
నిర్మల్ జిల్లాలో మహిళ దారుణ హత్య
అనుమానంతో సహజీవనం చేస్తున్నవ్యక్తే దారుణానికి ఒడిగొట్టాడు
నిర్మల్ జిల్లా భైంసాలో 30 ఏళ్ల అశ్విని అనే మహిళ దారుణ హత్యకు గురైంది. పట్టణంలోని సంతోషిమాత ఆలయ సమీపంలో ఉన్న ఓ టీ పాయింట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుంసర గ్రామానికి చెందిన మహిళకు ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, భర్తతో విడాకులు తీసుకొని కుటుంబానికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో భైంసాలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన నగేశ్‌తో ఆమెకు పరిచయం వారిద్దరి సహజీవనానికి దారితీసింది. ఉపాధి కోసం ఆ మహిళ టీ పాయింట్ జీవనాధారంగా చేసుకుంది.
సోమవారం టీ పాయింట్ వద్ద కేకలు వినిపించడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఆమెతో సహ జీవనం చేస్తున్ననగేశ్ ఈ హత్యకు పాల్పడ్డాడు. రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న మహిళ పక్కనే నిందితుడు కూర్చొని ఉన్నాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నగేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తనతో సహజీవనం చేస్తూనే మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగానే హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. కొన్ని వారాలుగా అశ్విని మరో వ్యక్తితో ఫోన్ లో మాట్లాడటం, చాటింగ్ చేయడాన్ని తాను గమనించినట్టు నగేశ్ పోలీసులకు తెలిపాడు. మరో వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగించడాన్ని తాను వారించినట్లు, అయినా అశ్విని పద్దతి మార్చుకోకపోవడం వల్లే హత్య చేసినట్టు నగేశ్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.

