
తొలుత హత్య తర్వాత తానూ ఆత్మహత్య
కూకట్ పల్లిలో దారుణం
కూకట్‌పల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధతాళలేక భార్యభర్తలు చావే శరణ్యం అనుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో తాళికట్టిన భర్తను తొలుత హత్య చేసి తర్వాత తానూ ఆత్మహత్యకు యత్నించింది ఓ భార్య. అంటే ఒకే ఇంట్లో ఒక హత్య మరో ఆత్మహత్యాయత్నం జరిగిందన్నమాట. హత్య చేసింది.. ఆత్మహత్యకు ప్రయత్నించింది ఒకరే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామకృష్ణ, రమ్యకృష్ణ దంపతులు కలిసే అప్పులు చేశారు. చేసిన అప్పులకు ఇద్దరు సమంగా పంచుకోవాలనుకున్నారు. అప్పుల బాధ భరించలేక భార్యభర్తలు తొలుత ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. కానీ ఏమైందో ఏమో కానీ.. భార్య తన భర్త గొంతు కోసి ఆ తర్వాత భర్త శవం పక్కనే తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. శనివారం కూకట్ పల్లిలో జరిగిన ఈ ఘటన తెలంగాణలో సంచలనమైంది. కొన ఊపిరితో ఉన్న భార్యను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రమ్యకృష్ణ పరిస్థితి విషమంగా ఉంది. కాగా వీరి ఆత్మహత్య నిర్ణయానికి మరేమైనా కారణాలు ఉన్నాయా? అని అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.