సుప్రిం వ్యాఖ్యలతో సినిమా వాళ్లకు బుద్దొస్తుందా ?
x
Supreme court of India

సుప్రిం వ్యాఖ్యలతో సినిమా వాళ్లకు బుద్దొస్తుందా ?

టికెట్ ధర రు. 200 కన్నా మించకూడదన్న కర్నాటక హైకోర్టు ఆదేశాలతో ఏకీభవిస్తున్నట్లు సుప్రింకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రకటించింది.


సినిమా టికెట్ల రేట్లపెంపు విషయంలో సుప్రింకోర్టు తాజా వ్యాఖ్యలతో అయినా టాలీవుడ్ జనాలకు బుద్ధి వస్తుందా ? అగ్రహీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటే చాలు తమిష్టం వచ్చినట్లుగా టికెట్ల రేట్లు పెంచేసుకుంటున్నారు. టికెట్ల రేట్ల పెంపుకు ప్రభుత్వాలు కూడా యథాశక్తి మద్దతుగా నిలుస్తున్నాయి. ఈజాడ్యం రెండుతెలుగురాష్ట్రాల్లో చాలా ఎక్కువగా కనబడుతోంది. ఈమధ్యనే రిలీజైన ఒక హీరో సినిమా మొదటిరోజు టికెట్ ధర రు. 2 వేలు దాటింది. హీరోలకు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్లు ఇచ్చుకుంటున్న నిర్మాతాలు వాటిని రాబట్టుకోవటానికి సినిమా థియేటర్లలో టికెట్ల రేట్లను వాళ్ళిష్టం వచ్చినట్లుగా పెంచేసుకుంటున్నారు.

నిర్మాతలు టికెట్ల రేట్లను పెంచుకోవటానికి అనుమతి అడగటమే ఆలస్యం ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాయి. దీన్ని సాకుగా తీసుకుని మల్టీప్లెక్స్ ల్లో స్నాక్స్, వాటర్ బాటిళ్ళు, కూల్ డ్రింకులు, ఐస్ క్రీముల ధరలు చుక్కలను తాకేట్లుగా పెంచేస్తున్నారు. నలుగురు సభ్యులున్న మధ్యతరగతి కుటుంబం మల్టీప్లెక్సులో మామూలు రోజుల్లో సినిమా చూడాలన్నా తక్కువలో తక్కువ 2 వేలరూపాయలు ఖర్చు చేయాల్సిందే. విచిత్రం ఏమిటంటే మంచినీళ్ళ బాటిళ్ళను కూడా కొన్ని మల్టీప్లెక్సుల్లో బయటనుండి తెచ్చుకోవటానికి అనుమతించటంలేదు. వాళ్ళదగ్గరే మంచినీటి బాటిల్ కొనాలంటే 100 రూపాయలు సమర్పించుకోవాల్సిందే. ఇక స్నాక్స్, ఐస్ క్రీమ్ లాంటి వాటి ధరలను అందుకోలేక విండో షాపింగ్ చేస్తున్నారు చాలామంది.

ఇదే విషయాన్ని సుప్రింకోర్టు తన వ్యాఖ్యల్లో ఎత్తిచూపింది. టికెట్ల రేట్ల పెంపు విషయంలో కర్నాటక హైకోర్టు తీర్పుపై సుప్రింకోర్టు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరిగింది. కేసు కర్నాటక సినీ పరిశ్రమకు సంబంధించిందే అయినా సూప్రింకోర్టు వ్యక్తంచేసిన ఆందోళన, చేసిన హెచ్చరికలు తెలుగు రాష్ట్రాలకు, తెలుగు సినిమాపరిశ్రమకు కూడా వర్తిస్తుంది. మల్టీప్లెక్సుల్లో వాటర్ బాటిల్ కూడా వందరూపాయలకు అమ్ముతున్నారంటు ఆందోళన వ్యక్తంచేసింది. టికెట్లరేట్లు ఇష్టంవచ్చినట్లు పెంచుకోవటంపై తీవ్రఆగ్రహాన్ని వ్యక్తంచేసింది. ఇలాగైతే సినీపరిశ్రమకు ప్రమాదం తప్పదని హెచ్చరించింది. ధరలను ఇలాగే పెంచుకుంటు పోతే జనాలు థియేటర్లకు రావటం మానేస్తారని వార్నింగ్ ఇచ్చింది. సినిమాహాళ్ళు తొందరలోనే ఖాళీగా మిగిలిపోతాయని చెప్పింది. సమస్య పరిష్కారంపై వెంటనే దృష్టి పెట్టకపోతే తొందరలోనే సినీ పరిశ్రమ అంతరించిపోతుందని అన్నది. టికెట్ ధర రు. 200 కన్నా మించకూడదన్న కర్నాటక హైకోర్టు ఆదేశాలతో ఏకీభవిస్తున్నట్లు సుప్రింకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రకటించింది. అదే ఆదేశాలను తెలుగురాష్ట్రాల్లో కూడా వర్తింపచేస్తే ఎంత బాగుంటుందో .

Read More
Next Story