రోడ్లపై వరినాట్లు వేసిన మహిళలు.. ప్రభుత్వంపై నిరసనే..!
x

రోడ్లపై వరినాట్లు వేసిన మహిళలు.. ప్రభుత్వంపై నిరసనే..!

రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పలు ప్రాంతాల్లో వర్షాల తాకిడికి రోడ్లు కూడా కొట్టికుపోయాయి.


రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పలు ప్రాంతాల్లో వర్షాల తాకిడికి రోడ్లు కూడా కొట్టికుపోయాయి. వీటి కారణంగా ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రావడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బౌరంపేటలో కొందరు మహిళలు రోడ్డుపైకి వచ్చి రోడ్ల దుస్థితిపై నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా రోడ్లపై నిలిచిన వర్షపు నీటిలో వరి నాట్లు కూడా నాటారు. దుండిగల్ మున్సిపాలిటీ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ప్రజలకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయని, ప్రజల సమస్యలపై మున్సిపల్ కమిషనర్‌కు కనీస అవగాహన కూడా లేదంటూ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేటలోని రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని, వీటిపై ప్రయాణించాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి అని గ్రామస్తులు చెప్తున్నారు. గుంతల మయమైన రోడ్ల గురించి అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకేనా మేము మీకు ఓట్లు వేసి గెలిపించుకుంది అని బౌరంపేట ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగానే రోడ్లపై ఏర్పడిన గుంతల్లో వరినాట్లు నాటి మున్సిపల్ కమిషనర్, పాలకుల పనితీరుపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ ఇక్కట్లపై అధికారులు, పాలకులు దృష్టి పెట్టాలని, వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

నెలనెల పన్నులు కట్టి మీకు వేతనాలు అందిస్తున్నది మేము ఇలా ఇబ్బందులు పడుతున్నా ఏమీ పట్టనట్లు వదిలేయడానికా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంతల మయమైన రోడ్ల వల్ల వృద్దులు, మహిళలు, పిల్లలు బయటకు రావాలంటే భయపడుతున్నారని, ఒకవేళ తప్పని పరిస్థితుల్లో బయటకు వస్తే ఎలా ప్రయాణించాలో అర్థంకాక ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఇంటి నుంచి బయటకు వచ్చి అధికారులను తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు మహిళలు. వెంటనే తమ సమస్యలను పరిస్కరించే దిశగా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Read More
Next Story