
కొత్త లేబర్ కోడ్ల పై భగ్గుమన్న కార్మిక సంఘాలు
నవంబర్ 26న నిరసన కార్యక్రమాలకు పిలుపు
కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన లేబర్ కోడ్ లు రాష్ట్రం లోని భారత పరిశ్రమల సమాఖ్య (Confederation of Indian Industry: CII) స్వాగతించింది. అయితే పౌర హక్కుల, కార్మిక సంఘాలు వాటిని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎన్నో పోరాటాల తరువాత సాధించుకున్న హక్కులను ఈ లేబర్ కోడ్ లు కాలరాస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ ఏడాది నవంబర్ 21 నుంచి అమలులోకి వచ్చిన ఈ 4 కోడ్ లను వ్యతిరేకిస్తూ నవంబర్ 26న అఖిల భారత స్థాయిలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి.
మరొక వైపు కేంద్రం మరోలా ఉంది. ఉద్యోగులందరికీ నియామక పత్రాలు, కార్మికులకు కనీస వేతనాలు, గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్లకు సంక్షేమం, ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగులకు ఏడాది సర్వీసుకే గ్రాట్యుటీ, 40 సంవత్సరాలు పైబడిన ఉద్యోగులకు ప్రతి ఏడాది వైద్య పరీక్షలు, అన్ని షిఫ్టుల్లో అన్ని రకాల పనుల్లో మహిళలకు పని కల్పించటం ఈ కోడ్‌ల వలన జరిగే ప్రయోజనాలని చెబుతోంది.
వీటికోసమే వేతనాల కోడ్ (2019), పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020), సామాజిక భద్రత కోడ్ (2020), వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పనిప్రదేశాల్లో పరిస్థితుల కోడ్ (2020)లను తక్షణమే అమల్లోకి తెచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఇప్పటికే అనేక దేశాలు తమ చట్టాలను సరళీకరించి, ఏకీకృతం చేసినా మన దేశంలో కాలం చెల్లిన చట్టాలనే కొనసాగిస్తున్నామని ఈ లేబర్ కోడ్ లను నోటిఫై చేస్తున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
ఈ కోడ్ లకు 2020లోనే కేంద్రం ఆమోదించింది. దేశం లో సామాజిక భద్రత 2015 లో 19 శాతం ఉండగా, 2025 నాటికి అది 64 శాతానికి చేరినట్లు కేంద్రం తెలియజేసింది. కొత్త లేబర్ కోడ్ లతో ఈ ప్రక్రియ మరింత ముందుకు వెళ్ళి కార్మిక అనుకూల వ్యవస్థ ఏర్పాటు అవుతుందనేది కేంద్రం చెబుతూ వస్తోంది.
కార్మిక సంఘాల వ్యతిరేకత వల్ల కేంద్రం ఈ కోడ్ లను అమలుచేయలేకపోయింది. ఈ కోడ్ లలో భాగం అయిన పని గంటల పెంపును ఇంతకుముందే ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ, కర్ణాటక ఆమోదం తెలిపాయి. కర్ణాటక పని గంటలను 14 కు పెంచే ప్రయత్నం చేసినప్పటికీ కార్మిక సంఘాల నుంచి వచ్చిన వ్యతిరేకత వల్ల దాని అమలును వాయిదా వేసింది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సెప్టెంబర్ 20 నుంచి పరిశ్రమల్లో పని గంటలను 10 కి పెంచుతూ ఉత్తర్వు (AP Factories Amendment Bill, 2025) జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం అంతకుముందే అంటే జులై 10న ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతానికి రెండు ప్రభుత్వాలు రోజుకు పది గంటలకు పని గంటలను పెంచినప్పటికీ వారంలో మొత్తం పని గంటలను 48 గంటల వరకే గరిష్టపరిమితి విధించాయి.
ఈ చర్యను ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ లో భాగమని ఈ ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఈ విషయం లో తెలుగు రాష్ట్రాలలోని ప్రతిపక్షంలో వున్న పార్టీలు బీఆర్ఎస్, వైఎస్సార్‌సీపీ ఎటువంటి వైఖరి తీసుకోలేదు.
పరిశ్రమ వర్గాల అభిప్రాయం
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (Confederation of Indian Industry) తెలంగాణ శాఖ నూతన లేబర్ కోడ్ లను తెచ్చినందుకు కేంద్రాన్ని అభినందించింది.
ఇవి సరియైన సమయం లో వచ్చాయని, ఆధునిక భారత దేశ నిర్మాణం లో తోడ్పడతాయని పేర్కొంది. దేశంలో పారిశ్రామిక సంబంధాలను ఈ కోడ్‌లు మెరుగుపరుస్తాయని, యజమానుల ఉద్యోగుల మధ్య మంచి సంబంధాలు ఏర్పాటుకు దోహదపడతాయని సీఐఐ తెలంగాణ ఛైర్మన్ ఆర్. శివప్రసాద్ రెడ్డి అన్నారు.
“29 చట్టాలను కలిపి చేసిన ఈ కోడ్ లు వేతనాల పెంపుకు, సామాజిక భద్రతను విస్తరించటానికి, పని ప్రదేశం లో కార్మికులకు భద్రత పెంచటానికి, నియమాకాలలో యజమానులు ఉద్యోగుల మధ్య స్పష్టత తీసుకొస్తాయి” అన్నారు.
చిన్న మాధ్యమిక పరిశ్రమల (Federation of Telangana Small and Medium Industries Association) అధ్యక్షులు, ఎం. రాజా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ నూతన చట్టాల వలన తమకు భారం పెరుగుతుందని అన్నారు.
ఇదివరకు ఐదు సంవత్సరాలు పని చేసిన కార్మికులకు మాత్రమే గ్రాట్యుటీ యివ్వాల్సివచ్చేది. ఇక ఒక సంవత్సరం పనిచేసిన కార్మికుడికి కూడా ఇవ్వాలి. క్యాజువల్ లేబర్ కు కూడా పీఎఫ్, ఈఎస్ఐ యివ్వాల్సి వస్తుందని అంటూ ప్రతి ఉద్యోగికి అపాయింట్మెంట్ లెటర్ యిస్తే లిటిగేషన్లు ఎక్కువ అవుతాయని అభిప్రాయపడ్డారు.
“కోడ్ లు అమలులోకి వస్తే యూనియన్లు ఎక్కువ అవుతాయి. గతంలో మహిళలు కొన్ని కంపెనీలలో పనిచేయటానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళలో 90 శాతం వలస వచ్చిన భార్యాభర్తలు పనిచేస్తున్నారు.
కేవలం పురుషలు మాత్రమే చేస్తే కార్మికుల కొరత ఉంటుంది. ఇదివరకు పర్మిషన్ లేకుండా మహిళలలను పనికి కుదుర్చుకునే వాళ్లు. ఇప్పుడిక ఇది చట్టబద్ధమయింది. వలస వచ్చిన కార్మికులు రోజుకు 10 నుంచి 12 గంటలు స్వచ్ఛందంగా పనిచేస్తారు,” అని మహేందర్ రెడ్డి అన్నారు.
అన్నీ సౌకర్యాలు కార్మికులకు ఇవ్వాలి కాబట్టి సాధారణం కంటే రెగ్యులర్ కార్మికుల సంఖ్య పెరుగుతుంది అని ఆయన అభిప్రాయపడ్డారు.
హక్కుల సంఘాల వైఖరి
ఈ చర్య కార్మికుల హక్కుల మీద జరుగుతున్న ఒక దాడిగా మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. ఈ నూతన లేబర్ కోడ్ లను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.
“పెట్టుబడులను ఆకర్షించే పేరుతో చేపడుతున్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అనేది కార్మికుల హక్కులకు విఘాతం కలిగిస్తుంది. ఇది కార్మికుల విశ్రాంతి హక్కును తొలగించి పనివేళలు పెంచడాన్ని సమర్థిస్తుంది. ఇది రాజ్యాంగం కల్పించిన బాధ్యతల నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గడమే,” అని వేదిక పేర్కొంది. ప్రజాస్వామ్య శక్తులన్నీ ఈ తిరోగమన చర్యను వ్యతిరేకించాలని తమ ప్రకటనలో పిలుపునిచ్చింది.
ఎనిమిది గంటల పని ఆధునిక సమాజం లో కార్మిక హక్కులకు మూలమని, అది పెట్టుబడిదారులు దయతో ఇచ్చిన హక్కు కాదని మానవ హక్కుల వేదిక పేర్కొంది.
కార్మికవర్గం దశాబ్దాల తరబడి చేసిన పొరాటల ఫలితమని, ఈ హక్కును వ్యవస్థీకృతం చేయటం లో అంబేద్కర్ నిర్ణాయక పాత్ర పోషించారని తెలిపింది. ఇప్పుడు కార్పొరేట్ శక్తుల ఒత్తిడి ఫలితంగా కార్మిక హక్కులను తొలగిస్తున్నారని మండిపడింది.
పౌరహక్కుల సంఘం ప్రకారం.. దేశంలో పబ్లిక్ సెక్టార్లలో 11,30,840 కార్మికులు ఉండగా, 8 గంటల పని దినాన్ని కూడా పొందలేని వాళ్ళు దేశవ్యాప్తంగా 47 కోట్ల 60 లక్షల మంది ఉన్నారంది. ప్రజాస్వామ్య వ్యవస్థ వీరికి ఇప్పటికే 8 గంటల పనిని కల్పించలేకపోతోందని, వారికి ముందు ఉపాధి చూపించాలని డిమాండ్ చేసింది.
మొన్నటి వరకు మూడు రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. వీటి రద్దు కోసం ఏడాది కాలం పాటు రైతాంగం పోరాటం చేయాల్సి వచ్చింది. ఈ పోరాటంలో 700లకు పైగా రైతులు మరణించారు. ఒక రకంగా అవి ప్రభుత్వ హత్యలే అని పేర్కొంది.
ఇప్పుడు కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పనిదినం హక్కుతో పాటు ఇతర కార్మిక వ్యతిరేక విధానాలను కార్మిక కోడ్ ల పేరుతో అమలు చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని కార్మికులు, మేధావులు, రైతాంగం అందరు వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నదంది.
కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను వారికి అనుగుణంగా మారుస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ నవంబర్ 26 న కార్మికులు చేస్తున్న ఆందోళనకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నామని ఆ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు ఒక ప్రకటనలో తెలిపారు.
కొత్త కోడ్ ల పై విమర్శ
కొత్త కోడ్ ల ప్రకారం.. కార్మికులను సులభంగా పని నుంచి తొలగించటానికి అవకాశం కల్పించటం తో పాటు సమ్మెకు ముందు యిచ్చే 14 రోజుల నోటిస్ పీరియడ్ ను 90 రోజులకు పెంచడం ద్వారా సమ్మె చేసే హక్కును కుదిస్తున్నాయని కార్మిక సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విశ్రాంత అర్థశాస్త్ర అధ్యాపకులు ప్రొ. డి. నరసింహ రెడ్డి అన్నారు.
“90 శాతం పరిశ్రమల్లో 100 కంటే తక్కువ మంది కార్మికులు పని చేస్తారు. ఇదివరకు 300 మంది కార్మికులు ఉన్న పరిశ్రమల్లో మాత్రమే వాళ్ల తొలగింపుకు అవకాశం వుండేది.
ఇప్పుడు ఆ సంఖ్యను 100 కు తగ్గించారు. యాజమాన్యానికి కార్మికులకు మధ్య జరిగే చర్చలు ఇండస్ట్రీస్ ట్రిబ్యునల్ కు వెళ్ళే అవకాశం వుంది. ఈ చర్చలు కొన్ని సార్లు రెండు లేదా మూడు ఏళ్లు జరుగుతాయి.
ఆ సమయం లో సమ్మె చేయకూడదు అంటే సమ్మెను నిషేదించినట్టే కదా. కోడ్ ల అమలుకు ఇంకా నియమాలు రూపొందించాల్సి ఉంది. అవి లేకుండా వాటి అమలు సాధ్యం కాదు.
జాతీయ స్థాయిలో కనీస వేతనం జీవన వ్యయం, ఆహారం తదితరాల ఖర్చును పరిగణలోకి తీసుకుని నిర్ణయిస్తారు. అయితే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలి. అందరికీ నియామక లెటర్ ఇవ్వాలి అంటున్నారు కాబట్టి వాళ్ళను శాశ్వత ప్రాతిపదికన తీసుకునే అవకాశం పెరుగుతుంది.
తొలగించటం సులభతరం అయ్యాక ఉద్యోగ భద్రత అనేది ఎలాగూ వుండదు. వ్యవస్థీకృత రoగంలో మాత్రమే వున్న పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కాంట్రాక్ట్, గిగ్ కార్మికులకు వర్తింపచేశారు.
ఉచిత ఆరోగ్య చెక్ అప్ కూడా వీరికి వుంటుంది. కాంట్రాక్ట్ కార్మికుల పద్దతిని తొలగించాలనే డిమాండ్ వెలుగులో ఈ మార్పులను చూడాలి. రూల్స్ వస్తే గానీ కాంట్రాక్ట్ పద్దతికి ఈ చట్టాలు ఊతం యిస్తాయా లేదా అనేది చెప్పలేము,” అని ఆయన అభిప్రాయపడ్డారు.
చట్టాలు చేసినా వాటి అమలుకు వ్యవస్థ సహకరించాలి. కనీస వేతనం ఇవ్వాలని చట్టం లో ఉంది అయితే రాష్ట్రం లో దానిని ఎప్పటికప్పుడు సవరించటం లేదు. తగినంత మంది ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ లు లేకపోతే వాటి అమలుకు ఎవరు భాద్యత తీసుకుంటారని కార్మిక నాయకులు ప్రశ్నిస్తున్నారు.
కార్మిక చట్టాలు చేయకుండా వాటిని లేబర్ కోడ్‌లు పేర్కొనడంలోనే సమస్య ఉందని సీఐటీయూ ఆంధ్ర రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి అన్నారు. “చట్టం లో ఇన్స్పెక్టర్ బదులుగా ఫెలిసిటేటర్ అనే పదం వాడారు. తనిఖీలు ఉండరాదనే కార్పొరేట్ల కోర్కెను ఈ విధంగా తీర్చారు.
తనిఖీ లేకుండా ఏ చట్టమైనా అమలు జరుగుతుందా? కార్మిక చట్టాల్లోని జీతం, డీఏ, బోనస్, పీఎఫ్, ఈఎస్ఐ వగైరా ఏ ఒక్క అంశం అమలు జరగకపోయినా- అధికారులు తనిఖీ చేయాలి. ఇకముందు యూనియన్లు ఫిర్యాదు చేసినా, కార్మికులు ఫిర్యాదు చేసినా తనిఖీలు ఉండవు” అని మురళి అన్నారు.
ఇప్పటివరకూ చట్టాలు అమలు చేయకపోతే యజమానికి జైలుశిక్షలు విధించే అవకాశం వుండేదని, ఇకముందు జరిమానాలే గాని జైలు శిక్షలుండవని ఆయన అన్నారు.
“ఈ కారణాల వల్ల లేబర్ కోడ్ లో ఉన్న అంశాలు కూడా అమలు కావు. ఇప్పటి వరకూ ఉన్న 'ట్రైనీ' అనే పదం కూడా మాయమైంది. దానికి బదులు ఫిక్స్ డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ పేరుతో ఎన్ని సంవత్సరాలైనా పర్మినెంట్ చేయకుండా పని చేయించుకునే విధానం అమల్లోకి వస్తుంది” అని మురళీ అన్నారు.
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన కోడ్ లను రాష్ట్ర ప్రభుత్వాలు, కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరపకుండానే అమలు చేయాలనుకుంటోంది. ప్రతి ఏడు జరగాల్సిన ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ 2015 నుంచి మోడీ ప్రభుత్వం జరపలేదు.
2019-20 లో చేసిన కోడ్ లపైన ఇంతవరకు సంప్రదింపులు జరపలేదు. బ్రిటిష్ వాళ్ళు వెళ్లిపోయాక కేంద్రంలోని ప్రభుత్వాలు యిప్పటికి 47 సార్లు ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ లు జరిపాయి. ఈ పరిస్థితి లో లేబర్ కోడ్లను నిజాయితీగా అమలు చేయటం లో కేంద్రం చిత్తశుద్దిని అవి శంకిస్తున్నాయి.
భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 5, ఇంక్లైన్ గని కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి లేబర్ కోడ్ కు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య నాయకత్వం వహించారు.
“దేశంలో అమలులో ఉన్న కార్మిక చట్టాలు ఎవరి భిక్ష కాదు. బ్రిటిష్ కాలం నాటి నల్ల చట్టాలను సవరణ చేసుకొని వాటిద్వారా భారతదేశ కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని” ఆయన ఈ సందర్భంగా అన్నారు.
కొత్త లేబర్ కోడ్స్ వల్ల ఫ్యాకర్టీలు భద్రతా నిబంధనలు బాగా సరళతమరమయిన ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉందని ‘సైంటిస్ట్స్ ఫర్ పీపుల్’ కుచెందిన డాక్టర్ కలపాల బాబూరావు అభిప్రాయపడ్డారు.
“అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఒ) ప్రపంచ దేశాల పనిలో ప్రమాద గణాంకాలు సేకరించి నివేదికలు విడుదల చేస్తుంది. అందులో భారత దేశ గణాంకాలు లేవు. పని ప్రదేశంలో భద్రతకు సంబంధించిన 52 ఒప్పందాలపైన మన దేశం సంతకం చేయకపోవటమే ఇందుకు కారణం.
బలహీనమైన, అసమగ్రమైన పర్యావరణ చట్టాలను ఇంకా బాలహీనపరిచి దానిని సులభ వ్యాపారానికి ప్రోత్సాహకంగా భావిస్తున్నారు. కొత్త చట్టాలతో నిబంధనలు సరళీకరిస్తే ఇవి మరింత పెరుగుతాయి” అని ఆయన అన్నారు.
దేశంలోని 10 ప్రధాన కార్మిక సంఘాలు ఈ కోడ్లకు వ్యతిరేకంగా నవంబర్ 26న దేశవ్యాప్తంగా అన్ని జిల్లా, ముఖ్య కేంద్రాల్లో నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చాయి.

