ఖైదీల జీవితాల్లో వెలుగు నింపిన ‘జకాత్’
x
Prisoner

ఖైదీల జీవితాల్లో వెలుగు నింపిన ‘జకాత్’

పెట్టీ నేరాల వల్ల జైలు పాలైన ఖైదీల జీవితాల్లో మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ వెలుగు నింపింది. శిక్ష ముగిసినా, అదనపు కాలం ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నారు.


ఆవేశంలో తెలసీ తెలియక చేసిన చిన్న నేరాల్లో కొందరు ఖైదీలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వారి జైలు శిక్ష ముగిసినా, కోర్టు విధించిన జరిమానా డబ్బులు చెల్లించలేక ,అదనపు కాలం ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నారు. ఇలాంటి ఖైదీలకు మేమున్నామంటూ ముందుకు వచ్చిన ఎంపీజే సంస్థ వారి జరిమానాలను చెల్లించి వారిని విడుదల చేయించింది.

- హైదరాబాద్ నగరానికి చెందిన షేక్ రహీం (పేరు మార్చాం) అనే ఖైదీ ఆర్థిక సమస్యలతో మొదటిసారి చిన్న చోరీ చేసి, పోలీసులకు దొరికి కటకటాల పాలయ్యాడు. విద్యాధికుడైన రహీం చోరీ కేసు రుజువు కావడంతో అతనికి మూడు నెలల జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమానాను కోర్టు విధించింది. దీంతో రహీంను పోలీసులు చంచల్ గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇతను మూడు నెలల జైలు శిక్షను పూర్తి చేసినా, జరిమానా చెల్లించేందుకు అతని వద్ద చిల్లిగవ్వలేదు. దీంతో మరో మూడు నెలలపాటు జైలు శిక్షను పొడిగిస్తారు...కానీ జైలు సూపరింటెండెంట్ సిఫారసుతో మొదటిసారి తెలిసీ తెలియక చేసిన నేరానికి జైలులో శిక్ష అనుభవించిన ఖైదీ రహీంకు మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్(ఎంపీజే) జరిమానా చెల్లించి అతన్ని విడుదల చేయించింది. అంతే భార్య, పిల్లలున్న రహీం కుటుంబంలో రమజాన్ పండుగ సందర్భంగా వెలుగులు నిండాయి.
- ఇంట్లో కుటుంబసభ్యులతోనే కొట్లాటకు దిగి దాడి చేసి స్వల్పంగా గాయపర్చిన స్వరూప (పేరు మార్చాం) అనే మహిళా ఖైదీని పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడలోని మహిళా జైలుకు తరలించారు. ఈ జైలులో జడ్జి విధించిన నెలరోజుల జైలు శిక్ష ముగిసింది. అయినా ఆమెకు విధించిన వెయ్యి రూపాయల జరిమానా చెల్లించక పోవడంతో మరో నెలరోజులు జైలులోనే ఉండి పోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మహిళా జైలరు సిఫారసుతో స్వరూపకు చెల్లించాల్సిన జరిమానాను ఎంపీజే స్వచ్ఛంద సంస్థ చెల్లించి, ఆమెను జైలు నుంచి విడుదల చేయించింది. అంతే స్వరూప కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
- పాతబస్తీకి చెందిన ఓ ఫైనాన్సర్ ఓ ఆటోను కిరాయికి మాట్లాడుకొని వెళ్లి తనకు బకాయి చెల్లించలేదని ఓ వ్యక్తిని ఆటోలో కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. ఈ కిడ్నాప్ ను బాధితుడి కుటుంబం వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఫైనాన్సరుతోపాటు కిరాయి ఆటోడ్రైవరు అలీంపై కూడా కిడ్నాప్ కేసు పెట్టి జైలుకు పంపించారు. ఫైనాన్సర్ తన వద్ద ఉన్న డబ్బుతో 8 రోజులకే విడుదల అయ్యాడు. కానీ కిరాయి కోసం వెళ్లిన ఆటో డ్రైవరు అలీం మాత్రం కిడ్నాప్ కేసులో చిక్కుకొని జైలుకు వెళ్లాడు. దీంతో తాము జైలు అధికారుల ద్వారా అలీం అమాయకుడని తెలుసుకొని అతన్ని జామీనుపై ఎంపీజే సంస్థ ప్రతినిధులు జైలు నుంచి విడుదల చేయించారు
- పాతబస్తీకి చెందిన పుచ్చకాయల వ్యాపారం చేసే రమేష్ అనే యువకుడు ఓ పెద్ద కత్తిని తీసుకొని రాత్రివేళ ఇంటికి వెళుతుండగా తనిఖీలు చేస్తున్న పోలీసులు అతన్ని ఆపి, అరెస్ట్ చేసి కేసు పెట్టి జైలుకు పంపించారు. వృత్తిరీత్యా పుచ్చకాయలను కోసేందుకు వినియోగించే కత్తిని తీసుకువెళుతుండగా పోలీసులు కేసు పెట్టారు. ఆరు ఇంచుల కంటే పెద్ద కత్తిని తీసుకువెళుతుంటే కేసు పెడతామని పోలీసులు చెపుతున్నారు. జైలు పాలైన అమాయక రమేష్ కు ఎంపీజే సంస్థ జమానత్ ఇచ్చి విడుదల చేయించింది.


ఎన్నెన్నో పెట్టీ కేసులు...

ఇలా ఎన్నెన్నో కేసులు...మొదటిసారి తెలిసీ తెలియక చేసిన చిన్న నేరాల్లో జైళ్లలో మగ్గుతున్న వారిని విడుదల చేయించడానికి మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ చర్యలు తీసుకుంటోంది. ముస్లిం ఖైదీల విడుదలకు జకాత్ విరాళాలను వినియోగిస్తున్నామని, ముస్లిమేతర ఖైదీల విడుదలకు తమ సంస్థకు సభ్యుల నుంచి వస్తున్న డొనేషన్ల డబ్బును వెచ్చిస్తున్నామని ఎంపీజే సంస్థ ప్రధాన కార్యదర్శి సలీం అల్ హిరీ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. జరిమానాలు చెల్లించలేక జైళ్లలో మగ్గుతున్న పేద ఖైదీల విడుదలకు తాము చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది 130 మంది ఖైదీలకు జరిమానాలు, జమానతు ఇచ్చి జైళ్ల నుంచి విడిపించామని ఆయన వివరించారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి జైళ్లలో మగ్గుతుండటంతో వారి భార్య పిల్లలు పడుతున్న అవస్థలు చూడలేక తాము వారి విడుదలకు జరిమానాలు చెల్లిస్తున్నామని సలీం వివరించారు.

పేద ఖైదీల జరిమానాల చెల్లింపు
పవిత్ర రమజాన్ మాసంలో పేదలను జకాత్(దానం) ద్వారా ఆదుకొమ్మన్న ఇస్లాం ఆదేశాన్ని ఎంపీజే సంస్థ ఆచరణలో అమలు చేస్తోంది. ప్రతీ ముస్లిం తన ఏడాది సంపాదనలో 2.5 శాతం జకాత్ (దానం) చేయాలి. ఈ డబ్బును పేద ఖైదీల విడుదలకు కూడా ఉపయోగించవచ్చని ఎంపీజే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అహ్మద్ హెచ్ షకీల్ ‘తెలంగాణ ఫెడరల్’కు చెప్పారు. ‘‘జైలు శిక్ష అనుభవిస్తున్న 130 మంది ఖైదీల జరిమానాను మేం చెల్లించాం. అదనంగా 35 మంది ఖైదీల బెయిల్ రుసుమును కూడా చెల్లించాం’’ అని ఎంపీజే కార్యదర్శి ఖాసిం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ‘‘కొన్ని కేసుల్లో తమవాళ్లు ఏ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారో కూడా కొన్ని పేద కుటుంబాలకు తెలియదు. కొన్ని కుటుంబాలు రూ.500 చిన్న మొత్తాన్ని కూడా చెల్లించలేని పేదరికంలో ఉన్నాయి. అయితే ప్రతి ఒక్క పేద ఖైదీకి సాయం అందించడమే మా లక్ష్యం’’ అని ఖాసిం పేర్కొన్నారు. తాను అందించిన జకాత్ డబ్బును పేద ఖైదీల విడుదలకు ఉపయోగించడంపై పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యాపారి సంతోషం వ్యక్తం చేశారు. పేద ఖైదీల విడుదలను దైవాదేశంగా భావించి చేస్తున్నామని ఆయన చెప్పారు.

సత్పర్తన కల ఖైదీలనే విడిపిస్తాం...
మొదటిసారి చిన్న చిన్న నేరాలు చేసి జైలుకు వెళ్లి సత్పర్తన ఉన్న వారినే తమ సంస్థ విడుదల చేపిస్తుందని ఎంపీజే ప్రతినిధులు చెప్పారు. చంచల్ గూడ, చర్లపల్లి సెంట్రల్ జైళ్లు, సంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, ఖమ్మం జైళ్ల నుంచి అక్కడి జైలు అధికారులు ఇచ్చిన నివేదికల మీద స్పందించి తాము జరిమానాలు చెల్లిస్తున్నామని ఎంపీజే ప్రతినిధులు వివరించారు. ఖైదీల సత్పర్తనను బట్టి జైలు వార్డర్లు ఇచ్చే నివేదికలపై ఆధారపడి తాము సహాయం చేస్తామని వారు తెలిపారు.

హంతకులు,రేపిస్టులను విడిపించం...
హంతకులు, రేపిస్టులు, డ్రగ్స్ కేసుల్లో దోషులైన ఖైదీలను తాము విడిపించమని ఎంపీజే ప్రతినిధులు చెప్పారు. యాక్సిడెంట్ కేసులు, చిన్నపెట్టీ కేసులు, 498 ఎ కేసుల్లో అమాయకులను జైలుకు పంపిస్తే వారి విడుదలకు తాము డబ్బు చెల్లిస్తామని వారు పేర్కొన్నారు. యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఖైదీల భార్యల ఉపాధి కల్పనకు తాము ఆర్థిక సహాయం చేస్తున్నామని, దీంతోపాటు జైళ్లలో మహిళా ఖైదీల పిల్లలు ఉంటే వారు చదువుకునేందుకు కావాల్సిన పుస్తకాలు, స్టేషనరీని అందిస్తున్నామని ఎంపీజే ప్రతినిధులు చెప్పారు. జైళ్లలో ఖైదీలు చదువుకునేందుకు కూడా తాము పుస్తకాలు అందిస్తున్నామని ఎంపీజే ప్రతినిధులు వివరించారు.






Read More
Next Story