కేసీయార్ కు రేవంత్ ప్రభుత్వం సన్మానం ?
వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా నిజం. తొందరలోనే కేసీయార్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్మానించబోతోంది.
వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా నిజం. తొందరలోనే కేసీయార్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్మానించబోతోంది. జూన్ 2వ తేదీకి తెలంగాణా ఆవిర్భవించి పదేళ్ళవుతోంది. ఆ సందర్భంగా పెద్దఎత్తున ఆవిర్భావ దినోత్సవాన్ని జరపాలని రేవంత్ ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశం తీర్మానించింది. ఆ సందర్భంగా తెలంగాణా ఇచ్చిన సోనియాగాంధీని ప్రత్యేకంగా సన్మానించాలని కూడా డిసైడ్ చేసింది. తెలంగాణాను ఇచ్చిన సోనియాతో పాటు తెలంగాణా రాష్ట్ర సాధనకోసం పోరాటాలుచేసిన పెద్దలను కూడా ఆహ్వానించి సోనియాతో పాటు ప్రభుత్వం సన్మానించబోతున్నది. ఆ పెద్దల్లో కేసీయార్ కూడా ఉన్నారు. జూన్ 2వ తేదీన తెలంగాణా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా రాష్ట్రప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమీషన్ కు లేఖ రాయబోతోంది.
ఇదే విషయాన్ని క్యాబినెట్ సమావేశం తర్వాత మంత్ర దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతు ‘తెలంగాణా రాష్ట్రం ఇచ్చిన సోనియాతో పాటు తెచ్చిన పెద్దలను కూడా సన్మానం చేయబోతున్న’ట్లు చెప్పారు. ‘కేసీయార్ ను కూడా ఆహ్వానించటంలో (సన్మానం చేయటానికి) తమ పభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవ’ని ప్రకటించారు. కాబట్టి సోనియాతో పాటు సన్మానం అందుకోబోయే మరికొందరిలో కేసీయార్ కూడా ఉండటం గ్యారెంటీ అని తేలిపోయింది. ఇక్కడ విషయం ఏమిటంటే తెలంగాణా ఆవిర్భావం కోసం వేలాదిమంది పోరాటాలు చేశారు. రాజకీయపార్టీలతో పాటు ప్రజాసంఘాలు, విద్యార్ధిసంఘాలు కూడా పోరాటాలు చేశాయి. వందలమంది బలిదానాల ఫలితమే తెలంగాణా ఆవిర్భావం. అయితే తెలంగాణా ఏర్పాటు క్రెడిట్ మొత్తం కేసీయార్ తానొక్కరే తీసేసుకున్నారు. ‘చావునోట్లో తలపెట్టి తెలంగాణాను సాధించా’నని కొన్ని వేలసార్లు ప్రకటించుకున్నారు. తెలంగాణా ఇచ్చిన సోనియాకు మొదట్లో ధన్యవాదాలు చెప్పినా ఆ తర్వాత ఎప్పుడూ యూపీయే లేదా కాంగ్రెస్ తెలంగాణాను ఇచ్చిందన్న మాటను ప్రస్తావించలేదు.
తెలంగాణా ఏర్పడింది కాబట్టి కేసీయార్ మాటలను ఎవరు పట్టించుకోలేదు. ఈ పదేళ్ళల్లో ఎప్పుడు మాట్లాడినా తెలంగాణాను సాధించింది తానుమాత్రమే అన్న అర్ధంవచ్చేట్లే మాట్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది. ఈ నేపధ్యంలోనే సోనియాగాంధీతో పాటు మరికొందరిని కూడా సన్మానించాలని మంత్రివర్గం డిసైడ్ చేసింది. సోయినాతో పాటు కొందరు పెద్దలను కూడా ఆహ్వానిస్తామని అందులో కేసీయార్ కూడా ఉంటారని మంత్రి చెప్పారు. వేదికమీద సోనియాను సన్మానించిన ప్రభుత్వం కొందరు పెద్దలను సన్మానించకుండా వదిలేయదు కదా. పెద్దలను పిలవటం అంటేనే సోనియాతో పాటు సన్మానించటానికే. ఆ కొందరిలో కేసీయార్ కూడా ఉంటారని శ్రీధర్ బాబు చెప్పారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే సన్మాన కార్యక్రమానికి కేసీయార్ హాజరవుతారా ? సోనియాతో పాటు వేదికమీద కూర్చుని సన్మానాన్ని అందుకుంటారా అన్నది ఆసక్తిగా మారింది. ఎందుకంటే వ్యక్తిగతంగా రేవంత్, కేసీయార్ మద్య సంబంధాలు ఉప్పు నిప్పులాగున్న విషయం అందరికీ తెలిసిందే. ఓటుకునోటు కేసులో దొరికిన రేవంత్ ను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు అప్పట్లో కేసీయార్ చాలా గట్టిగానే ప్రయత్నించారు.
కొంతకాలం జైలులో గడిపిన రేవంత్ తర్వాత కోర్టుల ద్వారా కేసీయార్ ప్రయత్నాలను అడ్డుకున్నారు. అప్పటినుండి ఇద్దరిమధ్య ఓపెన్ వార్ నడుస్తోంది. రేవంత్ ను దెబ్బకొట్టే ఏ చిన్న అవకాశాన్ని కూడా కేసీయార్ వదులుకోలేదు. ఇదే సమయంలో కేసీయార్ ను రేవంత్ తీవ్రంగా ప్రతిఘటించారు. ఇందులో భాగంగానే టీడీపీ నుండి రేవంత్ కాంగ్రెస్ లో చేరి పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంటయి తర్వాత ప్రెసిడెంట్ అయి బీఆర్ఎస్ ను ఓడించి ముఖ్యమంత్రయ్యారు. రేవంత్ సీఎం అవ్వటాన్ని కేసీయార్ తట్టుకోలేకపోతున్నారు. అసెంబ్లీలో రేవంత్ కు ఎదురుపడటం కేసీయార్ కు ఏమాత్రం ఇష్టంలేదు. అందుకనే మొదటి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. ఎంఎల్ఏ గా కూడా తర్వాతెప్పుడో విడిగా ప్రమాణంచేశారు.
పదేళ్ళ పాలనలో కేసీయార్ తీసుకున్న అనేక నిర్ణయాలపై రేవంత్ ప్రభుత్వం విచారణ చేయిస్తోంది. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో అవినీతి, నాసిరకం నిర్మాణాలు, టెలిఫోన్ ట్యాపింగ్ లాంటి అనేక అంశాలపై విచారణ జరుగుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే తెలంగాణా ఆవిర్భావం పేరుతో రేవంత్ ప్రభుత్వం సన్మానం చేయాలని డిసైడ్ అయ్యింది. సన్మానం అందుకోబోయేవారిలో సోనియాతో పాటు కేసీయార్ కూడా ఉంటారని మంత్రి శ్రీధర్ బాబు చెప్పటం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరి దశాబ్ది వేడుకులకు కేసీయార్ హాజరవుతారా ? సన్మానం అందుకుంటారా అన్నది చూడాలి.