‘తెలంగాణలో టీడీపీ బలోపేతం’.. అసలెక్కడ తేడా పడింది..?
తెలంగాణలో టీడీపీ బలోపేతం చేయడం కోసం టీడీపీ నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
తెలంగాణలో టీడీపీ బలోపేతం చేయడం కోసం టీడీపీ నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు చర్చలు చేస్తున్నామని, భవిష్యత్ కార్యాచరణను అతి త్వరలోనే ప్రకటిస్తామని తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా ప్రకటించారు. ఇటీవల పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించగా 1.60 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నట్లు లోకేష్ వెల్లడించారు. తెలంగాణలో కూడా పార్టీని పునఃనిర్మించడం, బలోపేతం చేయడం లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. శనివారం ఎన్‌టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఎన్‌టీఆర్ ఘాట్ దగ్గర లోకేష్ నివాళులు అర్పించారు. ఈ సందర్బంగానే ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీ బలోపేతం అంశంపై అప్‌డేట్ ఇచ్చారు. అయితే ఇప్పటికే ఈ అంశంపై చంద్రబాబు కూడా దృష్టి సారించారు. పలుసార్లు హైదరాబాద్‌లోని ఎన్‌టీఆర్ భవన్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యచరణపై చర్చలు జరిపారు.
ఎన్‌టీఆర్ అంటే పేరు కాదు: లోకేష్
‘‘ఎన్‌టీఆర్ అంటే మూడు అక్షరాల పేరు అనుకునేరు. కాదు అదొక ప్రభంజనం. అన్ని రకాల సినిమాలు చేసిన సినీ రంగంలో తనదైన ముద్ర చూపారు. అదే విధంగా రాజకీయాల్లో సైతం ఎన్నో సేవలు అందించి ప్రజల గుండెల్లో చిరస్తాయిగా నిలిచిపోయారు. ఆస్తిలో మహిళలకు హక్కు కల్పించిన వ్యక్తి ఎన్‌టీఆర్, తెలుగు వారిని మద్రాసీలు అని పిలుస్తున్న వేళ వాళ్లందరికీ కూడా తెలుగువారమని చెప్పుకునేలా చేసిన వ్యక్తి ఎన్‌టీఆర్. రూపాయికి రేషన్ బియ్యం స్కీమ్‌తో ఎందరో పేదల ఆకలి తీర్చిన వ్యక్తి ఎన్‌టీఆర్’’ అని తెలిపారు.
టీడీపీపై ప్రేమ అలానే ఉంది
‘‘తెలంగాణ ప్రజల మదుల్లో ఇప్పటికీ టీడీపీపై ప్రేమ అలానే ఉంది. అందుకు ఇటీవల స్వచ్ఛందంగా 1.60లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకోవడమే నిదర్శనం. ఇప్పుడు ఎలాంటి ఎమ్మెల్యేలు లేకుండా ఇంతమంది సభ్యత్వం తీసుకున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా పార్టీ కార్యకలాపాలు ప్రారంభిస్తాం. త్వరలోనే తెలంగాణ టీడీపీని బలోపేతం చేస్తాం’’ అని లోకేష్ చెప్పారు. అయితే 2028లో జరిగే ఎన్నికల్లో టీడీపీ కూడా పోటీ పడే అవకాశం ఉందని సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఆ లక్ష్యంతోనే చంద్రబాబు ప్లాన్ చేశారని, అందుకే ఇప్పటి నుంచి తెలంగాణలో పార్టీని మళ్ళీ క్షేత్ర స్థాయి నుంచి నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో గట్టి దెబ్బే తగిలింది.
2014లో జరిగిన ఎన్నికల్లో 13 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. కానీ ఆ ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అధికారం చేతికొచ్చిన కొన్నాళ్లకే టీడీపీ తరుఫున గెలిచిన అభ్యర్థులను కూడా లాగేసుకుంది. దీంతో తెలంగాణలో టీడీపీ బలం సున్నా అభ్యర్థులకు పడిపోయింది. దాంతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీ సుమారు 14 స్థానాల్లో పోటీ చేసినప్పటికి కేవలం ఖమ్మంలోని రెండు స్థానాల్లో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. అవే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కూటమిగా పోటీ చేశాయి. కాంగ్రెస్‌ను గెలిపించడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని చంద్రబాబు పిలుపు కూడా ఇచ్చారు.
అదే సమయంలో అసలు చంద్రబాబు మద్దతు వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందంటూ తీవ్ర విమర్శలు కూడా టీడీపీ పెద్దలు ఎదుర్కొన్నారు. చంద్రబాబు ఇచ్చిన మద్దతు వల్ల కాంగ్రెస్‌కు ఎటవంటి లబ్ధి చేకూరలేదని పలువురు నేతలు కూడా బాహాటంగానే అన్నారు. ఆ తర్వాత తెలంగాణలో టీడీపీ పార్టీ దాదాపు కనుమరుగైన పరిస్థితి నెలకొంది. 2023 ఎన్నికలకు టీడీపీ దూరం పాటించింది. కేవలం కొందరు నేతలకు మాత్రమే మద్దతు పలికింది. రాష్ట్ర విభజన తర్వాత పలు విధాలు పార్టీని తెలంగాణలో నిలబెట్టాలని చంద్రబాబు ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పటికే తెలంగాణలో కేసీఆర్ రేకెత్తిచ్చిన ప్రాంతీయతత్వం, ఆంధ్రవాళ్లు-తెలంగాణ వాళ్లు అన్న భేదం టీడీపీకి భారీ ఎదురుదెబ్బగా మారాయి. 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్.. మళ్ళీ ఆంధ్ర పాలకులు తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ చంద్రబాబు, టీడీపీ మద్దతును ఉద్దేశించి నినాదించారు. ఆ దెబ్బకు టీడీపీ దాదాపు 12-14 స్థానాల్లో పోటీ చేసినా కేవలం రెండు స్థానాల్లోనే విజయం సాధించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన తర్వాత టీడీపీ.. తెలంగాణపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో పార్టీని పునరుద్దరించాలని చంద్రబాబు నిశ్చయించుకున్నారు. ఆ దిశగా ప్రణాళికలు కూడా ప్రారంభించారు.
యువ రక్తం కావాలి: చంద్రబాబు
తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని అనుకున్న చంద్రబాబు ఇప్పటికే పలుసార్లు తెలంగాణను సందర్శించారు. ఎన్‌టీఆర్ భవన్‌లో పార్టీ కార్యకర్తలతో చర్చలు చేశారు. ఈ క్రమంలోనే ఒకసారి ఎన్‌టీఆర్ భవన్‌లో చంద్రబాబు మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీ బలోపేతం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీలోకి యువ రక్తం రావాలని కోరారు. యువతను తమ పార్టీ ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుందని అన్నారు. చంద్రబాబు నిర్వహించిన ఈ సమావేశానికి తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు అంతా హాజరయ్యారు. చంద్రబాబుకు వారు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో మాట్లాడిన చంద్రబాబు.. తెలంగాణలో పార్టీని మళ్ళీ నిలబెట్టాలని, ఆ దిశగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం ప్రారంభించాలని, ఇందుకు ప్రతి కార్యకర్తల కూడా అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే విధంగా పార్టీకి జవసత్వాలు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో కూడా కూటమి ఏర్పడుతుందా..
అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎవరు ఎన్ని సీట్లు తీసుకున్నారు అన్నది పక్కన బెడితే మూడు పార్టీలు కూటమిగా ముందుకు సాగుతున్నాయి. ఢిల్లీలో సైతం టీడీపీ కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు లేదా జమిలి ఎన్నికల సమయంలో తెలంగాణలో పోటీ చేయాలని టీడీపీ ప్లాన్ చేస్తుంది. కాగా తెలంగాణలో కూడా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి కలుస్తుందా? లేదంటే కూటమిని ఏపీకి మాత్రమే పరిమితం చేస్తారా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో ఇప్పటికే బీజేపీ బలంగా తయారవుతూ ఉంది. మరోవైపు జనసేన కూడా తెలంగాణలో అడుగు పెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా ఈ మూడు పార్టీలు కూటమి కట్టొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఇక్కడ సీట్ల పంపకాల్లో కాస్తంత తేడా వచ్చే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.
బీజేపీదే పై చేయి అవుతుందా?
తెలంగాణలో టీడీపీ గతంలో పాలన కొనసాగించినా ప్రస్తుతం మాత్రం ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. దీంతో తెలంగాణలో టీడీపీ మళ్ళీ స్టెప్ 1 నుంచి ఎదగాలి. అదే విధంగా జనసేన కూడా ఇప్పటి వరకు తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వలేదు. కానీ బీజేపీ మాత్రం ఇప్పటికే తెలంగాణలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాల్లో ఒకటిగా నిలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన వాయిస్ వినిపిస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా కలిగి ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణలో ఒకవేళ కూటమి ఏర్పడితే అది బీజేపీ-టీడీపీ-జనసేనగా మారొచ్చు. అధికశాతం సీట్లు బీజేపీ తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.