హైదరాబాద్ లో వరల్డ్ అరీనా పోలో ఛాంపియన్‌షిప్ 2025 పోటీలు షురూ
x

హైదరాబాద్ లో వరల్డ్ అరీనా పోలో ఛాంపియన్‌షిప్ 2025 పోటీలు షురూ

హైదరాబాద్‌లో వరల్డ్ అరీనా పోలో ఛాంపియన్‌షిప్ 2025 పోటీలు సోమవారం ప్రారంభం అయ్యాయి.ఈ పోటీల్లో పలు దేశాలకు చెందిన 80 మంది అగ్రశ్రేణి ప్లేయర్లు పాల్గొంటున్నారు.


హైదరాబాద్ నగరంలో వరల్డ్ అరీనా పోలో ఛాంపియన్‌షిప్ 2025 పోటీలు సోమవారం ప్రారంభం అయ్యాయి.హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ లో జరుగుతున్న ఈ పోలో పోటీల్లో పలు విదేశాలకు చెందిన 80 మంది అగ్రశ్రేణి పోలో ప్లేయర్లు పాల్గొంటున్నారు. భారతదేశంతోపాటు ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, లక్సెంబర్గ్, యూకే, యూఎస్ఏ దేశాలకు చెందిన అంతర్జాతీయ పోలో క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ పోటీలతో హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. ఫిబ్రవరి 24వతేదీ నుంచి మార్చి 2వతేదీ వరకు జరగనున్న పోలో ఛాంపియన్ షిప్ పోటీలు నగర యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.


మూడు ఛాంపియన్ షిప్ కప్ పోటీలు
హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ ఆవరణలో అంతర్జాతీయ పోలో ఛాంపియన్ షిప్ పోటీల్లో భాగంగా గాలక్సీ కప్, ఏఎంఆర్ కప్, తెలంగాణ టోర్నమెంట్ కప్ పోటీలు జరుగుతున్నాయి. హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ (HPRC) సోమవారం నుంచి భారతదేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ అరీనా పోలో టోర్నమెంట్‌ జరుగుతోంది. వరల్డ్ అరీనా పోలో ఛాంపియన్‌షిప్ 2025లో రెండు భారతీయ జట్లు పాల్గొంటున్నాయి.



80 అగ్రశ్రేణి పోలో గుర్రాలు

హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ అధ్యక్షురాలు చైతానియా ఆర్. కుమార్, కార్యదర్శి (అడ్మిన్) రియాజ్ అహ్మద్ భారత పోలో ఆటగాడు అర్సలాన్ ఖాన్ మాట్లాడుతూ, టోర్నమెంట్ కోసం 80 అగ్రశ్రేణి పోలో గుర్రాలను కేటాయించామని, ఈ మ్యాచ్‌లు ఫ్లడ్‌లైట్ల కింద జరుగుతాయని చెప్పారు. ప్రతీ రోజు నాలుగు మ్యాచ్‌లు షెడ్యూల్ చేశామని వారు తెలిపారు.



మూడు ప్రత్యేక విభాగాల పోటీలు

ఛాంపియన్‌షిప్ గెలాక్సీ కప్, ఎఎమ్‌ఆర్ కప్ మరియు తెలంగాణ టూరిజం కప్‌తో సహా మూడు విభాగాల్లో పోలో క్రీడాకారులు పోటీ పడుతున్నారు.దీంతోపాటు హెచ్‌పిఆర్‌సి కొన్ని ప్రత్యేక ప్రదర్శన మ్యాచ్‌లను నిర్వహిస్తుంది. వాటిలో గెలాక్సీ కప్ ఫైనల్‌కు ముందు అంతర్జాతీయ మహిళల అరేనా పోలో మ్యాచ్, ఎఎమ్‌ఆర్ కప్ ఫైనల్‌కు ముందు 'బెస్ట్ ఆఫ్ బెస్ట్' మ్యాచ్ , తెలంగాణ టూరిజం కప్ ఫైనల్స్‌కు ముందు హెచ్‌పిఆర్‌సి కప్ ఉన్నాయి.

ముగింపు రోజున ఫ్యాషన్ షో
ముగింపు రోజున ఫ్యాషన్ షో నిర్వహించనున్నట్లు పోలో నిర్వాహక కార్యదర్శి రియాజ్ అహ్మద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. టీ-షర్టులతో పాటు, ఈవెంట్, పాల్గొనే జట్లు, ఆటగాళ్ల ప్రొఫైల్‌లు,హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ గురించి వివరణాత్మక ప్రత్యేక స్మారక ఎడిషన్‌ను విడుదల చేశామని చైతన్య కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్‌లలో తెలంగాణ టూరిజం, గెలాక్సీ ఇంపెక్స్, ఏఎంఆర్, దివ్యశక్తి రియాలిటీ, ఇన్‌హాబిట్, ఇన్‌క్రెడ్ వెల్త్ మేనేజ్‌మెంట్, ష్రూస్‌బరీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నాయని వారు తెలిపారు.



గుర్రపు స్వారీపై పెరుగుతున్న క్రేజ్

హైదరాబాద్ లో గుర్రపు స్వారీ క్లబ్బులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నందున గుర్రపు స్వారీ అంటే హైదరాబాద్ కు కొత్తగా క్రేజ్ ఏర్పడింది. గుర్రాలు ఇకపై ధనవంతుల కోసమే కాదు అందరికీ అందుబాటులో ఉండేలా హార్స్ రైడింగ్ క్లబ్ లు ఏర్పాటు అయ్యాయి. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు సామాన్యులను గుర్రపు స్వారీ చేయమని ప్రోత్సహించే కొన్ని ఉత్తమ క్లబ్బులకు నిలయంగా ఉంది. బెంగళూరు, చెన్నై, జైపూర్, భోపాల్ మరియు ఢిల్లీ గుర్రపు స్వారీ కార్యకలాపాలకు కేంద్రాలుగా పేరొందాయి. ప్రస్థుతం హైదరాబాద్ కూడా గుర్రపు స్వారీల్లో వేగంగా దూసుకుపోతోంది రియాజ్ చెప్పారు.

హైదరాబాద్‌లో మొట్టమొదటి పోలో క్లబ్
హైదరాబాద్‌లో మొట్టమొదటి పోలో క్లబ్ 1884వ సంవత్సరంలో ఏర్పాటు అయింది. దీంతో పోలో ఔత్సాహికులకు కేంద్రంగా మారింది.1918లో స్థాపించిన హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్, భారతదేశంలోని పురాతన పోలో క్లబ్‌లలో ఒకటిగా నిలిచింది. నిజాం కుమారుడు ప్రిన్స్ అజామ్ జా, నిష్ణాతుడైన పోలో ఆటగాడిగా ఆటను మరింత ప్రాచుర్యంలోకి తెచ్చారు.

ఎన్నెన్నో హార్స్ రైడింగ్ క్లబ్ లు
హైదరాబాద్ నగరంలోని హార్స్ రైడింగ్ క్లబ్ లు యువతకు గుర్రపుస్వారీని నేర్పిస్తున్నాయి. అంతర్జాతీయ పోలో ఛాంపియన్ షిప్ పోటీల నేపథ్యంలో గుర్రపుస్వారీకి మేము సైతం అంటూ యువతీ, యువకులు ముందుకు వచ్చారు. హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్, రాయల్ కాబల్లో క్లబ్, రాంచో డి కాబల్లోస్, హైదరాబాద్ హార్స్ రైడింగ్ స్కూల్,తెలంగాణ పోలో, రైడింగ్ క్లబ్,ఛాంపియన్స్ హార్స్ రైడింగ్ క్లబ్ వంటివి గుర్రపు స్వారీని యువతకు నేర్పిస్తున్నాయి.హైదరాబాద్‌లో కతియావాడి ,మార్వారీ (చేతక్, కాలా ఘోడా) వంటి మేలు జాతి అశ్వాలున్నాయి.


Read More
Next Story