
ఫ్యూచర్ సిటీలో తెలుగు సినీపరిశ్రమకు భూములు ?
ప్రపంచస్దాయి సినిమా స్టూడియోలకు కూడా చోటు కల్పించబోతోంది
ప్రస్తుతం తెలుగుపరిశ్రమ హైదరాబాదులోనే ఉంది. ప్రముఖ స్టూడియోలన్నీ నగరంలోని జూబ్లీహిల్స్, నానక్ రామ్ గూడ, అమీరపేటకు దగ్గర్లోని ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఎందుకంటే వీటికి ప్రభుత్వం 1970, 80ల్లో అవసరమైన భూములను కేటాయించింది. అయితే తాజాగా ముఖ్యమంత్రి(Revanth) ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్తప్రపంచాన్ని ఆవిష్కరించాలనే ప్రయత్నాలను మొదలుపెట్టింది.
ఇందుకోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ(Future City) అనే నాలుగో సిటీని అత్యాధునిక సౌకర్యాలు, పక్కా మాస్టర్ ప్లాన్ తో నిర్మించాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ పేరుతో ఉన్న మూడునగరాలకు అదనంగా ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయబోతోంది.
శ్రీశైలం-నాగార్జున సాగర్ నేషనల్ హైవే మధ్యలో మహేశ్వరం, ఇబ్రహింపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లోని 7మండలాల్లోని 56గ్రామాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మించాలని డిసైడ్ అయ్యింది. ఇందుకోసం ఏకంగా 30వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఇందులో ప్రపంచస్దాయి సినిమా స్టూడియోలకు కూడా చోటు కల్పించబోతోంది. ఐటీ, సాఫ్ట్ వేర్, గ్లోబల్ కేపబులిటి సెంటర్లు, ఫార్మా, క్వాంటంసిటీ, స్టార్టప్ కంపెనీలు, స్కిల్ యూనివర్సిటీలు, స్కిల్ సెంటర్లు లాంటి అనేక రంగాల్లోని పరిశ్రమలకు అవసరమైన భూములను కేటాయించబోతోంది. ఇందులో భాగంగా ప్రపంచస్ధాయి సినిమా స్టూడియోల నిర్మాణాలు కూడా ఉండాలని రేవంత్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ స్టూడియో నిర్మించటానికి ఇప్పటికే రేవంత్ తో చర్చలు కూడా జరిపారు.
ఈనేపధ్యంలోనే సినీప్రముఖుడు అక్కినేని నాగార్జున తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సిమ్మిట్-2047 రెండురోజుల సదస్సుకు సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతు ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సంబంధించి రేవంత్ ప్రభుత్వం విజన్ బాగుందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో సినిమా పరిశ్రమకు కూడా భాగస్వామ్యం ఉందన్నారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో తెలుగు సినీ పరిశ్రమ కీలక పాత్ర తీసుకుంటుందని హామీఇచ్చారు. నాగార్జున మాటలు విన్నతర్వాత ఫ్యూచర్ సిటీలో స్టూడియోల నిర్మాణాలకు ప్రభుత్వం భూములను కేటాయించటానికి హామీ ఇచ్చినట్లుగానే అనిపిస్తోంది.
నగరంలో ఇప్పటికే సారధి స్టూడియో, పద్మాలయ, రామానాయుడు, రామకృష్ణ, అల్లు, రామోజీ స్టూడియోలున్న విషయం తెలిసిందే. ఈస్టూడియోల్లో సినిమా షూటింగులు రెగ్యులర్ గా జరుగుతున్నాయి. స్టూడియోలను విస్తరించాలంటే అవకాశాలు లేవు. ఎందుకంటే స్టూడియోలకు ఇవ్వటానికి ప్రభుత్వం దగ్గర సరిపడా భూములు లేవు. అందుకనే స్టూడియోలను విస్తరించాలన్నా అవకాశాలు లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకునే సినీ ప్రముఖులు రేవంత్ తో మాట్లాడుకుని ఫ్యూచర్ సిటీలో స్టూడియోల నిర్మాణాలకు స్ధలాలు ఇచ్చేట్లుగా తగినహామీలు తీసుకున్నారనే అనుకోవాలి.
ఎలాగూ ఫ్యూచర్ సిటీలో స్టూడియోల నిర్మాణాలకు భూములు ఇవ్వాలని డిసైడ్ అయ్యారుకాబట్టి పైన చెప్పిన స్టూడియోల యజమానులైన సినీ ప్రముఖులకు ఫ్యూచర్ సిటీలో మళ్ళీ అవసరమైన భూములను కేటాయించే అవకాశాలున్నాయి. ఏ సినీప్రముఖుడికి రేవంత్ ప్రభుత్వం ఎంతెంత భూమి కేటాయిస్తుందో చూడాల్సిందే.

