అమ్మ మాట వినుంటే హిడ్మా బతికే ఉండేవాడా..!
x

అమ్మ మాట వినుంటే హిడ్మా బతికే ఉండేవాడా..!

ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లి అడవుల్లో భద్రతా బలగాల చేతుల్లో హతమైన హిడ్మా.


మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా.. వాళ్ల అమ్మ పుంజి మాడ్వి మాట వినుంటే బతికే ఉండేవాడు కావొచ్చు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ అల్లూరిసీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో అస్తమించేవాడు కాకపోవచ్చు. అవును.. కొన్ని రోజుల క్రితమే హిడ్మాకు అతని తల్లి పుంజి మాడ్వి ఓ వీడియో మెసేజ్ చేశారు. అడవిని, ఆయుధాన్ని వదిలి పెట్టాలని, ఇంటికి వచ్చేయాలని కోరారు. ఆమె మాట విని.. హిడ్మా ఆయుధాన్ని వదిలి ఉంటే, జనజీవన స్రవంతిలో కలిసి ఉంటే.. ఇప్పుడు కథ వేరేలా ఉండేదేమో. కానీ ఇప్పుడు భద్రతా బలగాల చేతిలో హిడ్మా హతమయ్యాడు. తల్లి మాట అతని చెవికి చేరిందో లేదో తెలీదు కానీ.. మంగళవారం అతడు భద్రతాబలగాలతో జరిగిన కాల్పుల్లో మరణించాడు.

ఇంటికి వచ్చేయ్ బిడ్డా: పుంజి

మావోయిస్ట్ పార్టీలో హిడ్మా ఎంతటి అగ్రనేతో, అతని కోసం ఎన్ని రాష్ట్రాలు రాత్రింబవళ్లు గాలిస్తున్నాయో పుంజికి తెలుసో లేదో కానీ.. ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ వర్మతో మాట్లాడిన తర్వాత.. ఆమె తన కొడుకు హిడ్మాను కోరింది ఒకటే. ఇంటికి తిరిగి వచ్చేయమని. ‘‘నా కొడుకు ఎక్కడ ఉన్నాడో? ఏం చేస్తున్నాడో? నాకూ తెలీదు. ఇప్పటికి అయినా ఇంటికి వచ్చేయ్ బాబు. కష్టపడి పనిచేసుకుని బతుకుదాం. ప్రశాంతంగా జీవిద్దాం’’ అని ఆమె కోరింది. కళ్ల నుంచి బయటకు దూకడానికి సిద్ధంగా ఉన్న కన్నీటిని ఆపుకుంటూ ఆమె హిడ్మాను కోరింది అదొక్కటే. కానీ ఆ కల నెరవేరలేదు.

ఇంతలోనే మారేడుమిల్లి అడవుల్లో భద్రతాబలగాలు కూంబింగ్ చేయడం.. ఎదురుకాల్పులు జరగడం.. అందులో హిడ్మ మరణించడం జరిగిపోయాయి. ఈ కూంబింగ్‌లో హిడ్మాతో పాటు అతని సతీమణి కూడా మరణించారు. ఆమెపై కూడా రూ.50లక్షల రివార్డ్ ఉంది. మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో ఒకరైన మద్వి హిడ్మా మృతి చెందినట్టు ఏపీ పోలీసులు మంగళవారం మధ్యాహ్నం ప్రకటించారు.

అమ్మ మాట వినుంటే కథ వేరే..

అలా కాకుండా తన తల్లి చెప్పినట్లు హిడ్మా కూడా లొంగిపోయి ఉంటే.. కథ వేరేలా ఉండేది. తన భార్యతో కలిసి తల్లి దగ్గర ఉండేవాడు. మల్లోజులకు కల్పించినట్లు హిడ్మాకు కూడా జీవనాధారం కోసం ఉద్యోగం ప్రభుత్వమే కల్పించి ఉండేది. అతడు జీవించడానికి ఆర్థిక సహాయం కూడా అందించి ఉండేది. అతను లొంగిపోయి ఉంటే మరెందరో మావోయిస్ట్‌లు కూడా అతనిని దర్శంగా తీసుకుని జనజీవన స్రవంతి బాట పట్టి ఉండేవారు. మావోయిస్ట్ రహిత భారతదేశ నిర్మాణంలో చిందే రక్తం తగ్గి ఉండేది.

Read More
Next Story