
వరకట్నవేధింపులకు గర్బిణి ఆత్మహత్య
దుర్గం చెరువులో దొరికిన సుష్మ డెడ్ బాడీ
వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం చట్ట రీత్యా నేరం. అయినా ఈ ఆచారం పూర్వ కాలం నుంచి కొనసాగుతూనే ఉంది. అమ్మాయిని బాగా చూసుకోవాలన్న ఉద్దేశ్యంతో అమ్మాయి తరపు వారు అబ్బాయి తరపు వారికి పెళ్లికి ముందు ఇచ్చేదే వరకట్నం. పెళ్లయిన తర్వాత కూడా వరకట్నం అడిగితే వరకట్న వేధింపుల క్రిందకు వస్తుంది. వరకట్న వేధింపులను నిరోధించడానికి అనేక చట్టాలు వచ్చినప్పటికీ వరకట్న ఆత్మహత్యలు ఆగడం లేదు.
హైద్రాబాద్ ఈస్ట్ మారెడ్ పల్లికి చెందిన సుష్మ(27) ను నేరెడ్మెట్ కు చెందిన అమృత్(30) తో ఈ యేడు జనవరి 31న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఐదు లక్షల నగదు, ఆరు తులాల బంగారం అమ్మాయి తరపు వాళ్లు అబ్బాయి తరపు వారికి ముట్ట జెప్పారు. అయినా సంతృప్తి పడని అబ్బాయి కుటుంబ సభ్యులు అమ్మాయిని వేధించడం ప్రారంభించారు.
మూడు నెలల గర్బవతి అయిన సుష్మ అనారోగ్యానికి గురి కావడంతో తల్లిగారింటికి వచ్చింది. హై టెక్ సిటీలో సుష్మసాప్ట్ వేర్ ఇంజినీర్ . బుధవారం తల్లిగారింటి నుంచే ఉద్యోగానికి వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో సుష్మ తల్లిదండ్రులు తను పని చేస్తున్న కార్యాలయానికి ఫోన్ చేశారు. రాత్రి ఎనిమిదిన్నరకు కార్యాలయం నుంచి సుష్మ వెళ్లిపోయినట్లు చెప్పారు. వెంటనే సుష్మ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారమిచ్చారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సుష్మ డెడ్ బాడీ గురువారం దుర్గం చెరువులో దొరికింది. మానసిక వత్తిడికి గురైన సుష్మ దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.