యూత్ మద్దతు ఏ పార్టీకో ?
ఆడవాళ్ళ ఓట్లు సరే మరి యువత మాటేమిటి ? మొత్తం 3.4 కోట్ల ఓట్లలో యువత ఓట్లు 1.67 కోట్ల ఉన్నాయి.
పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ముగింపుకొచ్చేసింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తోంది. దాదాపు నెలరోజులపాటు జనాలను హోరెత్తించిన పార్టీలు, నేతల ప్రచారానికి ఈరోజు సాయంత్రమే ముగింపు. 13వ తేదీన జరగబోయే పోలింగులో జనాలు ఎవరికి ఓట్లేస్తారనే టెన్షన్ పార్టీలతో పాటు అభ్యర్ధుల్లో కూడా పెరిగిపోతోంది. ఒకపుడు ఓటరునాడి పట్టుకున్నట్లు ఇపుడు సాధ్యంకావటంలేదు. ఏవో ప్రత్యేక పరిస్ధితుల్లో జరుగుతున్న ఎన్నికలు లేదా ఉపఎన్నికల్లో మాత్రమే ఓటరునాడి ముందే తెలుస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్లమెంటు ఎన్నికల్లో రెండువర్గాలు చాలా కీలకమైన ఓటర్లుగా మారాయి. మొదటి వర్గం ఎవరంటే మహిళలు. రెండో వర్గం ఎవరంటే యువత. మహిళల ఓట్లలో అత్యధికం తమకే పడతాయని కాంగ్రెస్ పార్టీ గంపెడాశలతో ఉంది.
ఎందుకంటే నాలుగుమాసాల క్రితం అధికారంలోకి వచ్చిన వెంటనే బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, రు. 500కే మూడు సబ్సిడీ సిలిండర్లు, 200 యూనిట్లవరకు ఉచిత విద్యుత్, సున్నా వడ్డీకే మహిళా సంఘాలకు అప్పుల్లాంటి పథకాలు అమలుచేస్తున్నాం కాబట్టి ఆడోళ్ళ ఓట్లు తమకే పడతాయని అనుకుంటున్నారు. ఇలా అనుకోవటంలో తప్పులేదు. మహిళల ఓట్లు సుమారు 1.4 కోట్లదాకా ఉన్నాయి. మొత్తం మహిళలందరు కాకపోయినా మెజారిటి ఓట్లు తమకే పడతాయని రేవంత్ రెడ్డి గట్టినమ్మకంతో ఉన్నారు. ఆడవాళ్ళ ఓట్లు సరే మరి యువత మాటేమిటి ? మొత్తం 3.4 కోట్ల ఓట్లలో యువత ఓట్లు 1.67 కోట్ల ఉన్నాయి. ఇందులో మహిళా యూత్ ఓట్లు కూడా కలిసే ఉన్నాయి. 1.67 కోట్ల ఓట్లంటే మొత్తం ఓట్లలో సుమారు 50 శాతం ఓట్లన్నమాట. అందుకనే అన్నీపార్టీలు యువ ఓట్లపైన బాగా టార్గెట్ చేశాయి. యువత ఓట్లంటే 18-39 మధ్య వయస్సున్న వాళ్ళు. వీళ్ళని ఆకర్షించటం కోసం ప్రతిపార్టీ కూడా యూత్ వింగులు ఏర్పాటుచేసి ఆకట్టుకునేందుకు నానా అవస్తలు పడుతున్నాయి.
అందుబాటులోని సమాచారం ప్రకారం యువ ఓటర్లు ఎక్కువగా ఉన్న రెండు నియోజకవర్గాలు మల్కాజ్ గిరి, చేవెళ్ళ పార్లమెంట్లు. మల్కాజ్ గిరిలో 17.90 లక్షల ఓటర్లుంటే, చేవెళ్ళలో 15.17 లక్షల మంది యువ ఓటర్లున్నారు. యువ ఓటర్లు అతి తక్కువగా ఉన్న నియోజకవర్గాలు రెండున్నాయి. మహబూబాబాద్ నియోజకవర్గంలో 7.71 లక్షలుంటే, పెద్దపల్లి నియోజకవర్గంలో 7.96 లక్షల యువ ఓటర్లున్నారు. 18-39 మధ్య వయసుల వాళ్ళు యూత్ అనుకుంటే ఈ ఏజ్ గ్రూప్ నుండి పోటీచేస్తున్న వాళ్ళు ఇద్దరు అభ్యర్ధులున్నారు. పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేస్తున్న గడ్డం వంశీకృష్ణ వయసు 35 అయితే, నాగర్ కర్నూలులో బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న పోతుగంటి భరత్ వయసు 36 ఏళ్ళు. నిజానికి రాజకీయాల్లో 50 ఏళ్ళలోపు వాళ్ళని కూడా యువతనే అంటారు.
ఎందుకంటే పార్టీల్లో ప్రాధాన్యత దక్కాలన్నా, టికెట్లు లేదా పదవులు అందుకోవాలంటే చిన్న విషయంకాదు. జీవితాంతం పార్టీలో పనిచేస్తున్నా ఎలాంటి గుర్తింపుకు నోచుకోకుండానే రాజకీయాల నుండి తప్పుకుంటున్న వారిసంఖ్య లక్షలు, కోట్లలో ఉంటుంది. అలాంటిది చిన్నవయసులోనే పదవులు, టికెట్లు దక్కాలంటే చాలా అంశాలు కలసిరావాలి. అలాంటివాళ్ళు ఇపుడు మూడుపార్టీల్లోను 13 మంది ఉన్నారు. గడ్డం వంశీ(పెద్దపల్లి), నీలంమధు(మెదక్), కడియం కావ్య(వరంగల్), చల్లా వంశీచంద్(మహబూబ్ నగర్), రఘువీర్ రెడ్డి(నల్గొండ), ఆత్రంసుగుణ(ఆదిలాబాద్), చామల కిరణ్ కుమార్ రెడ్డి(భువనగిరి), సునీతారెడ్డి(చేవెళ్ళ) కాంగ్రెస్ అభ్యర్ధులుగా పోటీచేస్తున్నారు. పోతుగంటి భరత్ ప్రసాద్(నాగర్ కర్నూలు), ధర్మపురి అర్వింద్(నిజామాబాద్), శానంపూడి సైదిరెడ్డి(భువనగిరి) మాధవీలత(హైదరాబాద్) బీజేపీ తరపున పోటీలో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ తరపున మాలోతు కవిత(మహబూబాబాద్), గాలి అనీల్ కుమార్(జహీరాబాద్) పోటీచేస్తున్నారు.
ఇక్కడ విషయం ఏమిటంటే పార్టీల వారీగా తీసుకుంటే యువతకు ఉద్యోగాలని కాంగ్రెస్ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నది. అధికారంలోకి రాగానే 30వేలమందికి అపాయిట్మెంట్లు ఇచ్చామని, 11వేల టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించబోతున్నట్లు చెబుతోంది. 586 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన విషయాన్ని రేవంత్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. క్రమం తప్పకుండా ఉద్యోగాల భర్తీచేసి యువతను ఆదుకుంటామని హామీలిస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీయార్, కేటీయార్, హరీష్ రావేమో ముఖ్యమంత్రిని టార్గెట్ చేయటంతోనే కాలంగడిపేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందనే జోస్యాలతో జనాలను ఊదరగొడుతున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే మతాలు, రిజర్వేషన్లతోనే ప్రచారమంతా నెట్టుకొచ్చేస్తోంది. తమకు ఓట్లేసి అత్యధిక ఎంపీలను గెలిపిస్తే తెలంగాణాకు ఇది చేస్తామని బీజేపీ స్పష్టంగా చెప్పలేకపోతోంది. మూడు పార్టీల ప్రచారాలను గమనిస్తున్న యువత ఎవరికి మద్దతుగా నిలుస్తుందో చూడాలి.
ఇదే విషయమై ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తెలంగాణా ఫెడరల్ తో మాట్లాడుతు ‘యూత్ మద్దతు ఎక్కువగా తమకే ఉంటుంద’న్నాడు. ‘మోడి క్లీన్ ఇమేజి, ప్రపంచంలో భారత్ బలోపేతంచేయటంలో నరేంద్రమోడీ చేస్తున్న కృషికి యువత ఆకర్షితులవుతున్న’ట్లు చెప్పాడు. ‘అవినీతిలేని దేశం మోడి వల్ల మాత్రమే సాధ్యమవుతుందని యువత బలంగా నమ్ముతున్నార’న్నాడు. ప్రచారంలో తమను యూత్ ఎక్కువగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పాడు. అలాగే యువజన కాంగ్రెస్ ఖమ్మం అధ్యక్షుడు జావెద్ మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం ‘అమలుచేస్తున్న పథకాలు, ఉద్యోగాల భర్తీకి యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్న’ట్లు చెప్పాడు. మెగా డీఎస్సీతో పాటు గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వటం తమపార్టీకి కలిసొచ్చే అంశాలుగా జావెద్ అభిప్రాయపడ్డాడు. ‘యువతలో ఎక్కువగా రేవంత్ రెడ్డి అంటే క్రేజ్ బాగా కనిపిస్తోంద’ని జావెద్ చెప్పాడు.