కూలి కోసం పార్లమెంటు ముందు ప్రాణాలు తీసుకుంటారా?
‘వనపర్తి - బీజినపల్లి రోడ్డు నిర్మాణం చేసిన 40 మంది కార్మికులకు రావలసిన 42 లక్షల రూపాయలను చెల్లించేలా కాంట్రాక్టర్ బిల్లులను ఆపేయండి..
స్థలం.. హైదరాబాద్, జాతీయ మానవ హక్కుల సంఘం కార్యాలయం
విషయం... కూలిడబ్బు కోసం పార్లమెంటు ఎదుట మూకుమ్మడి ఆత్మహత్యల గురించి
వివాదం.. వనపర్తి టు బిజినపల్లికి స్టేట్ హై వే నిర్మించిన కూలీల వేతనం చెల్లింపుల గురించి
ఎవరికి అభ్యర్థన... దేశ ప్రధానికి, కేంద్ర కార్మిక శాఖామంత్రికి, కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్, కేంద్ర ఎస్సీ కమిషన్ కు, కేంద్ర హోం ఆఫ్ఫైర్స్ కు, పార్లమెంట్ స్పీకర్ కు, నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రంట్ వర్కర్స్ యూనియన్ కు, జాతీయ మానవ హక్కుల సంఘానికి
ఎవరు స్పందించారు... యూనియన్ సభ్యులు స్పందించారు. చచ్చి సాధించేదేమీ లేదు, పోరాటం చేద్దాం పదమంటూ తమతో పాటు యూనియన్ ఆఫీసుకు తీసుకువెళ్లారు.
ఆ తర్వాత ఏమైందంటే...
2024 ఏప్రిల్ 13... అంతమందికి మొరపెట్టుకున్నా ఒక్క అధికారీ స్పందించలేదు. వాళ్ల కూలిడబ్బులు ఇప్పించలేదు.
ఇప్పుడేమిటి పరిస్థితి...
మదనాపూర్ భాను ప్రకాష్ లాంటి కాంట్రాక్టరును బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్. ఎన్.హెచ్.ఆర్.సీ లో కేసు నమోదు.
అసలేం జరిగిందంటే...
2021లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వనపర్తి నుంచి బిజినపల్లికి స్టేట్ హై వే రోడ్డు నిర్మాణం చేపట్టింది. మధ్యప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన 40 మంది వలస కార్మికులు స్టేట్ హై వే రోడ్డు పనులు చేశారు. రోడ్డు నిర్మాణం పూర్తయింది. అయినా ఇప్పటివరకు కూలీ డబ్బులు చెల్లించక పోగా కాంట్రాక్టర్ భయపెట్టిస్తున్నారు అని ఆరోపించారు నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రంట్ వర్కర్స్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ సలీం. “మాలో ఇప్పటికీ ముగ్గురికి సరి అయిన వైద్యం అందక చనిపోయారు. మేము కూడా రేపో మాపో చనిపోయే వారిమే. భార్య పిల్లలు అప్పుల్లో కూరుకుపో కుండ ఉందేటందుకు, మా చావుతోనైనా వలస కార్మికుల బ్రతుకులు బాగుపడతాయి అని ఆలోచించుకొని మూకుమ్మడి ఆత్మహత్య పార్లమెంట్ భవనం ముందు చేసుకోవాలని అనుకున్నాం” కార్మికులు వివరించారు. ఈ విషయం తెలిసిన వలస కార్మికుల సంఘం నేతలు హుటాహుటిన పార్లమెంటు వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంటామన్న కార్మికులను వారించి ఎన్.హెచ్.ఆర్.సి. వద్దకు తీసుకువెళ్లారు యూనియన్ సెక్రటరీ మహమ్మద్ అబ్దుల్ సలీం. బాలరాజు, గట్టన్న అనే కార్మికులను ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల సంఘం- ఎన్.హెచ్.ఆర్.సి.- ముందు హాజరు పరిచారు. పెంటయ్య, నరసింహాలను జాయింట్ కమిషనర్ ఫర్ లేబర్, రంగారెడ్డి జోన్, హైదరాబాద్ లో యూనియన్ ఉపాధ్యక్షులు భార్గవ్ హాజరు పరిచారు.
NHRC రిజిస్ట్రార్ వెంటనే స్పందించి 40 మంది కార్మికులకు న్యాయం జరిగే విధంగా చర్యల కోసం ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. కార్మికులకు కౌన్సిలింగ్ ఇచ్చి పార్లమెంట్ భవనం ముందు మూకుమ్మడి ఆత్మహత్యలు వంటి చర్యలకు పాల్పడవద్దని చెప్పింది. దీనిపై స్పందించిన కార్మికులు... NHRC పై నమ్మకం ఉందని, ఏమి ఆత్మహత్యలకు పాల్పడబోమని హామీ ఇచ్చి వెనుదిరిగారు.
యూనియన్ డిమాండ్ ఇది..
ఇది జరిగి నెలదాటినా ఇంతవరకు కార్మికులకు ఎటువంటి చెల్లింపులు జరగలేదు. ఇప్పటికైనా వలస కార్మికులకు తగిన సమయం లో కూలీ డబ్బులు అందేలా లేబర్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రంట్ వర్కర్స్ డిమాండ్ చేసింది. కూలీ డబ్బులు చెల్లించక పోగా కార్మికులను వేధించే మదనాపూర్ భాను ప్రకాష్ లాంటి కాంట్రాక్టర్ లను బ్లాక్ లిస్టులో పెట్టాలని కోరింది. ‘వనపర్తి - బీజినపల్లి రోడ్డు నిర్మాణం చేసిన 40 మంది కార్మికులకు రావలసిన 42 లక్షల రూపాయలను చెల్లించేలా కాంట్రాక్టర్ బిల్లులను ఆపేసి వాటిని కూలీలకు చెల్లించాలని ఆర్ అండ్ బి ఇంజనీర్ ఇన్ చీఫ్ చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో కార్మికులకు న్యాయం కోసం యూనియన్ పోరాటం ఉధృతం చేస్తాం’ అన్నారు నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ సలీం. తెలంగాణ ఏర్పాటు అయినా వలస కార్మికుల సమస్యలు తీరకపోవండ విచారకరమని సలీం అభిప్రాయపడ్డారు.