల పైనుండి పూలవర్షం కురిపించాలని ప్లాన్ చేశారు. అయితే సెక్యూరిటి వాళ్ళు అభ్యంతరం వ్యక్తంచేయటంతో ప్రత్యామ్నాయంగా ఏమి ఏర్పాట్లు చేశారో తెలీలేదు.
వేలాదిమందితో భారీ ర్యాలి నిర్వహించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధికి ఆనుకుని ఉండే ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గాల్లోని నేతలు, క్యాడర్ తో పాటు పెద్దఎత్తున జనాలు ర్యాలీలో పాల్గొనేట్లు జాగ్రత్తలు తీసుకున్నారు. రాహుల్ రాక కోసం ఈ స్ధాయిలో ఎందుకింత ఏర్పాట్లు చేస్తున్నట్లు ? ఎందుకంటే పార్టీ తరపున ఏర్పాట్లు చేసింది, చేస్తున్నది పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. బొమ్మ పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత రాహుల్ మొదటిసారి హైదరాబాద్ వస్తున్నారు. కాబట్టి రాహుల్ కు తన కెపాసిటి ఏమిటో చూపించాలని బొమ్మ చాలా పట్టుదలగా, ఉత్సాహంగా ఉన్నారు.
బొమ్మ పట్టుదల, ఉత్సాహానికి రేవంత్ కూడా నూరుశాతం సహకారం అందించారు. ఎందుకంటే రేవంత్ కు బొమ్మ అత్యంత సన్నిహితుడే కాకుండా నమ్మకమైన మద్దతుదారుడు కూడా. పార్టీపరంగా స్వాగత ఏర్పాట్లు ఎంత ఘనంగా ఉంటే పీసీసీ అధ్యక్షుడితో పాటు రేవంత్ కు కూడా క్రెడిట్ తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి సహకారం లేనిదే పార్టీ అధ్యక్షుడు మాత్రమే అన్నీ ఏర్పాట్లు చేయలేరని అందరికీ తెలిసిందే. తెలంగాణా ఏర్పాటైన పదేళ్ళల్లో రాహుల్ చాలాసార్లు తెలంగాణాలో పర్యటించినా అప్పుడు పార్టీ ప్రతిపక్షంలోనే ఉండేది. ఇపుడు జరుగుతున్న స్ధాయిలో స్వాగత ఏర్పాట్లకు అప్పట్లో ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. అలాంటిది ఇపుడు పార్టీ అధికారంలోకి ఉంది కాబట్టి స్వాగత ఏర్పాట్లకు ఆకాశమేహద్దయిపోయింది. అందుకనే మహేష్ కుమార్ గౌడ్ తన కెపాసిటీ మొత్తాన్ని స్వాగత ఏర్పాట్లలో చూపుతున్నారు. రాహుల్ తో పాటు ఓపెన్ టాప్ జీపులో రేవంత్, బొమ్మ, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉండబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం.