
బీఆర్ఎస్ ను ‘బీసీ అస్త్రం’ ఆదుకుంటుందా ?
అసెంబ్లీఎన్నికల్లో ఓటమితర్వాత పుంజుకునేందుకు బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది.
అసెంబ్లీఎన్నికల్లో ఓటమితర్వాత పుంజుకునేందుకు బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్(KCR) గడచిన 14 మాసాలుగా ఫామ్ హౌస్ కే పరిమితం అవటంతో మాజీమంత్రులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలకు సరైన దిశానిర్దేశం లేకుండాపోయింది. పార్టీకి చెందిన పదిమంది ఎంఎల్ఏలు, ఆరుగురు ఎంఎల్సీలు కాంగ్రెస్ లోకి ఫిరాయించటంతో పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది. 2014 ఎన్నికల్లో బొటాబొటి మెజారిటితో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులతోనే బలపడింది. ఇపుడదే ఫిరాయింపుల కారణంగా పార్టీ ఇబ్బందుల్లో పడిపోయింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు ప్రతిరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపణలతో రెచ్చిపోతున్నా మిగిలిన నేతలు మాత్రం స్తబ్దుగానే ఉన్నారు.
పార్టీపుంజుకోవటంలో అవస్తలుపడుతున్న నేపధ్యంలో ప్రభుత్వం విడుదలచేసిన కులగణన సర్వే రిపోర్టు(Cast census)తో పార్టీలో కొత్తఉత్సాహం తొంగిచూస్తోందనే చెప్పాలి. రిపోర్టుఆధారంగా కేటీఆర్(KTR), హరీష్ తదితరులు బీసీ అస్త్రాన్ని(BC Slogan) పార్టీ పునరుత్తేజానికి ఆయుధంగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగానే పార్టీఆఫీసులో ఆదివారం ప్రజాప్రతినిధులు, మాజీమంత్రులు, సీనియర్ నేతలతో కేటీఆర్ బీసీ అంశంపై సుదీర్ఘ మీటింగ్ పెట్టుకున్నారు. స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే అనే డిమాండుతో ఆందోళనలు చేయాలని డిసైడ్ అయ్యారు. గ్రామాల నుండి నియోజకవర్గాల వరకు బీసీ చైతన్యయాత్రలు మొదలుపెట్టబోతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం నిర్వహించిన కులగణనంతా తప్పులతడకని మండిపోయారు. కులగణన సర్వేను మళ్ళీ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో బీసీల జనాభాకన్నా ఇపుడు రేవంత్(Revanth) ప్రభుత్వం చేయించిన సర్వేలో బీసీల జనాభా 5.5 శాతం తగ్గటం ఆశ్చర్యంగా ఉందన్నారు.
కులగణన సర్వే అంతా భోగస్ కాబట్టి రీసర్వే చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంచేస్తుంటే ఊరుకునేదిలేదని వార్నింగ్ కూడా ఇచ్చారు. శనివారం పార్టీతరపున సీనియర్ నేతల బృందం చీఫ్ సెక్రటరీ శాంతికుమారిని కలిసి కులగణన రీసర్వేకి విజ్ఞప్తిచేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. రేవంత్ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే బీసీల జనాభాను తగ్గించినట్లు ఆరోపించారు. 2023 ఎన్నికల ముందు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా స్ధానికసంస్ధల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే అని గట్టిగా డిమాండ్ చేశారు. తప్పులతడక కులగణన రిపోర్టును వెంటనే రద్దుచేసి శాస్త్రీయంగా మళ్ళీ సర్వేచేయాలని డిమాండ్ చేశారు. బీసీల జనాభా తగ్గిపోతే విద్యా, సంక్షేమ పథకాల్లో వాళ్ళ వాటా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
కేటీఆర్ డిమాండ్లు, పార్టీ సమావేశాన్ని పక్కనపెట్టేస్తే రాబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో పార్టీగెలుపుకు బీసీఅస్త్రాన్ని ఉపయోగించాలని నిర్ణయించినట్లు అర్ధమవుతోంది. తెలంగాణ మొత్తం జనాభాలో సగం బీసీలే ఉన్నారన్న విషయం ప్రభుత్వ లెక్కల్లోనే బయటపడింది కాబట్టి ఈవర్గాలను ఆకట్టుకునేందుకు అవసరమైన పోరాటాలు చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. నిజానికి బీఆర్ఎస్ హయాంలోనే బీసీలకు అన్యాయం జరిగింది. స్ధానికసంస్ధల ఎన్నికల్లో అప్పటికి ఉన్న 34 శాతం రిజర్వేషన్ ను కేసీఆర్ తగ్గించేశారు. కోర్టు తీర్పు సాకుతో బీసీల రిజర్వేషన్ తగ్గించిన కేసీఆర్ పార్టీపరంగా బీసీలకు పెద్దపీట వేయటానికి మాత్రం ఇష్టపడలేదు. ఇపుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించటం సాధ్యంకాదని అర్ధమైంది కాబట్టి పార్టీపరంగా టికెట్లు కేటాయించబోతున్నట్లు రేవంత్ ప్రకటించారు. ఏదేమైనా రాబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో బీసీల అంశమే ప్రధాన అస్త్రంగా మారే అవకాశాలు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.