చార్మినార్ చెంత ప్రపంచ సుందరీమణుల సందడి
x
చార్మినార్ చెంత మెరిసిన అందాలభామలు

చార్మినార్ చెంత ప్రపంచ సుందరీమణుల సందడి

నీలిరంగు ఆకాశం...ఎతైన పురాతన చార్మినార్ ను తిలకించేందుకు ప్రపంచ సుందరీమణులు తరలివచ్చారు. వారికి రెడ్ కార్పెట్, మార్పా వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు.


నీలిరంగు ఆకాశం...ఎతైన పురాతన చార్మినార్, ఈ చార్మినార్ పై ఎగురుతున్న మువ్వన్నెల జెండా, చార్మినార్ అందాలను చూసేందుకు ప్రపంచ అందాల భామలు తరలివచ్చారు. తెలంగాణ పర్యాటక శాఖ బస్సుల్లో వచ్చిన ప్రపంచ సుందరీమణులకు పాత బస్తీలో పాపులర్ అయిన మార్ఫా వాయిద్యాలతో స్వాగతం పలికారు.మార్ఫా వాయిద్యాలతో స్వాగతం మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ కు స్థానికులు స్వాగతం పలికారు.చార్మినార్ అందాలను, చుట్టుపక్కల ప్రాంతాలను అందాల భామలు తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు.

- బస్సు దిగి రెడ్ కార్పెట్ పై నడుస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ అందగత్తెలు చార్మినార్ వద్ద వేదికపైకి వచ్చారు. దీంతో చార్మినార్ చెంత అందాల భామలు మెరిశారు.



హైదరాబాద్ గొప్ప వారసత్వానికి చిహ్నంగా ఉన్న ఈ గంభీరమైన చార్మినార్ అంతర్జాతీయ అందాల భామలను విశేషంగా ఆకట్టుకుంది. ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ ఈవెంట్‌ను నిర్వహించడానికి హైదరాబాద్ నగరం సిద్ధం కాగా చార్మినార్ గాంభీర్యాన్ని చూసి మిస్ వరల్డ్ పోటీదారులు మంత్రముగ్ధులయ్యారు.




అందాలభామల నృత్యం

మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన 109 దేశాల అందాల భామలు మంగళవారం ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ వద్ద హెరిటేజ్ వాకింగ్ చేశారు. నాలుగు ప్రత్యేక బస్సుల్లో చార్మినార్ వద్దకు వచ్చిన 109 దేశాల సుందరీమణులకు పాత బస్తీలో పాపులర్ అయిన మార్ఫా వాయిద్యాలతో స్వాగతం పలికారు.అందాల భామల రాకతో చార్మినార్ వద్ద ప్రత్యేకంగా ఫోటోషూట్ నిర్వహించారు.అరబ్బీ మర్ఫా వాయిద్యాలకు అనుగుణంగా కొందరు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు స్టెప్పులేసి అలరించారు.అందాల రాయబారులతో చార్మినార్ పరిసరాలకు సరికొత్త శోభ వచ్చింది.చార్మినార్ విశిష్ఠతను, చారిత్రక నేపథ్యాన్ని వివిధ దేశాల నుంచి వచ్చిన మిస్ వరల్డ్ ప్రతినిధులకు టూరిజం గైడ్లు వివరించి చెప్పారు.




చుడీ బజార్ లో సందడి

చార్మినార్ సమీపంలోని చుడీ బజారులో ఎంపిక చేసిన తొమ్మిది దుకాణాల్లో వివిధ రకాల గాజులు, ముత్యాల హారాలు అలంకరణ వస్తువులను అందాల భామలు షాపింగ్ చేశారు. హైదరాబాద్ బ్యాంగిల్స్, ముజీబ్ బ్యాంగిల్స్, కనహయ్యలాల్, మోతిలాల్ కర్వా, గోకుల్ దాస్ జరీవాల, కె ఆర్ కాసత్, జాజు పెరల్స్ ఏ హెచ్ జరీవాల, అఫ్జల్ మియా కర్చోబే వాలే దుకాణాల్లో షాపింగ్ చేశారు. గాజులు తయారు చేసే విధానాన్ని సుందరీమణులు పరిశీలించారు. అనంతరం సుప్రసిద్ధ చౌహన్లా ప్యాలెస్ లో ఏర్పాటుచేసే విందుకు హాజరయ్యారు. మిస్ వరల్డ్ భామలకు మెహందీ వేయడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.నిజామి సాంప్రదాయ దుస్తులను కూడా ధరించడానికి ఏర్పాట్లు చేశారు.



తెలంగాణ పర్యాటకంపై సినిమా ప్రదర్శన

తెలంగాణ రాష్ట్రంలో వివిధ పర్యాటక ప్రాంతాల విశిష్ఠతను తెలిపే సినిమాలను ప్రదర్శించారు. చౌమహల్లా ప్యాలెస్ లో నిజాం ఉపయోగించిన యుద్ధ ఆయుధాలు, గృహోపకరణ సామాగ్రి, నిజాం నవాబులు ఉపయోగించిన వివిధ రకాల వస్తువులు, ఓల్డ్ సిటీ సంస్కృతీ, సాంప్రదాయాలను తెలియజేసే ఫోటో ప్రదర్శనలను మిస్ వరల్డ్ భామలు తిలకించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

చార్మినార్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
చార్మినార్ వద్ద 72వ మిస్ వరల్డ్ 2025 హెరిటేజ్ వాక్, చౌమహల్లా ప్యాలెస్‌లో మే 13 మంగళవారం జరగనున్న స్వాగత విందు దృష్ట్యా హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఓల్డ్ సిటీలోని అనేక కీలక మార్గాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వాహనాల రాకపోకలు పరిమితం చేశారు.

మైమరిపించేలా ఓరుగల్లు అందాలు..ప్రపంచ సుందరీమణుల రాక రేపు
మిస్ వరల్డ్ అందాల భామలు బుధవారం వరంగల్​, ములుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రపంచ అందకత్తెల రాక కోసం ఓరుగల్లు ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.ఓరుగల్లు అంటేనే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు చరిత్రకు నిలువెత్తు నిదర్శనం.వరంగల్ భవ్య దివ్య నవ్య నగరంగా పేరు గాంచింది. కాకతీయ సామ్రాజ్య రాజధాని నగరం, రమణీయ శిల్ప సౌందర్యం, అద్భుతమై ఆలయాలు,అలరించే రాజస కట్టడాలు వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆలయం.ఒకటి కాదు రెండూ కాదూ..వేయి స్తంభాలతో కొలువైన కోవెల నగరం.త్రినగరిలో.. కొలువైన త్రికూటాలయం..వరంగల్ నగరానికి వన్నె తెచ్చిన కట్టడాలు అనేకం..కాకతీయ రాజుల కట్టడాలు.. నేటికీ ఆనాటి చరిత్రకు నిలువెత్తు నిలబడి ఉన్న సాక్ష్యాలు..వరంగల్ కోట కాకతీయ సామ్రాజ్య కాలంలో ఒక ఐతిహాసిక దుర్గం..కాకతీయులు దీన్ని అద్భుతంగా నిర్మించారు.



రామప్ప ప్రత్యేకత

వరంగల్ కోటలోని కీర్తి తోరణాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంగా ఎంచుకుంది. తద్వారా తెలంగాణ సాంస్కృతిక గుర్తింపును ప్రపంచవ్యాప్తంగా చాటుతోంది.దీంతోపాటు రామప్ప ఆలయం కాకతీయ రాజవంశం ఆధ్వర్యంలో 13వ శతాబ్దంలో అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయాన్ని కాకతీయ రాజు గణపతి దేవుని సైన్యాధ్యక్షుడైన రేచర్ల రుద్రుడు నిర్మించారు. శిల్పి రామప్ప పేరు మీదుగా ఈ ఆలయాన్ని పిలుస్తారు. ఇంతటి ప్రఖ్యాతులు సాధించిన ఆలయాలు పర్యాటకంగా పేరుగాంచిన ప్రాంతాలను తనివీ తీరా పరిశీంచేందుకు ప్రపంచ సుందరీమణులు తరలిరావడం చూస్తే వరంగల్​ గొప్ప తనం ఇట్టే తెలుస్తోంది.

ప్రపంచ అందగత్తెల రాక రేపు
వరంగల్​ జిల్లా ఖ్యాతి మిస్ వరల్డ్ అందాల భామల రాకతో విశ్వవ్యాప్తం కానుంది. పురాతన రామప్ప ఆలయం, వరంగల్ కోట,వరంగల్‌లోని వేయి స్తంభాల గుడిని సుందరీమణులు బుధవారం సందర్శించనున్నారు. ప్రపంచ సుందరీమణులు (మిస్ వరల్డ్-2025 పోటీదారులు) బుధవారం వరంగల్​ జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్​లోని పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు. బుధవారం తొలుత 35 మందితో కూడిన అందాల భామల బృందం వేయిస్తంభాల ఆలయ నిర్మాణం, శిల్ప వైభవాన్ని, వరంగల్ కోటలో కాకతీయుల కీర్తి తోరణంతో పాటు శిల్పసంపదను పరిశీలిస్తుంది. మరో 22 మంది అందగత్తెలతో కూడిన మరో బృందం హైదరాబాద్ నుంచి నేరుగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి చేరుకుని అక్కడి శిల్ప సౌందర్యాన్ని పరిశీలిస్తారు. పేరిణి నృత్య ప్రదర్శనను తిలకిస్తారు. రాత్రి హరిత హోటల్​లో డిన్నర్ పూర్తి చేసుకుని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు.‘తెలంగాణ జరూర్​ ఆనా’అనే థీమ్​తో ప్రభుత్వం అందాల భామలు ప్రాచీన ఆలయాలు, పర్యాటక ప్రాంతాల అందాలు తిలకించేలా ప్రణాళిక రచించింది. తద్వారా వరంగల్​ ఖ్యాతి ప్రపంచానికి పరిచయం చేయనున్నారు.



చారిత్రాత్మక ఆలయం.. వేయి స్తంభాల గుడి

వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి, రుద్రేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలిచే ఈ చారిత్రాత్మక హిందూ దేవాలయం. తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండలో ఉంది. ఈ ఆలయం కాకతీయ వంశ రాజుల కళా నైపుణ్యానికి, శిల్పకళా చాతుర్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ఆలయం శివుడు, విష్ణువు, సూర్యునికి అంకితం చేశారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చారు. ఈ గుడి క్రీ.శ. 1163లో కాకతీయ రాజు రుద్రదేవుని ఆదేశాల మేరకు నిర్మించారు. ఈ ఆలయం చాళుక్య శైలిలో నిర్మించారు.

కాకతీయుల వైభవానికి నిదర్శనం.. వరంగల్ కోట
వరంగల్ కోట కాకతీయ సామ్రాజ్యం కాలంలో నిర్మితమైన ఒక ఐతిహాసిక దుర్గం. ఈ కోట క్రీ.శ. 8వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు విస్తరించిన చరిత్ర ఉంది. కాకతీయులు ఈ కోటను నిర్మించి, తమ రాజధానిగా చేసుకున్నారు. కాకతీయులు తమ పరిపాలనలో ఈ కోటను దుర్భేద్యంగా, అద్భుత నిర్మాణాలతో తీర్చిదిద్దారు. కోటలోని మూడు వృత్తాకార పొరలు, నాలుగు భారీ రాతి ద్వారాలు (కీర్తి తోరణాలు), స్వయంభూ శివాలయం వంటివి కాకతీయుల నిర్మాణ వైభవానికి నిదర్శనం.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ కోటను ఒక ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ స్థలంగా గుర్తించి, దాని పరిరక్షణ, పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. వరంగల్ కోటలోని కాకతీయ కళా తోరణం (కీర్తి తోరణం) తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంగా గుర్తింపు పొందింది.


Read More
Next Story