లండన్ లో తళుక్కుమన్న తెలంగాణ పర్యాటకం
ముగిసిన వరల్డ్ ట్రావెల్ మార్కెట్. తెలంగాణ స్టాల్‌కు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్.
వరల్డ్ ట్రావెల్ మార్కెట్.. లండన్ వేదికగా గ్రాండ్‌గా జరిగిన ఈ ఈవెంట్ నేటితో ముగిసింది. విజయవంతంగా జరిగిన ఈ ఈవెంట్ ముగింపు వేడుకలకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షకావత్‌తో కలిసి తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన స్టాల్‌ను షెకావత్ సందర్శించారు. బతుకమ్మ వేడుకలను తిలకించారు. మంత్రి జూపల్లి షెకావత్ ను సన్మానించి, చార్మినార్ జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అద్భుతమైన ప్రదేశాలు, చరిత్ర, వారసత్వ సంపదను ప్రపంచ దేశాల పర్యాటకులకు తెలిసే విధంగా ఈ వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM) లో అంతర్జాతీయ స్థాయిలో తగిన ప్రచారం చేశామని అన్నారు. ఇన్క్రెడిబుల్ ఇండియా స్టాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో యూకేలో భారత హై-కమీషనర్ విక్రమ్ దురై స్వామి, కేంద్ర పర్యాటక శాఖ డీజీ ముగ్ధ సిన్హాతో కలిసి మంత్రి జూపల్లి పాల్గొన్నారు. తెలంగాణలోని రామప్ప దేవాలయం, గోల్కొండ కోట, చార్మినార్, సోమశిల, బుద్ధవనం,, వేయి స్తంభాల గుడి, చారిత్రక వరంగల్ కోట వంటి ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల ఛాయాచిత్రాల ప్రదర్శనను డబ్ల్యూటీఎం వేదికగా ప్రదర్శించామనీ చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా పురావస్తు కట్టడాలను తిలకించేందుకు పర్యాటకులు అత్యంత ఆసక్తి చూపిస్తారని… తెలంగాణలోని ప్రసిద్ధ పురావస్తు కట్టడాల సందర్శనకు ఈ ప్రదర్శన ఫలితంగా పర్యాటకులు భారీగా పెరుగుతారని అంచనా వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణ పర్యాటక రంగానికి ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపును తీసుకువచ్చి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పర్యాటక రంగం ఎలా అభివృద్ధి చెందుతున్నదో కూడా తాము అధ్యయనం చేస్తున్నామని, తెలంగాణ పర్యాటకం సైతం అదే స్థాయికి చేరుకునేలా కృషి చేస్తున్నామని వివరించారు. విదేశీ పర్యాటకుల తాకిడి పెరిగి పర్యాటక రంగం అభివృద్ధి చెందడం వల్ల రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏజెంట్లతో అనుబంధం ద్వారా కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడం, వ్యాపారాన్ని విస్తరించడం వంటి అంశాలలో ఈ వరల్డ్ ట్రావెల్ మార్కెట్ అత్యంత ఫలవంతమైందని అన్నారు. నెట్ వర్కింగ్ , వ్యాపార అవకాశాలు, ఆలోచనలు, సమాచార మార్పిడి ద్వారా ట్రావెల్ టూరిజం, పర్యాటక పరిశ్రమకు చెందిన వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఒకే చోట చేర్చడానికి వరల్డ్ ట్రావెల్ మార్కెట్ 2024 కు లండన్ ను వేదికగా ఉపయోగించుకోవడానికి తెలంగాణ పర్యాటక శాఖ తన వంతు ప్రయత్నం చేసిందని పేర్కొన్నారు.
టూరిజం ప్రమోషన్ కోసం రోడ్ షో…
ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు నిర్వహించిన తెలంగాణ పర్యాటక రోడ్ షో లో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు . లండన్ లో స్థిరపడ్డ తెలంగాణ ప్రవాసీయులు పెద్ద ఎత్తున పాల్గొని రోడ్ షో ను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ పర్యాటక అభివృద్ధికి చేయూతనివ్వలని, తెలంగాణ పర్యాటక ప్రమోషన్ ప్రమోషన్ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టాలని, విదేశీయులు తెలంగాణ సందర్శించేలా ప్రోత్సహించి, పర్యాటకానికి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని సూచించారు.తెలంగాణలోని పర్యాటక ప్రాంతాల గురించి ఎండీ ప్రకాష్ రెడ్డి.. పీ పీ టీ ద్వారా వివరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మెహన్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్, పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
చలో ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జూపల్లి
ఇన్క్రెడిబుల్ ఇండియా లో.భాగంగా లండన్ లోని ప్రసిద్ధ గ్రీన్ విచ్‌లో నిర్వహించిన చలో ఇండియా కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షకావత్, యూకే లో భారత హై కమీషనర్ విక్రమ్ దురై స్వామి, కేంద్ర పర్యాటక శాఖ డీజీ ముగ్ధ సిన్హా, గోవా పర్యాటక శాఖ మంత్రి రోహన్ ఖంటే, ఒడిషా డిప్యూటీ సీఎం ప్రవతి ఫరీదా, తెలంగాణ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగానే లండన్ లోని ప్రపంచ ప్రసిద్ధ చారిత్రాత్మక కట్టడాలు, స్మారక చిహ్నాలను మంత్రి సందర్శించారు. బిగ్ బెన్, లండన్ ఐ, బకింగ్ హామ్ ప్యాలెస్ ను మంత్రి సందర్శించారు.