![సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో తెలుగు పార్టీలు బుద్ధి తెచ్చుకుంటాయా ? సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో తెలుగు పార్టీలు బుద్ధి తెచ్చుకుంటాయా ?](https://telangana.thefederal.com/h-upload/2024/10/04/480324-supreme-court-photo.webp)
సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో తెలుగు పార్టీలు బుద్ధి తెచ్చుకుంటాయా ?
ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలు ఇస్తున్న ఉచిత హామీలపై తన అసంతృప్తిని వ్యక్తంచేసింది
ఉచితాలపై సుప్రింకోర్టు తీవ్రస్ధాయిలో మండిపడింది. ఎన్నికలసమయంలో రాజకీయపార్టీలు ఇస్తున్న ఉచిత హామీలపై తన అసంతృప్తిని వ్యక్తంచేసింది. ఎన్నికల్లో ఉచిత హామీలు ఇవ్వటాన్ని తప్పుపట్టింది. ఉచితహామీల వల్ల పార్టీలు జనాలను పరాన్నజీవులుగ మార్చేస్తున్నాయని ఆక్షేపించింది. ఎన్నికల్లో గెలవటానికి దాదాపు అన్నీ పార్టీలు ఆకాశమేహద్దుగా ఉచితహామీలతో రెచ్చిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈమధ్యనే జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly elections) గెలుపుకు బీజేపీ(BJP), ఆప్(AAP), కాంగ్రెస్(Congress) పార్టీలు నోటికొచ్చిన ఉచితహామీలను గుప్పించాయి. పట్టణాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన ఒక పిటీషన్ విచారణ సందర్భంగా బుధవారం సుప్రింకోర్టు ఉచితహామీలపై పై విధంగా స్పందించింది.
పార్టీలు ఇస్తున్న ఉచితహామీల వల్ల జనాలకు డబ్బు, రేషన్ ఉచితంగానే చేతికి అందుతున్నట్లు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్తీన్ జార్జ్ మసీహ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. ఏపనీచేయకుండానే జనాలకు డబ్బు, రేషన్ చేతికి అందుతున్నపుడు ఇక కష్టపడి పనిచేయాలని ఎందుకు అనుకుంటారని తీవ్రంగా ప్రశ్నించింది. ఉచితంగా రేషన్, డబ్బులు అందుకుంటున్న వ్యక్తులను సమాజపురోగతిలో భాగంచేయకుండా పరాన్నజీవుల తరగతిని రాజకీయపార్టీలు సృష్టిస్తున్నాయని చెప్పింది. రాజకీయపార్టీల ఉచిత హామీల కారణంగా జనాల్లో కష్టించి పనిచేయాలనే తత్వం తగ్గిపోతోందని ధర్మాసనం ఆందోళన వ్యక్తంచేసింది.
ఉచితహామీలను దేశంలోని చాలారాష్ట్రాల్లో చాలాపార్టీలు ఇస్తునే ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాలు, పార్టీలను పక్కనపెట్టినా తెలుగురాష్ట్రాల్లో మాత్రం ఉచితహామీలు ఎక్కువైపోతున్నాయి. అధికారంలోకి రావటమే ఏకైక లక్ష్యంగా పార్టీల అధినేతలు నోటికొచ్చిన హామీలను ఇచ్చేస్తున్నారు. ఉచితహామీల అమలుకు అవసరమైన బడ్జెట్, విదివిధానా గురించి ఏమాత్రం ఆలోచించటంలేదు. బడ్జెట్, నిబంధనలగురించి ఎన్నికలసమయంలో అడిగితే సమాధానాలు చెప్పటంలేదు. తమ హామీలను ఎలా అమలుచేయాలో తమకు తెలుసని, అందుకు అవసరమైన నిధుల సమీకరణపై తమకు స్పష్టమైన అవగాహన ఉందని మాత్రమే పార్టీలు చెబుతున్నాయి. మొత్తం వివరాలను చెప్పేస్తే ఇతరపార్టీలు కాపీ కొడతాయని చెప్పి తప్పించుకుంటున్నాయి.
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth) అనేక హామీలిచ్చాడు. అందులో మహిళలకు తులంబంగారం, 200 యూనిట్లవరకు ఉచితవిద్యుత్, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు నెలకు రు. 2500 పెన్షన్, రైతురుణమాఫీ, మహిళలకు ఉచితబస్సు ప్రయాణం లాంటి హామీలు చాలానే ఉన్నాయి. ఇచ్చిన హామీలు ఇచ్చినట్లు నూరుశాతం అమలుచేయాలంటే రాష్ట్ర బడ్జెట్ కాదు దేశబడ్జెట్ కావాల్సిందే. అదృష్టంకొద్ది రేవంత్ హామీలను నమ్మిన జనాలు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినహామీలను అమలుచేయటానికి రేవంత్ కిందామీదా అవుతున్నాడు. ఉచితహామీల వర్షాన్ని కురిపించటంలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్(BRS), బీజేపీలు కూడా ఏమీ తక్కువ తినలేదు. కాకపోతే జనాలు కాంగ్రెస్ ను నమ్మారు కాబట్టి ఓట్లేసి గెలిపించారు.
ఇక 2024 ఏపీలో జరిగిన ఎన్నికలు కూడా ఇదే వరస. అధికారంలోకి రాకపోతే తెలుగుదేశంపార్టీ(TDP)కి భవిష్యత్తు ఉండదన్న ఆందోళనతో చంద్రబాబునాయుడు(Chandrababunaidu) నోటికొచ్చిన హామీలు ఇచ్చేశారు. ఓటర్లే నమ్మలేనంత స్ధాయిలో చంద్రబాబు ఉచితహామీలను గుప్పించారు. మహిళలకు ఉచిత బస్సుప్రయాణం, ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికీ తలా రు. 15 వేలు, రైతులకు ఏటా రు. 20 వేలు, నెలకు రు. 4 వేల పెన్షన్, ఉచిత రేషన్ సరుకులు కీలకమైన హామీలు. జనాలు ఓట్లేయటంతో చంద్రబాబుతో కలిసిపోటీచేసిన జనసేన+బీజేపీలు కూడా అధికారంలోకి వచ్చేశాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలుచేయాలంటే చంద్రబాబుకు చుక్కలు కనబడుతున్నాయి.
హామీల అమల్లో కొన్నింటిని వచ్చేఏడాదికి వాయిదావేశారు. మరికొన్ని పథకాల్లో లబ్దిదారులను తగ్గించేస్తున్నారు. ఎన్నికల్లో సమయంలో ఏపీ అప్పు రు. 14 లక్షల కోట్లని పదేపదే చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితహామీలన్నింటినీ అమలుచేస్తామని ఊరూరా తిరిగి ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాల అమలుపై ప్లేటు ఫిరాయించేశారు. పథకాల అమలుకు డబ్బులు లేవంటున్నారు. ముందు సంపద సృష్టించిన తర్వాతే పథకాల అమలని ఇపుడు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరుమాసాల తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టినపుడు ఏపీ అప్పు రు. 6.5 లక్షల కోట్లుగా చెప్పారు. ఎన్నికల సమయంలో ఏపీ అప్పు రు, 14 లక్షల కోట్లని జగన్ పై మండిపోయిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉచితాలన్నింటినీ అమలుచేస్తామన్నారు. 14 లక్షల కోట్ల రూపాయల అప్పున్నపుడే ఉచిత హామీలను అమలుచేస్తానని చెప్పిన చంద్రబాబు మరి అప్పు రు. 6.5 లక్షల కోట్లే అని తేలిన తర్వాత ఉచితహామీలను అమలుచేయకుండా ఎందుకు వాయిదా వేస్తున్నట్లు ?
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) నవరత్నాలను అమలుచేస్తానని హామీఇచ్చారు. ఉచితహామీలను అమలుచేయాలంటే లక్షల కోట్లరూపాయలు కావాలి. పార్టీలు ఇస్తున్న ఉచితహామీల వల్లే రాష్ట్రాల ఖజానా గుల్లయిపోతోందని ఆర్ధిక నిపుణులు మొత్తుకుంటున్నారు. ఉచితహామీలు వద్దని వివిధ రంగాల్లోని నిపుణులు పార్టీలను మొత్తుకుంటున్నా ఏ పార్టీ కూడా పట్టించుకోవటంలేదు. నిజానికి ఉచితహామీలపై సుప్రింకోర్టు(Supreme court) అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తంచేయటం ఇదే మొదటిసారి కాదు. పోయిన ఏడాది డిసెంబర్లో కూడా ఉచితహామీలపై దాఖలైన పిటీషన్ విచారణ సందర్భంగా ఇలాగే మాట్లాడింది. అయితే ఉచిత హామీలు ఇవ్వకుండా పార్టీలను తాము నియంత్రించలేమని చెప్పింది. నియంత్రించే బాధ్యతను సుప్రింకోర్టు కేంద్ర ఎన్నికల కమీషన్ కు అప్పగించింది. కమీషన్ కూడా రాజకీయపార్టీలతో ఉచితహామీల నియంత్రణపై సమావేశం నిర్వహించింది. అయితే పార్టీలు సానుకూలంగా స్పందించని కారణంగా కమీషన్ కూడా ఏమీచేయలేకపోయింది. ఇంతకాలానికి మళ్ళీ సుప్రింకోర్టు ఉచితహామీలపై చాలా ఘాటుగా స్పందించింది. రాజకీయపార్టీలు ఉచితహామీలు ఇవ్వకుండా ఉండాలంటే సుప్రింకోర్టే నడుంబిగించాల్సుంటుంది. లేకపోతే రాజకీయ పార్టీలు ఉచితహామీలను ఇస్తూనే ఉంటాయి, రాష్ట్రాల ఖజానాను గుల్లచేస్తునే ఉంటాయి.