అవినీతిలో అతివలు సైతం..ఆరు నెలల్లో ఏసీబీ వలలో 20 మంది
x
ఏసీబీ వలలో చిక్కిన మహిళా ఉద్యోగినులు

అవినీతిలో అతివలు సైతం..ఆరు నెలల్లో ఏసీబీ వలలో 20 మంది

తెలంగాణలో అవినీతి, అక్రమాలకు మహిళా ఉద్యోగినులు సైతం పాల్పడుతున్నారు. గత ఆరు నెలల్లోనే తెలంగాణ ఏసీబీ వలలో 20 మంది మహిళా ఉద్యోగినులు చిక్కారు.


తెలంగాణ రాష్ట్రంలో అవినీతి, అక్రమాల్లో మహిళా ఉద్యోగినులు, అధికారిణులు సైతం పాలుపంచుకుంటున్నారు. 2025వ సంవత్సరంలో గత ఆరున్నర నెలల్లో 20 మంది మహిళా ఉద్యోగినులు, అధికారిణులు ఏసీబీ వలలో(Women officers Trapped Telangana ACB) చిక్కారు. అవినీతిలో పురుష ఉద్యోగులే కాదు తాము సైతం అంటూ పలువురు మహిళా ఉద్యోగులు లంచాలు తీసుకుంటున్నారని ఏసీబీ దాడుల్లోనే తేటతెల్లమైంది.



అంత్యక్రియల ఖర్చుల్లోనూ లంచం

తన భర్త మరణించాడని, అతని అంత్యక్రియల ఖర్చుల దస్తావేజును ప్రాసెస్ చేసి ఇప్పించాలని ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్య మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని సహాయ కార్మిక కార్యాలయంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పాకా సుకన్యను కలిశారు. తన భర్త అంత్యక్రియల ఖర్చుల్లోనూ లేబర్ ఆఫీసర్ సుకన్య తన ప్రైవేటు సహాయకురాలు మోకినేపల్లి రాజేశ్వరి ద్వారా లంచం డిమాండ్ చేశారు. జులై 18వతేదీన రూ.30వేల లంచం డబ్బు తీసుకు వెళ్లి సుకన్యకు అందిస్తుండగా ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి అవినీతి అధికారిణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.(Caught by ACB) లంచం సొమ్ము తీసుకున్నట్లుగా నోట్లను ద్రవంలో ముంచితే గులాబీ రంగు వచ్చింది. అంటే అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పాకా సుకన్య అంత్యక్రియల డబ్బు మంజూరులోనూ లంచం తీసుకున్నారని తేలడంతో ఆమెను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.



పాసుపుస్తకం జారీకి రూ.2లక్షల లంచం

సిద్దిపేట జిల్లా ములుగు మండల డిప్యూటీ తహసీల్దార్ యెలగందుల భవానీ పట్టాదార్ పాస్ పుస్తకం జారీ కోసం పెట్టుకున్న దరఖాస్తును ప్రాసెస్ చేసేందుకు రూ.2లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఆమెపై కేసు నమోదు చేశారు.



జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం...

హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ ప్రాంత డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్ ఎం సుధ జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసి నంబరు కేటాయించేందుకు రూ.8వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం సొమ్మును తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.



ఆస్తి మ్యుటేషన్ కోసం...

హైదరాబాద్ జీహెచ్ఎంసీ మూసాపేట సర్కిల్ -23 ఆస్తిపన్ను విభాగంలోని సీనియర్ అసిస్టెంట్ ఎం సునీత ఓ ఆస్తిని మ్యుటేషన్ ప్రక్రియ చేసేందుకు రూ.30వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ సునీతను పట్టుకుంది.

హడలెత్తిస్తున్న ఏసీబీ
ఏసీబీ ప్రభుత్వ కార్యాలయాల్లో సాగుతున్న అవినీతి, అక్రమాల తంతుపై డేగకళ్లతో నిఘా వేసింది. ఫిర్యాదులపై సత్వరం స్పందిస్తున్న ఏసీబీ దాడులు చేసి అక్రమాలకు పాల్పడిన అవినీతి అధికారుల ఆట కట్టిస్తుంది. ఒక్క జూన్ నెలలోనే 31 మంది అవినీతి అధికారులపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఇటీవల మహిళా ఉద్యోగినులు, అధికారిణులు కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని తమకు ఫిర్యాదులు వస్తున్నాయని హైదరాబాద్ కుచెందిన ఏసీబీ అధికారి ఒకరు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.


Read More
Next Story