
అన్న వరుస కావడంతో పెళ్లికి నిరాకరణ... యువతి ఆత్మహత్య
మెదక్ జిల్లా శివ్వంపేట తాళ్లపల్లి తాండాలో అఘాయిత్యం
అన్న వరుస అవుతాడని పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తాళ్ల పల్లి తండాకు చెందిన ధనావత్ స్వరూప, కేశ్య నాయక్ దంపతుల కుమార్తె సక్కుబాయి ఎంబిఏ పూర్తి చేసింది. తాను హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ తో పరిచయమైంది.నారాయణ్ ఖేడ్ కు చెందిన కానిస్టేబుల్ సుధాకర్ తో పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయాన్ని తల్లిదండ్రులకు చేరవేశారు. చేసుకోబోయే వ్యక్తి అయిన సుధాకర్ వివరాలను అమ్మాయి తల్లిదండ్రులు సేకరించారు. సేకరించే క్రమంలో సుధాకర్ తమ దగ్గరి బంధువు అని నిర్ధారణ అయ్యింది. సుధాకర్ అన్న వరుస కావడంతో పెళ్లికి నిరాకరించారు పెద్దలు.
దీంతో సక్కుబాయి తాను హైదరాబాద్ లో మళ్లీ ఉద్యోగం చేస్తానని కుటుంబ సభ్యులకు వేడుకుంది. ఉద్యోగం చేయడానికి తల్లి దండ్రులు ఒప్పుకోకపోవడంతో సక్కుబాయి మానసికంగా కృంగిపోయింది.
మనస్థాపం చెందిన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించి తండ్రికి ఫోన్ చేసింది. తండ్రి ఇంటికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న కూతురును నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. విషయం సీరియస్ గా ఉండటంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే సక్కుబాయి తుది శ్వాస విడిచింది.
గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్న సక్కుబాయి ప్రభుత్వ ఉద్యోగం చేసి తమకు చేదోడు వాదోడుగా నిలుస్తుంది అనుకుంటే ఆత్మహత్య చేసుకోవడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.