కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ వాటా ఈ సారైనా దక్కేనా?
2023-24 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో ఈ ఏడాదైనా తెలంగాణ వాటా దక్కేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేపు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏళ్ల తరబడిగా పెండింగులో ఉన్న ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించి మోక్షం కల్పించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
- తెలంగాణకు గడచిన మూడేళ్లుగా బడ్జెట్ కేటాయింపుల్లో తీరని అన్యాయం జరిగింది. నిధులు కేటాయించక పోవడంతో పలు ప్రాజెక్టుల నిర్మాణాలు నిలిచి పోయాయి.
- 2023-24 ఆర్థిక సంవత్సరంలో 41,259 కోట్ల రూపాయల కేంద్ర గ్రాంటు ఇవ్వాలని తెలంగాణ సర్కారు కోరగా, కేంద్రం మాత్రం కేవలం 9,729 కోట్ల రూపాయలే కేటాయించింది.
- 2022-23 లో రూ.41,001 కోట్లు కేంద్ర గ్రాంటు కావాలని ప్రతిపాదించినా కేంద్రం మాత్రం కేవలం రూ.13,179 కోట్లనే విదిల్చింది.
- 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.38,669 కోట్ల కేంద్ర గ్రాంటు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరగా రూ.8,619 కోట్లనే కేటాయించింది.
- దీంతో వరుసగా మూడేళ్లుగా కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిన నేపథ్యంలో ఈ ఏడాదైనా అధిక నిధులు కేటాయించి తెలంగాణకు న్యాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి విన్నవించారు.
జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపు ఏది?
రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన కేంద్ర నిధులను కేటాయించాలనే నిబంధన ఉంది. జనాభా నిష్పత్తిలో తెలంగాణకు నిధులు రాకపోవడంతో పలు ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పథకాల కింద రూ.4,60 లక్షల కోట్లను కేంద్రం వివిధ రాష్ట్రాలకు కేటాయించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి రూ.6,577 కోట్లు మాత్రమే వచ్చాయి. జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణకు 3 శాతం అంటే రూ.14వేల కోట్లు రావాలి. కానీ కేంద్రం జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించలేదు. దీంతో పలు అభివృద్ధి పథకాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారాయి.
జాతీయ ప్రాజెక్టులకు కేంద్రం నిధులివ్వాలి : ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు
తెలంగాణలో పెండింగులో ఉన్న జాతీయ ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇవ్వాలని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు కోరారు. అయిదేళ్లుగా నిధుల కేటాయింపుల్లో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని పీఎల్ విశ్వేశ్వరరావు చెప్పారు. తెలంగాణకు జనాభా ప్రాతిపదికన కేంద్రం గ్రాంటు ఇవ్వాలని ఆయన కోరారు. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారం నిధులు కేటాయించాలని ఆయన సూచించారు.
వ్యవసాయాభివృద్ధి పథకాలు, సాగునీటి ప్రాజెక్టులకు నిధులివ్వండి
తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు, వ్యవసాయాభివృద్ధి పథకాలకు కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. మూడేళ్లుగా కేంద్రం గ్రాంటు కేటాయింపుల్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిన దృష్ట్యా ఈ ఏడాదైనా అధిక నిధులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కల్పించండి
తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి, మోక్షం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కేంద్రాన్ని కోరారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం, హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ రోడ్డుకు, మెట్రోరైలు రెండో దశ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు,కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, ఆధునికీకరణ, డబ్లింగ్, బయ్యారం స్టీలు ప్లాంటుకు కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరారు. భారత్ మాల పరియోజన కింద తెలంగాణలో 8 రోడ్లను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది.
కొత్త పథకాలకు నిధులివ్వండి
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న మూసీ రివర్ అర్బన్ ఫ్రంట్ ప్రాజెక్టు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి,హైదరాబాద్-కల్వకుర్తి హైవే అభివృద్ధి, హైదరాబాద్ లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కు, హైదరాబాద్- కరీంనగర్ రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కోరారు.తెలంగాణలో ఐఐఎం, ఎలకుర్తిలో సైనిక్ స్కూలు, నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదించారు.కరీంనగర్, వరంగల్ నగరాలకు స్మార్ట్ సిటీ కింద నిధులు కేటాయించాలని, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి పథకం కింద నిధులు కావాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర నార్కొటిక్స్ బ్యూరో ఆధునికీకరణకు నిధులు కేటాయించాలని కోరారు.
Next Story