హనీ ట్రాపులో ఇరుక్కున్న యోగా గురువు
x
Honey Trap

హనీ ట్రాపులో ఇరుక్కున్న యోగా గురువు

దొరికిన దాంతో అమర్ తృప్తిపడుంటే గురువుగారి కోరికల మూల్యం రు. 50 లక్షలుగా ఉండేది


ఓ ముఠా హనీట్రాప్ ప్రయోగించి యోగాగురువు నుండి రు. 50 లక్షలు దోచుకున్నది. తీసుకున్న డబ్బు సరిపోలేదని మరో రు. 2 కోట్లు డిమాండ్ చేయటంతో గురువు పోలీసులను ఆశ్రయించాడు. దాంతో కథంతా అడ్డంతిరిగింది. విషయం ఏమిటంటే రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ(Chevella)లో రంగారెడ్డి అనే వ్యక్తి యోగాశ్రమం(Yoga Asram) నిర్వహిస్తున్నాడు. యోగా ద్వారా ఎలాంటి రోగాలను అయినా నయంచేస్తానని ప్రచారం చేసుకున్నాడు. ఒకరోజు అనారోగ్యంగా ఉందని చెప్పి ఇద్దరు మహిళలు(Honey Trap) ఆశ్రమానికి వచ్చారు. వీళ్ళిద్దరినీ పరీక్షించిన గురువు కొంతకాలం ఆశ్రమంలోనే ఉంటే అనారోగ్యాన్ని నయంచేస్తానని హామీ ఇచ్చాడు.

గురువు చెప్పినట్లే ఇద్దరు మహిళలు ఆశ్రమంలో చేరారు. గురువుతో మహిళ పరిచయంకాస్త కొంతకాలానికి స్నేహితంగా మారింది. స్నేహితం మరికొంతకాలానికి సన్నిహితంగా మారింది. దాంతో మహిళ్ళలు ఇద్దరు ఒకరికి తెలీకుండా మరొకరు గురువుతో బాగా సన్నిహితంగా ఉండేవారు. వాళ్ళరోగాలు తగ్గాయో లేదో తెలీదు కాని గురువుకు వాళ్ళిద్దరు బాగా సన్నిహితమైపోయారు. ఒకరోజు గురువుకు ఒకకొరియర్ వచ్చింది. అందులో గురువు ఒక మహిళలు ఇద్దరితో బాగా సన్నిహితంగా ఉన్న ఫొటోలు కనిపించాయి. కొరియర్ అందుకుని అందులోని ఫొటోలను చూసిన గురువుకు మతిపోయింది.

తాను మహిళలతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఎవరు తీశారు ? అవి బయటవాళ్ళకి ఎలాగ చేరాయన్న విషయం అర్ధంకాలేదు. ఫొటోలను ఏమిచేయాలని ఆలోచిస్తుండగానే అమర్ అనే వ్యక్తినుండి గురువుకు ఫోన్ వచ్చింది. తనకు వెంటనే రు. 50లక్షలు ఇవ్వకపోతే మహిళలతో సన్నిహితంగా ఉన్నఫొటోలను బయటపెడతానని బెదిరించటం మొదలుపెట్టాడు. బెదిరింపులు కాస్త బ్లాక్ మెయిల్ గా మారింది. దాంతో చేసేదిలేక యోగాగురువు ఫోన్ చేస్తున్న అమర్ కు విడతల వారీగా రు. 50 లక్షలు సమర్పించుకున్నాడు. కొద్దిరోజులు తర్వాత మరో రు. 2 కోట్లు కావాలని అమర్ బ్లాక్ మెయిల్ చేయటం మొదలుపెట్టాడు.

అమర్ చేస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక ఏదైతే అదవుతుందని అనుకుని గురువు చేవెళ్ళ పోలీసులను ఆశ్రయించాడు. అందిన ఫిర్యాదులోని ఫోన్ నెంబర్ ను పోలీసులు ట్రాక్ చేయగా అమర్ అడ్రస్ తెలిసింది. వెంటనే పోలీసులు ఆదివారం ఉదయం దాడిచేసి అమర్ తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బయటపడిన విషయాలు ఏమిటంటే గురువు దగ్గర బాగా డబ్బున్న విషయం తెలుసుకున్న అమర్ ఇద్దరు మహిళలతో మాట్లాడి వాళ్ళని గురువుపైకి హనీట్రాప్ గా ప్రయోగించాడు. అనారోగ్యం సాకుతో మహిళలు ఆశ్రమంలో చేరి పథకం ప్రకారమే గురువుకు సన్నిహితమయ్యారు.

ఇద్దరు మహిళల్లో ఒకరు గురువుతో ఉన్నపుడు రెండో మహిళే మొబైల్ ఫోన్ ద్వారా ఫొటోలు తీసేది. తీసిన ఫొటోను తమ మొబైల్ నుండి అమర్ మొబైల్ కు పంపేవారు. ఈవిషయాలేమీ గమనించని గురువు దొరికారు కదాని ఇద్దరితోను బాగా సన్నిహితమైపోయాడు. వాళ్ళ అనారోగ్యాల మాట దేవుడెరుగు తన కోరికలను మాత్రం గురువు బాగానే తీర్చుకున్నాడు. దాని ఫలితంగాగానే బ్లాక్ మెయిల్, రు. 50 లక్షలు సమర్పించుకోవటం. దొరికిన దాంతో అమర్ తృప్తిపడుంటే గురువుగారి కోరికల మూల్యం రు. 50 లక్షలుగా ఉండేది. గురువు దగ్గర నుండి మరింత డబ్బు గుంజాలన్న అత్యాసకు పోవటంతో చివరకు పోలీసులకు దొరికిపోయాడు.

Read More
Next Story