‘కాంగ్రెస్ సర్కార్‌ను యువత ఎన్నిటికీ క్షమించదు’
x

‘కాంగ్రెస్ సర్కార్‌ను యువత ఎన్నిటికీ క్షమించదు’

గ్రూప్-1 కొలువులను అంగట్లో అమ్మేసుకున్నారన్న మాజీ మంత్రి కేటీఆర్.


గ్రూప్-1 ఖాళీలను భర్తీ చేసే అంశంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని యువకులు క్షమించరని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు వరకు కల్లబొల్లి కబుర్లు చెప్పి, అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు మొండిచేయి చూపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కార్ చేతకానితనం, కాసులంటే కాంగ్రెస్‌కు ఉన్న కక్కుర్తికి నిరుద్యోగ యువత బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ కక్కుర్తి కోసమే గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు.

మళ్ళీ పరీక్ష జరగాల్సిందే..

‘‘గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను హైకోర్టు చెప్పినట్లు మళ్ళీ నిర్వహించాలి. అంతేకాకుండా మార్చి నెలలో విడుదల చేసిన ర్యాంకులు, మూల్యాంకనం అంశంలో జరిగిన అవకతవకలపై జ్యుడీషియల్ కమిషన్ వేయాలి. అందులో దొంగలు ఎవరు అనేది తేల్చాలి. సర్కారు కొలువుకోసం ఏళ్ల తరబడి కష్టపడి తమ విలువైన సమయాన్నీ, అమ్మా, నాన్నల కష్టార్జితాన్నీ ధారపోసిపోటీ పరీక్షలు రాసే తెలంగాణ యువత నమ్మకాన్ని వమ్ముజేసింది ఈ కాంగ్రెస్ సర్కార్. అసమర్ధత, కాసుల కక్కుర్తి కలగలిసి అనేక అవకతవకలకు కారణమయ్యింది. అంగట్లో కొలువులు అమ్ముకొని నిరుద్యోగుల గొంతుకోసింది’’ అని కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు.

యువత క్షమించదు

‘‘గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో విఫలైమన ఈ ప్రభుత్వాన్ని యువత ఎన్నికటీ క్షమించదు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్ చేసిన మోసపూరిత వాగ్ధానంపై ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి చర్చించాలి. అసలు ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. అందులో అర్హులెందరు.. ప్రభుత్వం అమ్ముకుంటే ఉద్యోగాన్ని కొనుక్కున్నది ఎందరు అనేది తేల్చాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చిన నియామక పత్రాలను కూడా మరోసారి పరిశీలించాలి. వాటిలో ఎన్ని ఉద్యోగాలను అమ్ముకున్నారో నిగ్గు తేల్చాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

అడిగితే అరెస్ట్ చేయడం కాదు: స్వామి యాదవ్

గ్రూప్ - 1 పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనందున నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ వద్ద నిరుద్యోగ విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్‌వీ శాంతియుత నిరసన తెలిపింది. వారిని అడ్డుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని అంబర్ పేట్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈ సందర్భంగానే బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కడారి స్వామి యాదవ్ కీలక డిమాండ్లు చేశారు. ‘‘ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అడిగే వారిని అరెస్టులు చేయడం కాదు.. గ్రూప్ -1పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. జీవో నెం 29 రద్దు చేయాలి జీవో నెం 55 ఇంప్లీమెంటేషన్ చేయాలి. గ్రూప్ -1పరీక్షను రద్దు చేసి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి. హైకోర్టు చెప్పినట్టుగా అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ చేయాలి. గ్రూప్ -1 పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి TGPSC చైర్మన్, కమిషన్ అధికారులు వెంటనే రాజీనామా చేయాలి. లేకుంటే ప్రభుత్వంపై యుద్ధం చేయక తప్పదు గ్రూప్ -1 అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు BRSV పోరాటం చేయక తప్పదు’’ అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే..

మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల లిస్ట్‌ను రద్దు చేసింది. అంతేకాకుండా పునఃమాల్యాంకనం చేయాలంటూ అధికారులకు ఆదేశించింది. సంజయ్ వర్సెస్ యూపీఏస్సీ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తూ తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం. అంతేకాకుండా ఈ ప్రక్రియను ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో మెయిన్స్ పరీక్షలనే రద్దు చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.

Read More
Next Story