యాదాద్రిని బాగు చేశారు, భద్రాద్రిని వదిలేశారు
కేసీఆర్ పాలనలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు కానీ, భద్రాద్రిలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధిని మరిచారు.
గల గల పారుతున్న గోదావరి నదీ తీరాన...అటవీప్రాంతానికి చేరువలో భద్రాచలంలో వెలసిన శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఎంతో పురాతనమైనది. భక్తుల పూజలందుకుంటున్న సీతారామ చంద్రస్వామి దేవాలయం ప్రతీరోజూ వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతోంది. కానీ భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు పలు అవస్థలు పడుతున్నారు.
- భద్రాచలంలోని అతి పురాతన ఆలయమైన శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించింది. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని 780 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన గత కేసీఆర్ సర్కారు భద్రాద్రి రామాలయం అభివృద్ధిని మరిచారు.
- తెలంగాణ ఆవిర్భవించాక భద్రాద్రి రామాలయం అభివృద్ధిపై గత కేసీఆర్ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో పదేళ్ల పాటు సీఎంగా పనిచేసిన కేసీఆర్ రామాలయం అభివృద్ధికి నయాపైసా నిధులు కూడా కేటాయించలేదు.
ప్రకటించినా నిధులివ్వని కేసీఆర్
భద్రాచలం పర్యటనల్లో గత సీఎం కేసీఆర్ రామాలయం అభివృద్ధికి మూడు విడతలుగా రూ.150 కోట్లను ఇస్తామని ప్రకటించారు. కానీ గత పదేళ్ల పాలనలో రామాలయం అభివృద్ధికి నయాపైసా నిధులు రాల్చలేదు. దీంతో రామాలయం అభివృద్ధి కేసీఆర్ ప్రకటనలకే పరిమితమైంది.శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణోత్సవానికి సీతారాములకు పట్టువస్త్రాలను సీఎం అందించే సంప్రదాయాన్ని కూడా గత సీఎం కేసీఆర్ పాటించలేదు.
ఎన్నెన్నో సమస్యలు
భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానాన్ని సందర్శించే భక్తులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. రామాలయ పడమర దిగువ మెట్లు వరదనీటిలో తరచూ ముంపునకు గురవుతున్నాయి. గోదావరి బ్యాక్ వాటర్. డ్రెయినేజీ వాటర్ వల్ల మెట్ల వద్ద నడుంలోతు వరద వస్తోంది. దీన్ని నివారించాల్సి ఉంది. భక్తుల వసతికి గదులు, కాటేజీలు, డార్మిటరీలు తక్కువగా ఉన్నాయి. దీంతో భక్తులు బస కోసం ప్రైవేటు హోటళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రస్థుతం ఉన్న కాటేజీలను దాతలు నిర్మించినవి తప్ప దేవాదాయ శాఖ దీనికి నిధులు కేటాయించలేదు. నిత్యాన్నదాన సత్రం వరదల వల్ల తరచూ ముంపునకు గురవుతున్న నేథ్యంలో దీన్ని మరోచోట ఎత్తైన ప్రదేశంలో నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.
నత్తనడకన ఆలయ అభివృద్ధి పనులు
ప్రసాద్ స్కీం కింద కేంద్ర ప్రభుత్వం భద్రాచలం ఆలయం అభివృద్ధి కోసం రూ.42కోట్లను కేటాయించినా, పనులు మాత్రం నత్తనడకగా సాగుతున్నాయి. ఈ పనులను రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ శంకుస్థాపన చేశారు. రామాలయంలో అధునాతన సౌకర్యాల కల్పన, క్యూలైన్ల విస్తరణ, వసతుల కల్పన పనులు చేయాల్సి ఉంది.
ఈఓ ఎల్ రమాదేవి రాకతో అవినీతికి అడ్డుకట్ట
శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఈఓగా రమాదేవి రాకతో ఆలయంలో అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట పడింది. అవినీతి అక్రమాలకు పాల్పడిన ఆరుగురు అధికారులపై ఈఓ సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో పాటు అక్రమాలకు చెక్ పెట్టేలా దర్శనం, వివిధ పూజలు, గదుల కేటాయింపు, విరాళాల ప్రక్రియను ఆన్ లైన్ చేయించారు. శ్రీ మద్రామాయణ పారాయణం, శాశ్వత అలంకరణ, శాశ్వత నిత్య కల్యాణం,శాశ్వత పట్టాభిషేకం,శాశ్వత లక్ష కుంకుమార్చనశాశ్వత భోగంఉచిత నిత్య ప్రసాద వినియోగం,శాశ్వత అన్నదానం,శాశ్వత వెండి రథ సేవ,శాశ్వత సుదర్శన హోమం,శాశ్వత వస్త్ర అలంకారం,శాశ్వత పుష్ప అలంకరణ,భద్రుని ఆలయంలో శాశ్వత అభిషేకం,ముత్యాల తలంబ్రాల విక్రయాలను ఆన్ లైన్ చేసి పారదర్శకంగా భక్తులకు సేవలందిస్తున్నారు. ఆన్ లైన్ సేవలతో గతంలో రూ.23కోట్లు ఉన్న ఆలయ ఆదాయం రూ.67 కోట్లకు పెరిగింది.
భద్రాద్రి రామాలయం విస్తరణపై రేవంత్ సర్కారు దృష్టి
భద్రాద్రి రామాలయం విస్తరణకు రేవంత్ సర్కారు దృష్టి సారించింది. 43 ఇళ్లను తొలగించి వారికి పునరావాసం కల్పించి దేవాలయాన్ని విస్తరించాలని నిర్ణయించారు. రామాలయం విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ,60కోట్లను కేటాయించింది.
భద్రాద్రి అభివృద్ధికి బాటలు వేసిన తుమ్మల
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రిలోని శ్రీ సీతారామ చంద్రస్వామి భక్తుడు. గతంలో ఆయన రాముల వారి సన్నిధిలో తలనీలాలు సమర్పించారు. గతంలో రోడ్డు భవనాల శాఖ మంత్రిగా ఉన్నపుడు అప్పటి ఖమ్మం జిల్లా కలెక్టరు ఎ గిరిధర్ కలిసి భద్రాచలం దేవాలయం అభివృద్ధికి బాటలు వేశారు.గోదావరి తీరంలో కరకట్టతోపాటు పుష్కర ఘాట్లను నిర్మించారు.ఆలయంలో పలు వసతి సౌకర్యాలు కల్పించారు.
దేవాలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు...
దేవాలయ భూములు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు...
రాష్ట్ర విభజనలో విశిష్ఠ మైన పురాతన భద్రాచలం సీతారాముల వారి దేవాలయం తెలంగాణ పరిధిలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చింది. కానీ ఈ దేవాలయం కింద ఉన్న దేవుడి మాన్యం వ్యవసాయ భూములు మాత్రం ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోకి వచ్చాయి. దీంతో భద్రాచలం దేవస్థానం ఆధీనంలోని భూములను తెలంగాణ పరిధిలోకి బదలాయించాలని ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలోనూ దేవాలయ భూములున్న ఏపీ గ్రామాలను తెలంగాణలో కలపాలని మంత్రి కోరారు.
భద్రాద్రి ఉత్సవాలు నిర్వహించాలి
భద్రాచలంలో గోదావరి తీరాన ఇసుక తిన్నెల్లో గతంలో మంత్రి తుమ్మల ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రాద్రి ఉత్సవాలు మళ్లీ నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు.ఈ ఉత్సవాల సందర్భంగా సంప్రదాయ బద్ధంగా ప్రముఖులను రప్పించి వారి ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భద్రాద్రి ఉత్సవాల నిర్వహణతో గతంలో భద్రాద్రి రామాలయ ప్రాభవం పెరిగింది. భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మంత్రి తుమ్మల నిర్వహించిన భద్రాద్రి ఉత్సవాలతోనే భద్రాద్రి రాముడి ప్రాభవం పెరుగుతుందని రామభక్తుడు భద్రాచలంకు చెందిన శ్రీపాద శ్రీధర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
భద్రాద్రి రాముడికి త్వరలో పేటెంట్
భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి పేటెంట్ తీసుకునేందుకు తాము తెలంగాణ దేవాదాయ శాఖ ద్వారా తాము త్వరలో దరఖాస్తు చేస్తామని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాదేవి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. భద్రాచలం రాముల వారి ఆలయం పేరిట అనుమతి లేకుండా కల్యాణాలు, జపాలు చేయడాన్ని తాము అనుమతించేది లేదని ఈఓ స్పష్టం చేశారు.
ఖగోళ యాత్రకు దేవాలయంతో సంబంధం లేదు...
శ్రీరామ టెంపుల్ ఆఫ్ యూఎస్ఏ ఆధ్వర్యంలో అమెరికాలోని అట్లాంటాలో రామాలయాన్ని నిర్మిస్తున్ననిర్వాహకులు ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 17వతేదీ వరకు ఖగోళ యాత్ర నిర్వహించారు.ఈ ఖగోళ యాత్రను భద్రాద్రి రామాలయం తరపున చేస్తున్నట్లు ఉందని, ఈ ఖగోళ యాత్ర ద్వారా భక్తుల నుంచి విరాళాలు వసూలు చేయడం దైవ ద్రోహమని ఈఓ రమాదేవి చెప్పారు. ఖగోళ యాత్ర ముగింపు సందర్భంగా భద్రాచలం దేవాలయం నిర్వహిస్తున్నట్లుగా ఓ ప్రైవేటు సత్రంలో శాంతి కల్యాణం చేపట్టారని, దీంతో దేవస్థానానికి ఎలాంటి సంబంధం లేదని ఈఓ చెప్పారు. దీని గురించి తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనరుకు సమాచారం అందించామని,దీనిపై త్వరలో నివేదిక సమర్పిస్తామన్నారు.భద్రాచలం రామాలయం ప్రధాన అర్చకుడు సీతారామానుజా చార్యులు, అర్చకుడు సీతారాం లు ఖగోళ యాత్రలో పాల్గొన్నారని, ఈ ఖగోళ యాత్రకు, భద్రాద్రి దేవాలయానికి ఎలాంటి సంబంధం లేదని ఈఓ వివరించారు.
పన్నెండేళ్లుగా భద్రాద్రి రాముడికి ట్రస్టు బోర్డు ఏది?
భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి గడచిన 12 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ట్రస్టుబోర్డును ఏర్పాటు చేయలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం, యాదాద్రి దేవాలయం తరహాలో భద్రాద్రి రామాలయానికి ట్రస్టుబోర్డు ఏర్పాటు చేయడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరి సారిగా 2012వ సంవత్సరంలో కురిచేటి పాండురంగారావు ఛైర్మన్ గా ట్రస్టు బోర్డు పనిచేసింది.
భద్రాద్రి రాముడిపై భక్తితో...
భద్రాద్రి రాముడిపై ఉన్న అపార భక్తితో తన తల్లిదండ్రులు శ్రీపాద రామశర్మ, పద్మిని వరంగల్ నుంచి భద్రాచలం వచ్చి స్థిరపడ్డారని శ్రీపాద శ్రీధర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగ పదవీ విరమణ చేశాక ప్రతీరోజూ తెల్లవారుజామునే మొదటిసారి రాముల వారిని దర్శనం చేసుకునే వారని శ్రీధర్ గుర్తు చేసుకున్నారు. భద్రాద్రి రాముల వారికి ఎందరో భక్తులున్నారని, ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అధునాతన సౌకర్యాలు కల్పించాలని సీనియర్ జర్నలిస్ట్ శ్రీధర్ సూచించారు.
Next Story